- తెలంగాణ విద్యను భ్రష్టుపట్టిస్తున్నారు
- ఒంటెత్తు నిర్ణయాలను అంగీకరించేది లేదు..
- విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు వొద్దు
- టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
- డ్రాప్ఔట్లకు పేదరికం, రవాణా సదుపాయాల లేమి ప్రధాన కారణాలు
- అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌ను ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్గా భావించొద్దు
- 50 ఏళ్ల విద్యావిధానంపై నిర్ణయం తీసుకునే ముందు అన్ని వర్గాలతో చర్చించాలి
- రౌండ్ టేబుల్లో విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, విద్యారంగ ప్రముఖుల అభిప్రాయాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని (Inter Board) రద్దు చేస్తామంటూ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని తెలంగాణ రక్షణ సేన చీఫ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం సోమాజిగూడలో నిర్వహించిన ‘ఇంటర్ బోర్డు రద్దు – తెలంగాణ విద్యపై ప్రభావం’ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యారంగంలో కీలక మార్పులు తెచ్చే ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావేత్తలతో పాటు అన్ని వర్గాల స్టేక్హోల్డర్లతో చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులకు స్థానికత అంశంలో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 9 నుంచి 12 తరగతుల వరకు విద్యా సంస్థలకు అనుమతిస్తే ఆంధ్రా విద్యార్థులు అమలాపురంలో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ పరీక్ష రాస్తారని, చంద్రబాబు శిష్యుడిగా ఆంధ్రా ప్రజలకు మేలు చేసేలా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. పరిపక్వత లేని చిన్న పిల్లాడిలా సీఎం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని, తెలంగాణ విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ ఐసీయూలో పెడితే, కాంగ్రెస్ వెంటిలేటర్‌పైకి తెచ్చిందని ఎద్దేవా చేశారు. ఇంటర్ బోర్డు రద్దు చేయాలన్న తప్పుడు నిర్ణయాన్ని సీఎం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంటర్ బోర్డు విద్య కారణంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎంతోమంది గొప్పవాళ్లుగా ఎదిగారని, రాహుల్ గాంధీ ఒకవైపు గొప్పలు చెబుతుంటే, ఈ ముఖ్యమంత్రి మాత్రం అవే వర్గాలకు విద్యను దూరం చేసేలా కార్పొరేట్లతో కుమ్మక్కు అవుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ బోర్డు రద్దు విఫల ప్రయోగమని తేలిపోయినా, అదే విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తే ఎలా అని ప్రశ్నించారు. కేరళను ఆదర్శంగా తీసుకొని దాదాపు పదేళ్ల పాటు సమయం తీసుకొని దశలవారీగా మార్పులు తెచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికిప్పుడు ఇంటర్ బోర్డు రద్దు చేస్తే జూనియర్ లెక్చరర్ల పరిస్థితి ఏంటని, 30 ఏళ్లుగా జెడ్పీ, పంచాయతీరాజ్ టీచర్ల సమస్యనే తీర్చలేని ఈ ప్రభుత్వం విద్యను ఎలా చక్కదిద్దుతుందని నిలదీశారు. గతంలో విద్యా వ్యవస్థలోని లోపాలపై ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి మాట్లాడితే సీఎం ఆయనను బెదిరించేలా మాట్లాడారని, ప్రభుత్వోద్యోగి అయితే ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించవద్దా అని ప్రశ్నించారు. మమ్మల్ని ప్రశ్నించకుండా ఆపటం మీ తల్లి కాంగ్రెస్‌తోనే కాలేదని, పిల్ల కాంగ్రెస్‌కు భయపడేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాన్ని ప్రజలకు వివరించి, అన్ని పార్టీలు, సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేపట్టి విద్యా వ్యవస్థను కాపాడుకుంటామని కవిత హెచ్చరించారు.

చాలా విస్తృతమైన చర్చ జరగాలి : సీనియర్ ఎడిటర్ కె.శ్రీనివాస్
ఈ సమావేశంలో సీనియర్ ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఏం చేసినా మనకు అనుమానం వొచ్చే పరిస్థితి ఉందని, అసలు ఇంటర్ బోర్డును రద్దు చేయాలన్న పరిస్థితి ఏమీ లేదని, అది కేవలం ఆప్షనల్ మాత్రమేనని అన్నారు. 50 ఏళ్లుగా ఉన్న ఇంటర్మీడియట్ విధానాన్ని మార్చాలంటే చాలా విస్తృతమైన చర్చ జరగాలని, 1 నుండి 12వ తరగతి వరకు విద్యా విధానం అంటున్న ఈ నిర్ణయం స్థానికత అంశంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదో తరగతి ప్రాధాన్యం తగ్గిపోతుందన్న అనుమానాలు ఉన్నాయని, అందరి అనుమతి లేకుండా ఈ విధానాన్ని అనుమతించవద్దని కోరారు.

పబ్లిక్ పాలసీ కచ్చితంగా ఎవిడెన్స్ బేస్ గా ఉండాలి :
మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్
పబ్లిక్ పాలసీ అనేది కచ్చితంగా ఎవిడెన్స్ బేస్‌గా ఉండాలని, ఇలాంటి నిర్ణయాలను సామాజిక దృక్పథంతో చూడాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ సూచించారు. పబ్లిక్ పాలసీలోనూ క్లినికల్ ట్రయల్స్ ల్ ఎలా జరుగుతాయో, అలాగే ట్రయల్స్ జరగాల్సిందేనన్నారు. అసలు ఇంటర్మీడియేట్ బోర్డును ఎందుకు రద్దు చేస్తునారన్నదానిపై ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వటం లేదు. జాతీయ విధానంలో ఉంటే మనం కూడా అందులో భాగస్వామ్యం కావాలన్న రూల్ ఏముందీ? అసలు ఇంటర్మీడియేట్ బోర్డు పెట్టిన తర్వాత విద్యార్థులకు మంచి జరిగిందా లేక నష్టం జరిగిందా? ఇప్పుడు ఈ విధానాన్ని తీసుకొస్తే విద్యార్థులకు మంచి జరుగుతుందా? నష్టం జరుగుతుందా ఇది చెప్పాలి కదా? కార్పొరేట్ సంస్థలు ఇంటర్ విద్యను చెరబట్టాయంటే రేపు స్కూల్ విద్యలోకి కూడా వాళ్లు ప్రవేశిస్తారు. డ్రాప్ ఔట్లు కారణంగా చూపటం కూడా కరెక్ట్ కాదు డ్రాప్ ఔట్లు జరిగితే వాటి నివారణకు ప్రయత్నం చేయాలి. కానీ అందరికీ ఒకే విధానంగా ఉండేలా విద్యా విధానాన్ని మార్చుతామంటే కరెక్ట్ కాదు
అదే విధంగా టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ చదివి ఇంజనీర్లు అయిన విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటీ? ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కచ్చితంగా విద్యావేత్తలను, మేధావులను భాగస్వాములను చేయాల్సిందేనని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.
కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలకు అనుగుణంగా నిర్ణయం
ఎస్ఎఫ్ఐ ప్రతినిధి అశోక్ రెడ్డి
ఎస్ఎఫ్ఐ ప్రతినిధి అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది బడ్జెట్ స్కూళ్లకు, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలకు అనుగుణంగా ఉందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ట్రస్మా ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి మాట్లాడుతూ, 60 శాతం మంది విద్యార్థులు బడ్జెట్ స్కూళ్లలోనే చదువుతున్నారని, విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేముందు ఎవరితోనూ చర్చించకపోవడం సరికాదని విమర్శించారు.
పీడీఎస్ యూ నేత ఎస్. నాగేశ్వర్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యను ఎలా అందించాలో ఆలోచించాల్సింది పోയി, గురుకులాల్లో వసతి గృహాలు దారుణంగా ఉన్నాయని, వాటిని బాగు చేయకుండా కార్పొరేట్ సంస్థల కోసం ఇలాంటి నిర్ణయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పీడీఎస్ యూ జనరల్ సెక్రటరీ విజయ్ మాట్లాడుతూ, విద్యా కమిషన్ రిపోర్ట్ పేరుతో ఐఏఎస్ అధికారులు చెప్పినట్లు చేస్తామంటే కుదరదని, మేధావులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఐఐటీలు, ఎన్ఐటీల భవిష్యత్తు ప్రశ్నార్థకం
ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి
ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇంటర్ బోర్డు రద్దు వల్ల ప్రయోజనం ఏంటన్నది ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదని, పీవీ నరసింహారావు ఎంతో మందితో చర్చించి తెచ్చిన ఈ విధానాన్ని నామరూపం లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంటర్ బోర్డు రద్దు చేయాలని లేనే లేదని, తెలుగు రాష్ట్రాల్లోనే ఇంటర్ వ్యవస్థ ఉందని సీఎం అబద్ధాలు చెప్పారని, కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనూ ఇంటర్ వ్యవస్థ ఉందని గుర్తుచేశారు. ఈ విధానం వల్ల ఐఐటీలు, ఎన్ఐటీలు ప్రశ్నార్థకమవుతాయని, రాష్ట్రంలోని 8 వందల జూనియర్ కాలేజీలు మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకే..
ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్ పాపిరెడ్డి
ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ, ఈ అంశాన్ని పబ్లిక్ ఇష్యూగా మార్చి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిన కవితను అభినందించారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారనే అనుమానం కలుగుతోందని, ఈ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేనందున డెడ్ లైన్ లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించారు.






