పోటాపోటీగా అధికార విపక్షాల ‘సెంటిమెంట్’ రాజకీయం..
వాడివేడిగా మరోసారి ప్రజల ముందుకు…
నువ్వా..నేనా? అంటూ పోటాపోటీ రాజకీయం మరోసారి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అసలు తెలంగాణ అంటేనే ఓ ఎమోషన్.. పొలిటికల్ గా అది చాలా బలమైన ఆయుధం. ఇప్పుడు రెండు పార్టీలు మళ్లీ ఈ ఆయుధాన్ని తమ వద్దకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అర్థమవుతోంది. టీఆర్‌ఎస్ ను బీఆర్‌ఎస్ గా మార్చడం ద్వారా చాలా నష్టపోయామని అనుకుంటున్న టీఆర్‌ఎస్ మరోసారి పాత చరిష్మాను పొందాలంటే ఉద్యమ గుర్తులన్నీ మళ్లీ ప్రజల ముందు ఉంచాలని అనుకుంటోంది. అందులో భాగమే దీక్షాదివస్. కాంగ్రెస్ కూడా సోనియా గాంధీ అంగీకరించకపోతే అసలు తెలంగాణ వొచ్చేదే కాదని తెలంగాణ తల్లి సోనియా అని అంటున్నారు. పోటాపోటీగా అధికార విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సెంటిమెంట్ రాజకీయాలు కూడా ప్రారంభించాయి. తెలంగాణ సాధనలో కీలక ఘట్టం భావించే కేసీఆర్ ఆమరణ దీక్షను ప్రారంభించిన రోజును ’దీక్షా దివస్’గా బీఆర్‌ఎస్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇందులో విశేషం ఏవిరీ లేదు. నిజానికి బీఆర్‌ఎస్ పార్టీ అస్థిత్వమే తెలంగాణ సెంటిమెంట్.
దీక్షాదివస్ వెనక ఉన్నది తెలంగాణ ప్రజల్లో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ని రగిలించటం మినహా మరొకటి కాదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా దీక్షా దివస్ నిర్వహించేవారు. కానీ అప్పట్లో క్యాడర్ సాదాసీదాగా చేసుకునేది. అధికార పార్టీగా ఉండటంతో అంత ఊపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరంలో ఉన్నారు. రాజకీయంగా యాక్టివ్ గా ఉండటానికి ఇది చాలా అవసరం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ మొత్తం తనదే అని దీని ద్వారా గులాబీ పార్టీ చెప్పదలుచుకుంది. ఆ పార్టీ నేతల ప్రకటనలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తెలంగాణలో ఏడాది కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌కు ఈ సందర్భం ఒక వేదికైంది. అధికారంలో ఉన్నపుడు రాజకీయ పార్టీలకు గతం గుర్తుకు రాదు. పవర్ ఒకసారి చేజారాకే వాటికి తత్వం బోధపడుతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల కొన్న రాజకీయ పరిస్థితులు అందుకు తాజా ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని అటుంచితే… ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి.
పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన నాటి టీఆర్‌ఎస్ .. ప్రస్తుత బీఆర్‌ఎస్ నేతలు గత ఎన్నికల్లో ఓటమిని ఇప్పటికీ జీర్ణించు కున్నట్టు లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నెల నాటికి ఏడాది పూర్తవుతుంది. కాబట్టి, తెలంగా ణలో సమీపంలో ఎన్నికలు లేవు. మరో నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు వొస్తాయి. కేంద్రం జమిలీ ఎన్నికలు ఆలోచన చేస్తే.. మరో ఐదారు నెలలు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలను లోక్ సభతోనే కలుపుతుంది కానీ ముందే నిర్వహించరు. అయినా రాజకీయాలు మాత్రం వేడి తగ్గడం లేదు. మరోవైపు, తెలంగాణ ఏర్పాటు ఘనత తమదే అని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమం చేపట్టింది. తెలం గాణ ఏర్పాటుపై నాటి హోం మంత్రి చిదంబరం తెలంగాణ ప్రకటన రోజు 2009, డిసెంబర్ 9ని బీఆర్‌ఎస్ దీక్షా దివస్ కన్నా బలంగా .. ఘనంగా నిర్వహించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉత్సవాల రాజకీయం జోరుగా నడుస్తోందన్నమాట. చిదంబరం ప్రకటన వెలువడిన రోజును కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన రోజుగా సంబరాలు చేయబోతున్నారు.
సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిం చబోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో బీఆర్‌ఎస్ ఫైనల్ చేసిన విగ్రహం మాత్రం కాదు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా జరిగే ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఉత్సవాల చివరి మూడు రోజుల్లో సచివాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. డిసెంబర్ 9 వ తేదీన ప్రధాన కార్యక్రమం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. ప్రధానంగా 9 వ తేదీన తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమా నికి ఒక లక్ష మంది హాజరయ్యే అవకాశమున్నందున తగు ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. పోటా పోటీగా అధికార విపక్షాల రాజకీయం వాడివేడిగా మరోసారి తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజల్లో విశేషమైన చర్చకు తావిస్తోంది.
-కె. శ్రీనివాస్
(సీనియర్ జర్నలిస్ట్)