గ్రూప్‌ `1 మెయిన్స్‌ పరీక్షకు లైన్‌ క్లియర్‌

పలు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 15:  గ్రూప్‌ `1 మెయిన్స్‌ పరీక్షకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. వివిధ కారణాలతో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు వొచ్చింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షలపై దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్‌ 1లో తప్పుడు ప్రశ్నలను తొలగించాలని ఒక పిటిషన్‌ దాఖలవగా.. ప్రిలిమినరీ కీ లో తప్పులు ఉన్నాయని, కీ ని రీనోటిఫికేషన్‌ చేయాలని మరో పిటిషన్‌ను అభ్యర్థులు దాఖలు చేశారు. తప్పుడు ప్రశ్నలు తొలగించి మళ్లీ మెరిట్‌ జాబితాను విడుదల చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. త్వరలో గ్రూప్‌ వన్‌ మెయిన్స్‌ పరీక్షలు జరగబోతున్నాయని ఈ సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే మెయిన్స్‌ విద్యార్థులు నష్టపోతారని టీజీపీఎస్‌సీ కోర్టుకు తెలిపింది.

ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిటిషన్‌లను కొట్టివేసింది. దీంతో ఈనెల 21 నుంచి గ్రూప్‌ `1 మెయిన్స్‌ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. మరోవైపు గ్రూప్‌`1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు అందుబాటులోకి వొచ్చాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు ఈ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌`1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలను హెచ్‌ఎండీఏ పరిధిలో నిర్వహిస్తున్నారు. హాల్‌టికెట్లు పరీక్ష ప్రారంభమయ్యే ఒక రోజు ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడిరచారు. మెయిన్స్‌ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్ష హాల్‌లోకి చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు అభ్యర్థులను అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడిరచారు. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. మెయిన్స్‌లో భాగంగా ప్రతి అభ్యర్థి ఆరు పేపర్లకు సంబంధించి పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *