యువతే సమాజాన్ని ముందుకు నడిపించాలి

సైయంట్ లిమిటెడ్ ఫౌండర్ ఛైర్మెన్ డాక్టర్ మోహన్ రెడ్డి పిలువు

కాళోజీ జంక్షన్/ హన్మకొండ, ప్రజాతంత్ర నవంబర్ 28:   విద్యారంగంలో మేధావులైన నవ యువతనే సమాజాన్ని ముందుకు నడిపించాలని సైయెంట్ లిమిటెడ్ ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం కెయు 24వ స్నాతకోత్సవానికి పద్మశ్రీ బీవీఆర్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తన ఉపన్యాసం లో “నేర్చుకో, నిర్మించు, నడిపించు” నినాదంతో యువతకు పిలుపు నిచ్చారు. కుటుంబంలో తొలి గ్రాడ్యుయేట్లుగా నిలిచిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను, గురువులను అభినందించారు. ద్వితీయ శ్రేణి గ్రామీణ ప్రాంత నగరమైన వరంగల్ ఒక లోపం కాదన్నారు. వరంగల్ నుంచి ప్రపంచస్థాయి ఇంజినీరింగ్ సాధ్యమా అని సందేహించినప్పుడు “ఎందుకు కాదు?” అని బదులిచ్చారు. 2016 లో మడికొండ ఇంక్యుబేషన్ సెంటర్‌తో మొదలై 2020 లో ఆధునిక డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పడిందన్నారు. ఇక్కడి యువ ఇంజినీర్లు ప్రపంచ వినియోగదారుల కోసం టెలికాం నెట్‌వర్క్‌లను రూపొందిస్తున్నారని చెప్పారు. ప్రతిభ అంతటా ఉన్నా అవకాశాలు లేవన్నారు. అవకాశం ప్రతిభ వద్దకే వెళ్లాలని పేర్కొన్నారు. ఈ జూన్ లో కాకతీయ యూనివర్సిటీ సహా రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో ఎంఓయూ చేసుకుందని తెలిపారు. ఏఐ, ఆటోమేషన్, బయోటెక్నాలజీ ప్రతి వృత్తినీ మారుస్తున్నాయన్నారు. ఈరోజు ఏమి తెలుసన్నది కాదు, తెలియనిది ఎంత త్వరగా నేర్చుకుంటారన్నదే విద్యకు నిజమైన పరీక్ష అని ఆయన అన్నారు. యూనివర్సిటీ గత ఐదేళ్లలో 3వేలకు పైగా పరిశోధన ప్రచురణలు, ఎనభైకి పైగా పేటెంట్లు సాధించిందని ప్రశంసించారు. ఈ పరిశోధనలు రైతు, రోగి, గ్రామానికి ఎంతవరకు చేరుతున్నాయన్నదే అసలు ప్రశ్న అన్నారు.
చుట్టుపక్కల గ్రామాలను “జీవన ప్రయోగశాలలు”గా మలచుకోవాలని డాక్ట‌ర్‌ మోహ‌న్‌రెడ్డి సూచించారు. పాఠశాల చదువు పూర్తి చేయకపోయినా తక్కువ ఖర్చుతో కలుపుతీత యంత్రం రూపొందించిన కడవెండి మహిపాల్ చారి, చేనేతల కష్టం తగ్గించిన లక్ష్మీ ఆసుయంత్ర రూపకర్త, పద్మశ్రీ చింతకింది మల్లేశం సృజనాత్మక కృషిని ఉదహరిస్తూ అభినందించారు. ఆవిష్కరణ ప్రయోగశాలలోనే కాదని, సమస్యలను ఎదుర్కొనే వ్యక్తుల నుంచీ పుడుతుందన్నారు. ప్రతి అనుబంధ కళాశాల ఏటా ఒక స్థానిక సమస్యను దత్తత తీసుకోవాలని, వాటికి కె-హబ్ ద్వారా మార్గదర్శకులు, పరిశ్రమ, మార్కెట్లను అనుసంధానించాలని కోరారు. వలస అనేది బలవంతం కాకూడదన్నారు. ఎంపిక కావాలని పేర్కొన్న ఆయన, ప్రతి గ్రాడ్యుయేట్ వ్యాపారవేత్త కాకపోయినా వ్యాపారవేత్తలా ఆలోచించాలన్నారు. ఇరవై మందికి ఉపాధి ఇచ్చే సంస్థ, 500 మంది రైతుల ఆదాయం పెంచే సంస్థ కూడా జీవితాలను మారుస్తుందన్నారు. 2047 నాటి వికసిత భారత్‌ను నిర్మించేది యువతరమేనన్నారు. టి-హబ్‌తో అనుసంధానమవుతున్న కె-హబ్ తొలితరం విద్యార్థులు, మహిళలు, గ్రామీణ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. స్వర్ణోత్సవం జరుపుకున్న వర్సిటీకి వచ్చే ఐదేళ్లలో 25 గ్రామీణ ఆవిష్కరణలను సమాజం స్వీకరించడం, 100 విద్యార్థి-అధ్యాపక స్టార్టప్‌లు, ప్రతి అధ్యాపకుడికి అభివృద్ధి అవకాశం అనే మూడు లక్ష్యాలను సూచించారు. గ్రాడ్యుయేట్లకు “ఒక సమస్య – ఒక అడుగు – ఒక సంవత్సరం” అనే సవాలు విసిరారు. ఏడాదిలోగా తమ ఊరిలోని ఒక సమస్యను గుర్తించి, పరిష్కారానికి ఒక ఖచ్చితమైన అడుగు వేయాలని కోరారు. న్యాయం, నిజాయితీ, గౌరవం, చిత్తశుద్ధి, పారదర్శకత విలువలపై ఏదైనా నిర్మించాలని ఉద్బోధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *