18 వ తేదీకి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టో
తాను ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తొమ్మిదేండ్లకుపైగా రాష్ట్ర మంత్రిగా పనిచేశానని పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగు తున్నానని తెలిపారు. రాష్ట్రానికి ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు సాధించేందుకు రాష్ట్రం తరఫున విదేశాల్లో జరిగిన అనేక సమావేశాలకు హాజరయ్యానని తెలిపారు. ఈ క్రమంలో పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకున్నట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాంటి తనపై మంత్రి సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని, ఆమె వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో వొచ్చిన వార్తలను, సోషల్ మీడియాలోని కథనాలను, పలు టీవీ ఛానల్లో వచ్చిన వార్తలను పెన్‌డ్రైవ్‌లో నిక్షిప్తం చేసి కోర్టుకు సమర్పించారు.
పత్రికల్లో వొచ్చిన క్లిపింగ్‌లను, ఫోటోలను పిటిషన్‌కు జోడించి దాఖలు చేశారు. కొండా సురేఖ గతంలో కూడా ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేసి, ఎన్నికల సంఘంతో చీవాట్లు తిన్న విషయాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలను రాజకీయపరమైన వ్యాఖ్యలుగా మాత్రమే కాకుండా ప్రణాళికబద్ధంగా చేసిన కుట్రగా చూడాలని కేటీఆర్ తన పిటిషన్‌లోవిజ్ఞప్తి చేశారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని, వాటి వెనుక ఉన్న నేరపూరిత దురుద్దేశాల పరిగణలోకి తీసుకొని, ఆమెకు చట్ట ప్రకారం శిక్ష వేయాలని కోర్టును కోరారు. కాగా అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి అనేక కామెంట్స్ కూడా చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు.





