యువత మత్తుకు దూరంగా ఉండాలి

  • మీ ప్రతిభే మీకు గొప్ప శక్తి 
  • మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి
  • కేయూ 24వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపు
కాళోజీజంక్షన్ / హన్మకొండ, ప్రజాతంత్ర నవంబర్ 28 : “మీ ప్రతిభే మీకున్న అత్యంత గొప్ప శక్తి. దానిని కాపాడుకోవడం మీ బాధ్యత అని రాష్ట్ర గవర్నర్, కాక‌తీయ‌యూనివ‌ర్సిటీ ఛాన్స్‌లర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. సమాజాన్ని దిశా నిర్దేశం చేయాల్సిన యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణ నిజాయితీని అనుసరించాలని గవర్నర్, శివప్రతాప్ శుక్లా విద్యార్థులకు పిలుపునిచ్చారు. శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొని విద్యార్థులకు డిగ్రీలు, గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్బంగా ఆయ‌న‌ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో యువత చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం యువత ఆరోగ్యం, విద్య, ప్రతిభ, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2020 లో ప్రారంభించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ మాదకద్రవ్య రహిత దేశ నిర్మాణానికి కీలక జాతీయ ఉద్యమమని గవర్నర్ పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నివారణతో పాటు బాధితులకు చికిత్స, పునరావాసం కల్పించి సమాజంలో తిరిగి భాగస్వాములను చేయడం ఉద్యమ ప్రధాన లక్ష్యమని వివరించారు. విశ్వవిద్యాలయాలు కేవలం విద్యాపట్టాలను అందించే కేంద్రాలే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడానికి దోహదపడాలన్నారు.
ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని అల‌వ‌ర్చుకోండి
విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్.ఎస్.ఎస్ నిర్వహించిన మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో 1,200 మందికి పైగా విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొని ప్రతిజ్ఞ చేయడం అభినందనీయమని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు అన్ని విద్యాసంస్థల్లో విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. పట్టాలు, స్వర్ణ పతకాలు సాధించిన విద్యా విజయాలకు ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుత జీవనమే నిజమైన సార్థకతనిస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం, దేశానికి సేవ చేయడమే నిజమైన విజయమని స్పష్టం చేశారు. “మీ ప్రతిభే మీకున్న అత్యంత గొప్ప శక్తి. దానిని కాపాడుకోవడం మీ బాధ్యత” అని విద్యార్థులకు సూచించారు. యువత తమ ప్రతిభను విద్య, పరిశోధన, సామాజిక సేవ, దేశాభివృద్ధికి వినియోగించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన, క్రమశిక్షణ కలిగిన బాధ్యతాయుత యువశక్తి ద్వారానే మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించగలమని గవర్నర్ ఆశాభావం వ్తక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *