– పువ్వర్తి నుంచి దండకారణ్య పోరాట నాయకత్వం వరకు సాగిన ప్రస్థానం
– 2025 నవంబర్ 18న మారేడుమిల్లి ఎదురుకాల్పుల్లో మృతి
– సమాజం ముందు అనేక ప్రశ్నలను మిగిల్చిన హిడ్మా జీవితం
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్ల. నవంబర్ 17: సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్న ఆదివాసులు చరిత్ర నిర్మాణంలో భాగస్వాములై మొత్తం సమాజాన్ని చైతన్య పథంలో నడిపించడం కోసం ఎందరో తమ జీవితాలను తృణ ప్రాయంగా అర్పించారు. అటువంటి పోరాట యోధులను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. ఆ కోవకు చెందిన వ్యక్తే ఆదివాసీ బిడ్డ మదవి హిడ్మా. బుధవారం హిడ్మా వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానం, ఆదివాసీ సమాజం కోసం ఆయన సాగించిన పోరాటం చర్చనీయాంశంగా మారాయి.
పువ్వర్తి నుంచి అడవి యోధుడిగా
1981లో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో జన్మించిన హిడ్మాను. చుట్టూ ఉన్న ఆదివాసులు ఎదుర్కొంటున్న కష్టాలు, అణచివేత తీవ్రంగా కదిలించాయి.కేవలం ఆదివాసుల జీవన విధానాన్ని మాత్రమే కాక అడవుల విధ్వంసానికి కారణమవుతున్న పరిస్థితులను హిడ్మా లోతుగా అర్థం చేసుకున్నారు. తాను పుట్టి పెరిగిన అడవి, అక్కడి గిరిజనుల సంస్కృతిపై జరుగుతున్న దాడులు ఆ సాధారణ ఆదివాసీ యువకుడిని ఒక యోధుడిగా మలిచాయి. తరతరాలుగా భయం గుప్పిట్లో బతుకుతున్న ఆదివాసులకు నిర్భయమైన జీవితాన్ని అందించాలనే తపనతో ఆయన ముందుకు సాగారు. పోరాట క్రమంలోనే ఇంగ్లీష్, తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో పట్టు సాధించి దేశవ్యాప్త సామాజిక, రాజకీయ పరిణామాలను విశ్లేషించే స్థాయికి ఎదిగారు. ఆదివాసులకు భూమి, అటవీ హక్కులు, విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవితం అందాలని తపించిన హిద్మా 2025 నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ హక్కుల సంఘా లు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. పువ్వర్తి గ్రామంలోని పూరి గుడిసెలో జీవిస్తున్న హిడ్మా తల్లి పుంజీ, నిర్లిప్తంగా ఉన్న సమాజాన్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నట్లే అనిపిస్తుంది. హిడ్మా ఆదివాసీ సమాజం ముందే కాదు. భారత సమాజం ముందు అనేక ప్రశ్నలను ఉంచిపోయారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





