డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు

  • కొత్త ప్రతిపాదనకు మా రాజ్యసభ ఎంపీలు అనుకూలంగా వోటు వేస్తారు
  • మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు కట్టుబడి ఉన్నాం
  • తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం
  • బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పష్టీకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28: నియోజకవర్గాల పునర్విభజనపై తమ వైఖరి ఎల్లప్పుడూ స్పష్టంగానే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శ‌నివారం తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో దక్షిణ భారతదేశం ప్రాధాన్యం ఏమాత్రం తగ్గనప్పుడు, తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగనప్పుడు తాము నియోజకవర్గాల పునర్విభజనకు మద్దతు తెలుపుతామని ఇప్పటికే వైఖరి వెల్లడించామని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నామని స్పష్టం చేశారు. పార్లమెంటులో దక్షిణాదికి ప్రస్తుతం ఉన్న 24% ప్రాతినిధ్య నిష్పత్తి ఏమాత్రం తగ్గకూడదని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
2051 వరకు రక్షణ.. తెలంగాణలో 26 సీట్లు
2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తిని మార్చకుండా రక్షణ కల్పిస్తూ, సీట్ల సంఖ్యను 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత ప్రతిపాదిత చర్య తమ ఆందోళనకు పరిష్కారం చూపుతుందని కేటీఆర్ తెలిపారు. తద్వారా తెలంగాణలో లోక్‌సభ సీట్ల సంఖ్య 17 నుంచి 26కు పెరుగుతుందని వెల్లడించారు. తెలంగాణ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ తమ ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఈ నూతన ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేస్తారని స్పష్టం చేశారు. తాము మహిళా రిజర్వేషన్లకు కూడా ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చామని, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు తాము కట్టుబడి ఉన్నామని కేటీఆర్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *