- ఆదివాసులను నిర్మూలించడానికే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్
- ఎన్ కౌంటర్ పేరుతో ప్రజల జీవించే హక్కు కాలరాస్తున్నారు
- మండిపడ్డ పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్
ఆదివాసులను నిర్మూలించడానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ అగార్ ను వెంటనే నిలిపివేయాలని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక ప్రతినిధులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ లతో కలిసి ఆయన మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడాన్ని అంగీకరించని ఆదివాసీలను అక్కడ నుండి బయటికి పంపించడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అగారనే అణచివేత పథకాన్ని కొనసాగిస్తున్నదని ఆరోపించారు.
ఈనెల 4వ తేదీన చత్తీస్గడ్ అబూజ్ మాడ్లోని తెల్తులి-నెండూరు అటవీ ప్రాంతంలో వేలాది మంది భద్రతా దళాలు భారీ ఎత్తున దాడి చేసి 31 మంది ఆదివాసులను చంపేశాయని మండి పడ్డారు. ఆదివాసీ హత్యాకాండ రాజ్యాంగ వ్యతిరేకమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మావోయిస్టుల పేరుతో భద్రతా దళాలు కాల్చేసిన వాళ్లలో ఆ పార్టీకి సంబంధం లేని సాధారణ ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాస్తూ ఎన్ కౌంటర్ పేరుతో కాల్చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి జీవించే హక్కు ప్రాణప్రదమైనదని అన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి నమూనా రాజ్యాంగ ఆదర్శాలకు విరుద్ధమైనది కావడంతో ఏకంగా జీవించే హక్కు దెబ్బతిని పోతుందన్నారు. ఆదివాసులను అడవిని పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమాన్ని హక్కులను పట్టించుకోకపోవడంతో వారు అనివార్యంగా అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారన్నారు. ఎన్ కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో వేదిక ప్రతినిధులు అభినవ్ దూరం, నారాయణరావు సాగర్ విరసం, ఏబీఎన్ఎస్ సత్యక్క, బల్ల రవీంద్రనాథ్, మార్వాడి సుదర్శన్, జంజర్ల రమేష్ చంద్రమౌళి, జాన్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రతినిధి గోవర్ధన్ పాల్గొన్నారు.