మేధో తెలంగాణ కోసం కృషి

– ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో యువతకు ప్రోత్సాహం
– పోటీ పరీక్షల్లో సమాకాలీన వార్తా విశ్లేషణల కోసం ‘వార్షిక‘ విడుదల
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం 

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే యువత ఆశలను సాకారం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వివిధ పోటీ పరీక్షలలో యువత విజయం సాధించేందుకు కావలసిన మెళకువలను, శిక్షణను ఉచితంగా అందిస్తూ మేధో తెలంగాణ సాధన దిశగా పయనిస్తోందని, పోటీ పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల పుస్తకాలను యువతకు అందుబాటులోకి తీసుకొస్తున్నదని చెప్పారు. పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందని, 20 నుంచి 25 శాతం ప్రశ్నలు సమకాలీన వార్తలు విశేషాల మీద ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ కరెంట్ అఫైర్స్‌పై సాధికారత సాధించేందుకు ‘వార్షిక 2025’ పేరుతో 2025లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలు, విశేషాలు, వ్యక్తులు, సంఘటనలకు సంబంధించిన సమాహారంగా పుస్తకాన్ని రూపొందించామని చెప్పారు. ఈ పుస్తకంలో రాబోయే ఎండోమెంట్స్ డిపార్టుమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన భారతీయ వైదిక హైందవ విజ్ఞానం పేరుతో ప్రత్యేక సమాచారాన్ని కూడా అందించామని, కరెంట్ అఫైర్స్ మాత్రమే కాక ప్రతి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థికి కావలసిన సాధారణ పరిజ్ఞానాన్ని, భారత రాజ్యాంగం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, భూగోళ శాస్త్రం, భారత దేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఉద్యమం వంటి విశేషాలను ఎన్నిటినో ఈ పుస్తకం అందిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పుస్తకాన్ని బీసీ స్టడీ సర్కిల్ ప్రచురించడం సంతోషదాయకమని, దీనికి సంపాదకత్వం వహించి ఈ పుస్తకాన్ని ప్రచురించిన డైరెక్టర్ మామిడి హరికృష్ణను అభినందిస్తున్నానని అన్నారు. ఉన్నత విద్యావంతులైన యువత ప్రజలకు సేవ చేయడానికి ఉన్న ఒక చక్కని మార్గం ప్రభుత్వోద్యోగం అని, సివిల్ సర్వీసెస్, గ్రూప్ పరీక్షలు, బ్యాంకింగ్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, పోలీస్, రైల్వే, ఉపాధ్యాయులు వంటి ఉద్యోగాల ఎంపికకు  సంబంధించిన పోటీ పరీక్షల కోచింగ్ కోసం ప్రజా ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తూ అభ్యర్థులకు శిక్షణను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 బీసి స్టడీ సర్కిల్స్ ద్వారా అందిస్తోందనీ, ఈ శిక్షణను సక్రమంగా ఉపయోగించుకుని యువత ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే అది ఆ విజేతకు మాత్రమేకాక, వారి కుటుంబానికి, పుట్టిన ఊరుకి, జిల్లాకు, రాష్ట్రానికి కూడా గర్వ కారణమనీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేయడమంటే జాతి నిర్మాణంలో భాగస్వాములు కావడమే అని ఆయన చెప్పారు. అఖిల భారత ఉద్యోగాలను అత్యధిక సంఖ్యలో తెలంగాణ యువత సాధించాలని ప్రభుత్వం భావిస్తోందనీ, దానికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో రాజీవ్ అభయ హస్తం పేరిట ప్రతి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తెలంగాణ యువత కలల్ని సాకారం చేసే ప్రయత్నం చేస్తున్నదని మంత్రి పొన్నం గుర్తు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *