సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 15 : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారని వీరంతా కూలి పనికి వెళ్లే నిరుపేదలు అని తెలిపారు. ఎస్సీ ఎస్టీ, బీసీ రైతుల ఎక్కువగా ఉంటారు. రాష్ట్రంలో కోటి 2 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ కార్డుల ద్వారా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించం అని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమన్నారు. ఒక్క సెంటు భూమి ఉన్నా కూలీ కాదు అని అంటున్నారు.
ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలీగా గుర్తింపు ఉంటుందనే నిబంధన కూడా సరైంది కాదన్నారు. అనారోగ్య సమస్యలతోనూ ఇతర సమస్యలతోనూ పనికి వెళ్లని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించరు అని ప్రభుత్వం చెప్తున్నది. ఈ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం మార్చి రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐదు గుంటలు ఉన్న రైతుకు సంవత్సరానికి రైతు భరోసా కింద రూ.1500 మాత్రమే వస్తాయి. ఐదు గుంటలు ఉన్న రైతుకు వ్యవసాయ కూలీ కింద రూ.12000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నష్టపోతారని పేర్కొన్నారు.
ముఖ్యంగా దళితులు, గిరిజనులు.. తాతకు ఎకరం భూమి ఉంటే పిల్లలు పంచుకుంటే అది ఐదు గుంటలు వస్తాయి. 5 గుంటలో పంట పండింది లేదు, వారు బతికింది లేదు. 5 గుంటలు ఉన్నందుకు 12 వేల రూపాయలు ఇవ్వం అని ప్రభుత్వం చెప్పడం శోచనీయమన్నారు. రైతు భరోసా కింద మీరు ఇస్తున్నది రూ.1500 అయితే ఎగ్గొట్టేది 12 వేల రూపాయలు. రాష్ట్రంలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 24 లక్షల 57,000 మంది ఉన్నారు. గుంట, రెండు గుంటలు ఉన్న రైతులు రైతు భరోసా తీసుకోవడం వల్ల రైతు కూలీలకు ఇచ్చే రూ.12,000 నష్టపోతారు. కావున ఇలాంటి రైతులకు రైతు భరోసా కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులుగా గుర్తించాలని ఆయన సూచించారు. ఈజీఎస్ పథకంలో కూలీలు 60 సంవత్సరాల వయసు దాటితే కార్డు కోల్పోతారు. కాబట్టి ఈ పథకంలో ఈజీఎస్ నిబంధన విధించకుండా అమలు చేయాలన్నారు.