18న ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య స్కీమ్

ప్రారంభించ‌నున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్
18 ఏళ్లలోపు పిల్లలకు స్పెషల్ బెనిఫిట్స్

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌16:‌ తమ పిల్లల భవిష్యత్‌ ‌కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం బ‌డ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్యను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 18‌న ప్రారంభించనున్నారు. పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ‌చౌద‌రి, ఆర్థిక శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న‌ట్లు సమాచారం. ఈ పథకం ప్రారంభించి దాని విధివిధానాలు వెల్ల‌డించ‌నున్నారు. 18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు/సంరక్షకులు ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య ఖాతా తీసుకోవచ్చు.

పిల్లలు మేజర్లు అయ్యాక ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్‌ ‌ఖాతాగా మారుతుందని జూలైలో ప్రకటించిన బ‌డ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో 2004లో తీసుకొచ్చిన ఎన్‌పీఎస్‌.. ‌పన్ను ప్రయోజనాలతో పాటు, దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని ఇప్పుడు మరింత విస్త‌రిస్తూ మైనర్లకు వాత్సల్యను అందుబాటులోకి తీసుకువ‌స్తున్నారు. కాగా సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌ ‌వంటి మదుపు పథకాలకు ఇది అదనం. ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య వల్ల ముందుగానే పెట్టుబడులు ప్రారంభించడానికి వీలు పడుతుంది.

 

దీనివల్ల చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొంద‌వ‌చ్చు.మైనర్లుగా ఉన్నప్పుడే ఎన్‌పీఎస్‌ ‌ఖాతా తెరవడం వల్ల రిటైర్మెంట్‌ ‌నాటికి పెద్ద మొత్తంలో కార్పస్‌ ‌సమకూరుతుంది. ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య ఖాతా వల్ల చిన్నతనం నుంచే తమ పిల్లలకు పొదుపు అలవాటు చేయొచ్చు. సాధారణంగా ఎన్‌పీఎస్‌లో టైర్‌-1, ‌టైర్‌-2 ‌ఖాతాలుంటాయి. టైర్‌-1 ‌ప్రాథమిక పింఛను ఖాతా. ఇందులో చేరినప్పుడు ఉపసంహరణలపై కొన్ని పరిమితులు ఉంటాయి. టైర్‌-2‌లో స్వచ్ఛంద పొదుపు పథకంలాంటిది. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిపై సెక్షన్‌ 80‌సీసీడీ కింద రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది సెక్షన్‌ 80‌సీ పరిమితి రూ.1,50,000కు అదనం. పదవీ విరమణ తర్వాత (60 ఏళ్లు) ఎన్‌పీఎస్‌ ‌నిధిలో 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతంతో తప్పనిసరిగా యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా పదవీ విరమణ తర్వాత పింఛను పొందేందుకు వీలవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *