బుక్ ఫెయిర్‌ను సందర్శించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్28: శుభకార్యాలకు వెళ్లినప్పుడు బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సందర్శించి మాట్లాడారు. ‘పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉంది. నిరక్షరాస్యుల కోసం ఆడియో బుక్స్ కూడా అందుబాటులోకి వొచ్చాయి. పుస్తకాలను నమిలి మింగేయాలనేంత క్షుణ్ణంగా చదవాలి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సంప్రదాయబద్ధంగా పుస్తకాల్ని ప్రమోట్ చేస్తోంది. మానవ నాగరికత వర్ధిల్లినంతకాలం పుస్తకాలు ఉంటాయి. ఈ-బుక్స్ కంటే పుస్తకాల్లోనే మజా ఉంటుంది. రచయితతో డైరెక్ట్‌గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. విశ్వం గురించి తెలియాలంటే పుస్తకాలు చదవాల్సిందే. ఈ-పుస్తకాలు చదివితే ఆ ఫీల్ ఉండదని పలువురు చెబుతున్న మాట. పెద్దలు అందరూ యువతను పుస్తకాల వైపు ప్రోత్సహించాలి’ అని గవర్నర్ సూచించారు.