పంటనష్టం గణనలో కౌలు రైతులను గుర్తించాలి

–కౌలు రైతులను విస్మరిస్తే తీవ్ర సంక్షోభం
–గత రెండు నెలల్లో 51మంది కౌలు రైతుల ఆత్మహత్యలు
–కౌలు రైతులను విస్మరిస్తే నిరసనలు తప్పవు
–కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26: 2011 లైసెన్స్ కల్టివేటర్స్ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులను గుర్తిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ డిమాండ్ చేసింది. గురువారం ఎల్ నినో ప్రభావంపై క్షేత్రస్థాయి అధ్యయన నివేదిక (Telangana Tenant Farmers Crop Loss Survey)ను కమిటీ ప్రతినిధులు విడుదల చేసిన అనంతరం, బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతుల గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్-కమిటీ, ఏర్పాటై 3 నెలలు గడిచినా కనీసం మొదటి సమావేశం కూడా నిర్వహించకపోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. పంటలు నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వ సర్వేలో చేర్చడం లేదని తమ అధ్యయనంలో తేలిందన్నారు. ఈ నెల ప్రారంభంలో, పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసే (ఎన్యూమరేషన్) సర్వేను తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రారంభించిందన్నారు. ఇంకా కొనసాగుతున్న ఈ సర్వేలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, కొన్ని పంటలను మినహాయించారని, ముఖ్యంగా పంట నష్టపోయిన కౌలు రైతుల పేర్లను గణనలో చేర్చడం లేదన్నారు. పత్తి, కంది, సోయాబీన్ వంటి పంటల్లో లక్షలాది మంది రైతులకు సాధారణ దిగుబడి కంటే 50% కంటే తక్కువ దిగుబడి వచ్చిందన్నారు.సీజన్ ప్రారంభంలోనే భూ యజమానులకు అధిక మొత్తంలో కౌలు చెల్లించడం వల్ల కౌలు రైతులు నష్టాల తీవ్రతను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని, వారు మరింత నిస్సహాయ స్థితిలో ఉన్నారని సాధన కమిటీ పేర్కొంది.

గత రెండు నెలల్లో వెలువడిన వార్తా కథనాల సంకలనం ప్రకారం, తెలంగాణలో 68 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, వారిలో 51 మంది కౌలు రైతులే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆగస్టు 28, 2026న కౌలు రైతుల గుర్తింపు కోసం కేబినెట్ సబ్-కమిటీ ఏర్పాటైనప్పుడు త్వరితగతిన చర్యలు ఉంటాయని ఆశించామన్నారు. కానీ ఇప్పటివరకు సబ్-కమిటీ మొదటి సమావేశం కూడా జరగకపోవడం ఆమోదయోగ్యం కాదు. సాధన కమిటీ ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, కౌలు రైతులతో సబ్-కమిటీ తక్షణమే సమావేశం నిర్వహించాలని మేము డిమాండ్ చేశారు. ఆ వెంటనే, 2011 లైసెన్స్డ్ కల్టివేటర్స్ చట్టం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కౌలు సాగుదారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. పంట నష్టం సర్వే కోసం ఉపయోగిస్తున్న యాప్‌లో కౌలు సాగుదారులను నమోదు చేసే ఆప్షన్ ఉన్నప్పటికీ, చాలా మంది ఏఈఓలు దానిని ఉపయోగించడం లేదు. యాప్‌లో కౌలు సాగుదారులను ఎలా నమోదు చేయాలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ కాలేదని కొందరు ఏఈఓలు తెలిపారన్నారు.అతి తక్కువ మంది కౌలు సాగుదారులు మాత్రమే నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయన్నారు. నిజం చెప్పాలంటే చాలా మంది రైతులకు సర్వే గురించి తెలియదు. అంతేకాదు క్షేత్రస్థాయి పర్యటనలు లేకుండానే వివరాలు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

సర్వేకు ముందే కోత కోసిన మొక్కజొన్న, సోయాబీన్, పెసర మరియు మినుము పంటలను సర్వే నుండి మినహాయించారు. అయితే ఈ పంటలపై సగటున 65% నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారన్నారు. పంట నష్టం గణన జాబితాలో తమ పేర్లు చేర్చారో లేదో రైతులకు తెలియడం లేదన్నారు. యాప్ లోని ‘కౌలు రైతుల వివరాలు’  స్క్రీన్‌ను ఉపయోగించి పంట నష్టం సర్వేలో కౌలు సాగుదారులను నమోదు చేయడానికి తక్షణమే రాష్ట్ర స్థాయిలో లిఖితపూర్వక మార్గదర్శకాలను జారీ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు సాగుదారుల గణన ప్రక్రియను ‘స్వీయ ధృవీకరణ  ఆ తర్వాత పరిశీలన’ ద్వారా గానీ, లేదా ‘వోటీపీ ఆధారిత ధృవీకరణ’ ద్వారా గానీ స్పష్టంగా నిర్దేశించాలి. స్వీయ ధృవీకరణ విషయంలో, భూ యజమాని సంతకం, ఎన్ఓసీ లేదా లీజు పత్రం అవసరం లేకుండా కౌలు రైతులు పూరించే విధంగా ఒక సాధారణ తెలుగు ఫారమ్ ఉండాలి మరియు క్షేత్రస్థాయి తనిఖీ, స్థానిక సాక్ష్యాల ద్వారా ధ్రువీకరణ జరగాలన్నారు.

ఇప్పటికే పంట నష్టం గణన పూర్తయిన సర్వే నంబర్లలో కౌలు రైతుల వివరాలను జత చేసే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావాలి, తద్వారా కౌలు రైతులు నిర్దేశిత ప్రక్రియ ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ ఆర్థికవేత్త, కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ డి. నరసింహారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక నుండి బి. కొండల్ రెడ్డి, శ్రీహర్ష తన్నీరు, విస్సా కిరణ్ కుమార్, కన్నెగంటి రవి, దళిత బహుజన ఫ్రంట్ నుండి పి. శంకర్, తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ నుండి ఎ. కవిత, కె. చంద్రశేఖర్ ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *