రుణ‌మాఫీపై ప్ర‌త‌ప‌క్షాలు కారు కూత‌లు

  • డిసెంబర్‌లో మిగిలిన రైతులకు రుణమాఫీ
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్  ‌రెడ్డి వెల్లడి

అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మిగిలిన రైతులకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు చేస్తున్న‌ కారుకూతలను న‌మ్మొద్ద‌ని చెప్పారు. ఎవరైనా తమకు రుణమాఫీ జరగకుంటే అధికారులతో సంప్రదించాలని అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. డిసెంబర్‌లోపే రూ.13 వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తాం అని అన్నారు. అర్హత ఉన్న పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను దీపావళి కానుకగా ఇవ్వబోతున్నాం. నాడు రాజశేఖర్‌ ‌రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఇళ్లు కట్టించారో ఇప్పుడూ అలాగే ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్‌ ‌చేయిస్తామని హెచ్చరించారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో రైతులు పత్తి పంట నష్టపోయారు. అయితే రైతులకు నష్టం రాకుండా తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. వారికి ఎక్కడా ఇబ్బంది కలగకూడదని విప్లవాత్మక మార్పులు చేశాం. ఇప్పటికే రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం. రుణమాఫీపై ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయి.   సన్నరకం వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పాం.. ఇవ్వబోతున్నాం. ధాన్యంలో తేమ శాతం కోసం ఎండబెట్టుకుని తీసుకెళ్లాలి. సీసీఐ నిబంధనల ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలి. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలి. రైతులు ఫిర్యాదు చేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటాం. అన్నదాతలకు ఎక్కడా నష్టం కలగకుండా చూడాలి. వారి అవసరాలు, కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పొంగులేటి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *