- భయందోళనలో అటవీ సమీప గ్రామాల ప్రజలు
- అప్రమత్తం చేస్తున్న అటవీ, పోలీస్ శాఖలు
కొత్తగూడ, ప్రజాతంత్ర డిసెంబర్ 29 : గత మూడేళ్ల క్రితం ఏజెన్సీలో పులి సంచరించి భయాందోళన సృష్టించగా.. మరోసారి ఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీలో పులి సంచరిస్తోందన్న వార్తలు అటవీ సమీప గ్రామాలను వణుకుపట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే గత మూడు సంవత్సరాల క్రితం రాంపూర్ అడవుల్లో ఓ రైతు ఆవు మేతకు వెళ్లి పులికి చిక్కిన తెలిసిందే, దానితో పాటు కొత్తగూడ మండలంలోని కోనాపూర్ ఎంపీటీసీ భర్త నర్సంపేట నుం,ఇ స్వగ్రామానికి ద్విచక్ర వాహనం మీద వస్తుండగా పాఖల అడవిలో పులి ప్రధాన రహదారి దాటుతుండగా చూసి భయంతో ద్విచక్ర వాహనాన్ని వదిలేసి వెనక్కి పరుగులు తీశాడు. ఈ ఘటనలు మరువక ముందే ములుగు అడవుల్లో పులి సంచారిస్తోందని అటవీశాఖ అధికారులు పాదముద్రల ఆధారంగా నిర్ధారించారు. అంతలోనే నల్లబెల్లి మండలంలో ఆనవాళ్లు కనపడటంతో అప్రమత్తమైన కొత్తగూడ అటవీశాఖ అధికారులు అటవీ సమీప గ్రామాలను అప్రమత్తం చేస్తూ, పులిని గుర్తించేందుకు అడవుల్లో కెమెరాలను అమర్చుతూ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. కోనాపూర్, రాంపూర్ అడవుల్లో పులి అడుగులు ఉన్నాయనే సమాచారం అందుకున్న రేంజ్ అధికారి వజహాత్ నిర్దారణ చేసి నిఘా ఏర్పాటు చేశారు. అటవీ శాఖ అధికారులు అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
అడవిలోకి వెళ్లొద్దు: అటవీశాఖ అధికారి వజహాత్
పులి రిట్రీట్ అయ్యేంత వరకు ప్రజలు అడవుల్లోకి వెళ్లవద్దు. నిరంతరం పర్యవేక్షణలోనే ఉన్నాం. ఎవరికైనా పులి ఆనవాళ్లు కనపడితే సెక్షన్ అధికారులకు లేదా స్థానిక బిట్ అధికారులకు సమాచారం అందించండి.
వ్యవసాయ పనులు త్వరగా ముగించుకుని ఇంటికి చేరండి : ఎస్ఐ కుశ కుమార్
పులి సంచారం ఉన్నదనే సమాచారం ఉంది. కాబట్టి రైతులు పొలం పనులను చీకటి అయేంత వరకు చేయకుండా ముందే ఇంటికి చేరుకోవాలి. పశువులను మేపడానికి అడవికి వెళ్లడం మంచిది కాదు. ఏదైనా సమాచారం ఉంటే పోలీస్ శాఖ, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి.