ప్రజా సంప్రదింపులకు ముందే టెండర్లా?
మూసీ రివర్ బేసిన్ అథారిటీ ఏర్పాటు చేయాలి
ఏడీబీ పాత్ర, మాస్టర్ ప్లాన్‌పై వివరాలను బహిర్గతం చేయాలి
మూసీ జన ఆందోళన (ఎంజేఏ) డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, నిర్మాణ పనులు, మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని మూసీ జన ఆందోళన (ఎంజేఏ) డిమాండ్ చేసింది. పర్యావరణ పరిరక్షణ, నిర్వాసితులను కనిష్ఠ స్థాయికి పరిమితం చేసే దృక్కోణంతో ప్రాజెక్టును పునఃపరిశీలించాలని కోరింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా, నిర్మాణ టెండర్లు జారీ చేసిన తర్వాత సంప్రదింపులు నిర్వహించడం ప్రహసనమని విమర్శించింది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు, మూసీ పరివాహక ప్రాంత బాధితులు మాట్లాడారు.
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) అక్టోబర్ 12నే జోన్–1ఏ, జోన్–1బీ నిర్మాణ పనులకు టెండర్లు జారీ చేసిందని ఎంజేఏ ప్రతినిధులు తెలిపారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం నవంబర్ 27 సాయంత్రం ఐదు గంటలకే బిడ్ల దాఖలు గడువు ముగిసిందన్నారు. నవంబర్ 28న ప్రతిపాదించిన భాగస్వామ్య పక్షాల సంప్రదింపులకు ముందే టెండర్ల ప్రక్రియను ఈ దశకు తీసుకువెళ్లినప్పుడు ప్రజాభిప్రాయానికి విలువ ఎక్కడుందని ప్రశ్నించారు. కేవలం 90 నిమిషాల సమావేశంతో అర్థవంతమైన ప్రజా సంప్రదింపులు ఏమాత్ర సాధ్యం కావని పేర్కొన్నారు.
చర్చలకు ముందే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలు, నదీ హద్దుల మ్యాప్‌లను తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో అందించాలని నవంబర్ 26న కోరినా ఎంఆర్డీసీఎల్ స్పందించలేదని ఆరోపించారు. ప్రాజెక్టు వివరాలను వెల్లడించకుండా ప్రజలను చర్చలకు ఆహ్వానించడం సమాచారంతో కూడిన ప్రజా భాగస్వామ్య సూత్రాలకు విరుద్ధమన్నారు. స్థానిక ప్రజల అభ్యంతరాలను పరిష్కరించకుండానే డిసెంబర్ 7–9 తేదీల్లో జరగనున్న ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్‌లో మూసీ ప్రాజెక్టును పెట్టుబడుల అవకాశంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఏడీబీ పాత్రపై స్పష్టత ఇవ్వాలి
ప్రాజెక్టులో ఏడీబీ భాగస్వామ్యంపై పరస్పర విరుద్ధ సమాచారం వెలువడుతోందని ఎంజేఏ పేర్కొంది. ఆర్థిక సహాయం ఇంకా భావనాత్మక దశలోనే ఉందని, రుణం ఆమోదించలేదని ఆగస్ట్ 18న ఒక పౌర సమాజ సంస్థకు రాసిన లేఖలో బ్యాంకు తెలిపిందన్నారు. అయితే అక్టోబర్ 21న మొదటి దశ నిర్మాణ పనుల బిడ్ల ఆహ్వానాన్ని తన వెబ్సైట్లో ప్రచురించిందని తెలిపారు. మార్చిలోనే ఎంఆర్డీసీఎల్కు మద్దతుగా, మాస్టర్‌ప్లాన్ సమన్వయానికి నలుగురు కన్సల్టెంట్లను నియమించినట్లు బహిరంగ రికార్డులు సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ నేతృత్వంలోని కన్సార్టియం రూ.166.48 కోట్లతో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. జూలై 9 నాటి ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం రూ.7,054 కోట్ల మొదటి దశ ప్రాజెక్టు కోసం ఏడీబీ నుంచి రూ.4,500 కోట్ల రుణం తీసుకునేందుకు ఎంఆర్డీసీఎల్కు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఈ అప్పుల భారం తిరిగి రాబట్టుకునేందుకు టోళ్లు, వినియోగ రుసుములు, నదీ తీర భూముల వాణిజ్య వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
హరిత ప్రాంతాలు తగ్గించి రహదారుల విస్తరణ
మూసీ ప్రాజెక్టులో నదీ పర్యావరణ పునరుద్ధరణ కంటే రహదారులు, రియల్ ఎస్టేట్ అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఎంజేఏ ప్రతినిధులు ఆరోపించారు. ప్రాథమిక నిబంధనల దశ నుంచి పర్యావరణ ప్రభావ అంచనా దశకు వచ్చేసరికి రహదారులు, వంతెనల విస్తీర్ణం 17.85 హెక్టార్ల నుంచి 64.37 హెక్టార్లకు పెరిగిందన్నారు. అదే సమయంలో హరిత ప్రాంతాల విస్తీర్ణం 109.41 హెక్టార్ల నుంచి 55.65 హెక్టార్లకు తగ్గిందని పేర్కొన్నారు.
