- దేశం కోసం ప్రాణాలు, పదవుల త్యాగం
- రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవంలో
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారని ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతీ ఏటా ఈ యాత్రను ముందుకు వెళుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయాలతోనే దేశంలో పేదలకు మేలు జరిగిందని అన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని, ప్రధాని పదవులను త్యాగం చేసిన ఘనత సోనియా, రాహుల్ గాంధీదని తెలిపారు. పదవులను ఇతరులకు ఇచ్చి దార్శనికతను చూపిన గొప్ప వ్యక్తులు అని కొనియాడారు. పేదలకు మేలు జరిగేది గాంధీ కుటుంబంతో మాత్రమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్స్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన గీతా రెడ్డిని సద్భావన అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమని అన్నారు. రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడే వారిని చూశామని, కానీ 2023 ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన గొప్ప వ్యక్తి గీతారెడ్డి అని కొనియాడారు. మత సమరస్యాన్ని కాపాడుతూ తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఆక్రమణదారుల పాలిట భూతం హైడ్రా అని, ప్రభుత్వ భూములను, నాలాలు, చెరువులను ఆక్రమించుకుని పెద్ద పెద్ద భవంతులు కట్టిన వారిపై హైడ్రా అంకుశంలా పనిచేస్తుందని హెచ్చరించారు. మదపుటేనుగులను అణచడానికి హైడ్రా పనిచేస్తుందని, కొందరు దీన్ని అడ్డుకోవాలని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని, రాష్ట్ర ఆర్ధిక మూలాలను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దని, వారికి తాను హామీ ఇస్తున్నానని, తమ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.





