– రాహుల్ నేతృత్వంలో కోర్టును ఆశ్రయించిన విపక్షాలు
– సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాధికారంపై నిలదీత
– ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాల వివరాలు వెల్లడించాలని డిమాండ్
– వోటర్ల తొలగింపులు, ఫారం–6 మార్పులపై వివరణ కోరిన ప్రతిపక్షాలు
– సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాధికారంపై నిలదీత
– ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాల వివరాలు వెల్లడించాలని డిమాండ్
– వోటర్ల తొలగింపులు, ఫారం–6 మార్పులపై వివరణ కోరిన ప్రతిపక్షాలు
దిల్లీ, నవంబర్ 16 (ప్రజాతంత్ర ప్రత్యేక వార్త):వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వివాదం సోమవారం మరో కీలక న్యాయపరమైన మలుపు తిరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు, ఇతర ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు, వోటర్ల పేర్ల తొలగింపులు, ఆన్లైన్ ఫారం–6లో మార్పులకు సంబంధించి 48 ప్రశ్నలకు ప్రమాణపూర్వక సమాధానాలు ఇప్పించాలని కోరుతూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రాహుల్ గాంధీతోపాటు మరో పది మంది ప్రతిపక్ష నాయకులు దరఖాస్తు సమర్పించినట్లు న్యాయవార్తా సంస్థ బార్ అండ్ బెంచ్ నవంబర్ 16న వెల్లడించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి, ఎన్నికల సంఘం సమాచార సాంకేతిక విభాగం అధికారుల నుంచి వివరణలు కోరాలని పిటిషనర్లు అభ్యర్థించారు. ఎన్నికల సంఘం ఇప్పటికే సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్లు కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.ముఖ్యంగా ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలను ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవంగా తీసుకున్నారా? లేక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించారా? అన్న అంశంపై పూర్తి రికార్డులు వెల్లడించాలని కోరారు.ఫిబ్రవరి 2025 నుంచి అక్టోబర్ 2026 వరకు ఎస్ఐఆర్, ఎన్నికల సంఘం డిజిటల్ వ్యవస్థ, ఫారం–6 మార్పులు, న్యాయస్థానాల్లో అప్పీళ్లకు సంబంధించి ఇతర ఇద్దరు కమిషనర్లు ఎన్ని సందర్భాల్లో లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేశారో తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే ఎన్నికల సంఘం తన నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నవేనని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల తాజా దరఖాస్తు ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సంఘం డిజిటల్ వ్యవస్థపై కూడా పిటిషనర్లు ప్రశ్నలు లేవనెత్తారు.వోటర్ల డేటాబేస్‌లో మార్పులు చేసే అధికారాలు ప్రైవేటు సంస్థలు లేదా కాంట్రాక్టర్లకు ఉన్నాయా? ఎన్నికల నమోదు అధికారుల ఆదేశాలు లేకుండానే పెద్దసంఖ్యలో నమోదులను తొలగించే అవకాశం ఉందా? అన్న అంశాలపై వివరణ కోరారు.డేటాబేస్‌లోకి ఎవరు ప్రవేశించారు, ఎలాంటి మార్పులు చేశారు అనే వివరాలను గుర్తించే సాంకేతిక తనిఖీకి సంబంధించి ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి చేసిన ప్రతిపాదనపై ఏ చర్యలు తీసుకున్నారో కూడా ప్రశ్నించారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