రహదారులు, నదికి అడ్డంగా నిర్మించే 15 వంతెనలకు రూ.1,836.42 కోట్లు కేటాయించారని, ఇది ప్రాథమిక మూలధన వ్యయంలో 36.07 శాతమని తెలిపారు. ప్రాజెక్టులో ప్రతిపాదించిన 44.94 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు, కాంక్రీట్ గోడల నిర్మాణం వల్ల నీటి కుక్కలు, తాబేళ్లు, పక్షుల ఆవాసాలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నదీ జలాలను పరివాహక ప్రాంత ప్రజల తాగునీరు, వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాలని కోరారు. డేటా సెంటర్ల శీతలీకరణ అవసరాలకు నీటిని మళ్లించే ప్రతిపాదనలను వ్యతిరేకించారు.
నిర్వాసితుల లెక్కల్లో తేడాలెందుకు?
ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల సంఖ్యపై వేర్వేరు పత్రాలు, ప్రకటనల్లో భిన్నమైన వివరాలు ఉన్నాయని ఎంజేఏ ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా ప్రాధికార సంస్థకు సమర్పించిన మొదటి దశ దరఖాస్తుల్లో 12,204 నిర్వాసిత కుటుంబాలు, 15,255 ప్రభావిత కుటుంబాలు ఉన్నట్లు ఎంఆర్డీసీఎల్ తెలిపిందన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనలో సుమారు పదివేల కుటుంబాల ప్రస్తావన ఉండగా, పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో 639 నిర్మాణాలను మాత్రమే పేర్కొన్నారని తెలిపారు. కుటుంబాలు, నిర్మాణాలకు సంబంధించిన ఈ లెక్కల పరిధి, వ్యత్యాసాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2025 డిసెంబర్ 16న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 921 ద్వారా 3,279.19 ఎకరాలు, 10,017 నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణను సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయించారని పేర్కొన్నారు. ఈ జీవోను ఉపసంహరించి సామాజిక ప్రభావ అంచనాలు, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కోరారు. 2017 రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణను రద్దుచేసి, 2013 చట్టంలోని రక్షణలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
వీధి వ్యాపారులు, రజకులు, పట్టణ రైతులు, అసంఘటిత కార్మికుల జీవనోపాధులపై ప్రాజెక్టు తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.ఏడువేల కోట్లకు పైగా వ్యయమయ్యే ప్రాజెక్టులో దీర్ఘకాలిక నిర్వహణ ఉద్యోగాలు కేవలం 400 మాత్రమే ఉంటాయని ఈఐఏ నివేదిక పేర్కొంటోందన్నారు. 2024 అక్టోబర్‌లో శంకర్‌నగర్, మలక్‌పేట ప్రాంతాల్లో 300కు పైగా ఇళ్లను కూల్చివేశారని, బాధితుల పునరావాస సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆరోపించారు.
కాలుష్యాన్ని మూలంలోనే అరికట్టాలి
గృహ మురుగునీటి శుద్ధి ప్లాంట్లపైనే దృష్టి పెట్టి, పారిశ్రామిక, ఔషధ పరిశ్రమల వ్యర్థాలను విస్మరిస్తే మూసీ ప్రక్షాళన సాధ్యం కాదని ఎంజేఏ స్పష్టం చేసింది. నల్గొండ జిల్లాలోని దిగువ ప్రాంత రైతులను రక్షించేందుకు ప్రత్యేక ఉమ్మడి పారిశ్రామిక వ్యర్థజల శుద్ధి కేంద్రాలకు ప్రాధాన్యమివ్వాలని కోరింది. బోటింగ్ కోసం కృత్రిమ నీటి నిల్వలు, చెక్‌డ్యామ్‌లు, కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడం సహజ ప్రవాహాన్ని దెబ్బతీసి పట్టణ వరద ముప్పును పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఎంఆర్డీసీఎల్ను రద్దుచేసి, ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులు, నదీ తీర నివాసితులు, స్వతంత్ర శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో చట్టబద్ధమైన మూసీ రివర్ బేసిన్ అథారిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. డీపీఆర్, మాస్టర్‌ప్లాన్, జలవిజ్ఞాన నమూనాలు, ధృవీకరించిన నదీ హద్దులను బహిర్గతం చేసి ప్రజల అభ్యంతరాలకు కనీసం 60 రోజుల గడువు ఇవ్వాలని కోరింది.
విలేకరుల సమావేశంలో సజయ కె, సంధ్యా వి, సయ్యద్ బిలాల్, విశాలీ, రుచిత్ ఆశా కమల్, సంజీవ్, లిస్సీ జోసెఫ్, శైలేంద్ర, సుబ్బలక్ష్మి, కొండల్రావు, సుధా గోపరాజుతో పాటు ఎంజేఏ కార్యకర్తలు, బాధిత ప్రజలు పాల్గొన్నారు.





