రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్క‌ర్  కృషి అనిర్వ‌చ‌నీయం

కెయు ప్రొఫెసర్ గాదె సమ్మయ్య

ఘనంగా భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 26: రాజ్యాంగ రూపకల్పనలో బాబా సాహెబ్ డాక్ట్‌ర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషి  అనిర్వ‌చ‌నీయమ‌ని కెయు ప్రొఫ‌స‌ర్ గాదె స‌మ్మ‌య్య అన్నారు. కెయు కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో గురువారం  భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Constitution Day ) ఘనంగా నిర్వహించారు. ఆచార్య గాదె సమ్మయ్య అంబేడ్క‌ర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంత‌రం ఆయ‌న  మాట్లాడుతూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిందని, అనంతరం 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని వివరించారు.
భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను అందించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకాలని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ విద్యావంతులై తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు విద్య, విజ్ఞానం, సామాజిక సేవకు ప్రాధాన్యతనిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.
మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు ఆస్తి హక్కులు, వివాహం, విడాకులు, దత్తత వంటి అంశాల్లో సమాన హక్కులు కల్పించేందుకు ఆయన విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. మహిళల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడమే రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలు తొలగిపోవాలంటే విద్య, చైతన్యం ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఇంట్లో అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం నేటి యువతకు ఆదర్శమని, విద్యార్థులు ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆచార్య గాదె సమ్మయ్య పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో అధ్యాపకులు డా సుజాత, పరిశోధక విద్యార్థులు, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ రాజ్యాంగ విలువలను పాటిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *