– హైదరాబాద్‌లో నకిలీ సిల్వర్ ఫాయిల్ దందా గుట్టురట్టు
హైదరాబాద్, నవంబర్ 17: స్వీట్లు, పాన్‌లు, ఇతర ఆహార పదార్థాలపై అలంకరణ కోసం ఉపయోగించే వెండి రేపర్స్ స్థానంలో అల్యూమినియం రేకులను వినియోగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి భారీగా అల్యూమినియం రేపర్లు, ఫ్లేక్స్, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్, ఫలక్‌నుమా పరిధిలోని నాలుగు కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అల్యూమినియం ఆకులతో తయారు చేసిన నకిలీ సిల్వర్ ఫాయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నూతన సీపీ మహేష్ భగవత్ మీడియాకు వెల్లడించారు. ప్రజలకు తెలియకుండా స్వీట్లు, పాన్, బేకరీ ఉత్పత్తుల్లో అల్యూమినియం వినియోగిస్తున్నారని, అలాగే కాజు కత్లీ, చమ్ చమ్, స్వీట్ పాన్, కేకుల్లో నకిలీ సిల్వర్ ఫాయిల్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి అల్యూమినియం మెటీరియల్‌ను దిగుమతి చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా స్వీట్ షాపులు, బేకరీలు, పాన్ షాపులకు నకిలీ ఫాయిల్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. చార్మినార్‌లోని ఇత్తెహాద్ వరాక్ షాప్, హుస్సేనిఆలంలోని యూటీసీ సిల్వర్ లీఫ్స్, మొఘల్‌పురాలోని ఎం.ఏ. మెట్రో వరాక్ షాప్, ఫలక్‌నుమాలోని తారా యూనిట్‌ల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. 49 బండిళ్ల నకిలీ సిల్వర్ ఆకులు, 13 కిలోలకు పైగా అల్యూమినియం ఫ్లేక్స్ సీజ్ చేశామని, కిలో నకిలీ షుగర్ బాల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాక భారీగా తంబాకు, టాల్కమ్ పౌడర్, పాన్ చట్నీలు పట్టుబడ్డాయన్నారు. తయారీకి ఉపయోగించే మిక్సర్లు, ప్యాకింగ్ మెషిన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. జంతు చర్మాలతో తయారైన ఐదు బుక్స్ షీట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యవహారం సాగుతోందని తెలిపారు. వెండి ధరలు భారీగా పెరగడంతో కొందరు అక్రమార్కులు తక్కువ ధరకు లభించే అల్యూమినియంను వెండికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నట్లు పోలీసుల దాడుల్లో బయటపడింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



