16 అక్టోబర్ నాడు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 1981 నుండి ప్రతీయేడు ఈ రోజున ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుతారు. గాలి, నీరు తర్వాత మానవునికి అవసరమైన మూడవ అతి ముఖ్యమైనది ఆహారం. ప్రతీ ఒక్కరికీ వైవిధ్యమైన పోషకార లభ్యత, సరైన పోషణ, ఆర్థిక స్థోమత, ఆహార భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రతీ దేశం మీద ఉంది. ప్రపంచ వ్యాప్తంగా జనాభాకు తగినంత ఆహారాన్ని ఉత్పత్తి అవుతుంది. కానీ ఆకలి కేకలు మాత్రం ఆగడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు. అనారోగ్యకరమైన తక్కువ ఖరీదైన ఆహారాలపై ఆధారపడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నా వాతావరణ అననుకూలత, సంఘర్షణలు, ఆర్థిక మాంద్యం, అసమానతలు, ఆహారాన్ని వ్యర్థం చేయడం అనేవి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 73.3 కోట్ల మంది ప్రజలు ఆకలిని ఎదుర్కొంటున్నారు. ఇది పేదల బలహీన వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సరిపడా ఆహారం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఈ హక్కును మానవ హక్కుగా గుర్తించబడిరది. ప్రపంచంలోని 28 కోట్లకు పైగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు. ఇది పోషకాహార లోపానికి ప్రధాన కారణంగా ఉంది. ఈ సందర్భంగా వ్యవసాయ ఆహార ఉత్పత్తిలో పెరుగుదల, అందరికీ ఆహార భద్రతను కల్పించడం, పోషకాహార లోపాన్ని తగ్గించడం, ఈ లోపం వలన మరణాలు లేకుండా చూడడం, ఆహార వ్యర్ధాన్ని కనిష్ఠం చేయడం అనే లక్ష్యాలను చేరుకోడానికి ప్రతీదేశం పాటుపడాలి. ఈ దిశగా ప్రభుత్వేతర ప్రయత్నాలను కూడా ప్రోత్సహించాలి.
మనదేశ పరిస్థితి: ప్రపంచ ఆహార భద్రత పోషకాహార స్థితి (సోఫి)2024 నివేదిక ప్రకారం మన దేశంలో 19.46 కోట్ల మంది పోషకాహార లోపం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. దేశంలో 55.6% అనగా 79 కోట్ల ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారానికి నోచుకోవడం లేదు. పోషకాహార లోపం ఉన్న వారి సంఖ్య 2004-06 కాలంలో 24 కోట్ల నుండి ప్రస్తుత సంఖ్యకు తగ్గడం శుభపరిణామం. 2022తో పోలిస్తే దాదాపు 3% పాయింట్లు మెరుగుపడిరది. దేశ జనాభాలో 13% మంది దీర్ఘకాలిక పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. ఇది దీర్ఘకాలిక ఆహార అభద్రతను సూచిస్తుంది. 2024 ప్రపంచ ఆహార సూచిలో మొత్తం 127 దేశాలలో మనదేశం 105వ స్థానంలో ఉంది. దేశంలో జన్మించిన 27.4% మంది పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారు. ఇది ఇది తల్లి పోషకాహార లోపాన్ని ప్రతిబింబిస్తుంది.
ఊబకాయుల సంఖ్యను తీసుకుంటే ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 2.8%, పెద్దలలో 7.3%గా ఉంది. దేశంలో ఆహార భద్రత ఒక ప్రధాన ఆందోళనగా ఉంది. ఆహార అభద్రత అనేది ఒక వ్యక్తి యొక్క ఆహార అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చగల తగినంత సురక్షితమైన పోషకమైన ఆహారాన్ని పొందకపోవడాన్ని సూచిస్తుంది. ప్రపంచ ఆహార భద్రతా సూచిక 2022 ప్రకారం ఆహార భద్రత పరంగా 113 ప్రధాన దేశాలలో మన దేశం 68వ స్థానంలో ఉండడం ఆందోళనకరమైన విషయమే. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ప్రపంచంలోని పోషకాహార లోపం ఉన్న జనాభాలో పావు శాతం మంది అంటే 19 కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారు. దాదాపు 43% మంది పిల్లలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
మనదేశంలో సవాళ్లు: సరసమైన ఆరోగ్యకరమైన ఆహారాలు అందుబాటులో లేకపోవడం భారతదేశం అంతటా విస్తృతంగా ఉంది. దేశ జనాభాలో 60% పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దేశవ్యాప్తంగా ఆహార భద్రత స్థాయిలకు కీలకం. వాతావరణ అస్థిరత కారణంగా వ్యవసాయ ఉత్పాదకత తగ్గడం, జనాభా పెరుగుదల వలన అందుబాటులో ఉన్న వ్యవసాయ భూములు తగ్గుదల లాంటి సవాళ్ళను ఎదుర్కుంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు 100 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నా ఆర్థిక సమస్యల కారణంగా దేశంలోని అనేక కుటుంబాలలో ముఖ్యంగా పిల్లలకు పోషకాహారం అందుబాటులో లేదు.
పరిష్కారాలు: వ్యవసాయరంగానికి మరింత నిధులు కేటాయించి ప్రోత్సహించాలి. అందరికీ పోషకారం అందుబాటులో ఉండేటట్లు చూడాలి. సోయాబీన్స్, కాయధాన్యాలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు మొదలైన ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం ద్వారా ఈ లోపాన్ని తగ్గించవచ్చు. ఆహారం వ్యర్థం చేయడాన్ని తగ్గించడానికి ఒక చట్టం తేవాలి. (నేడు ప్రపంచ ఆహార దినోత్సవం)
-జనక మోహనరావు దుంగ
ఫోన్: 8247045230