వేములవాడ రాజన్న ఆలయం వ‌ద్ద‌ ఉద్రిక్తత

 – ప్రధాన గోపుర శిఖరం తొలగింపుపై దుమారం
– ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పనులు చేపట్టారంటూ బీజేపీ ఆందోళన
– ఆలయ అభివృద్ధి పనులు నిలిపివేయాలని డిమాండ్
– ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వేములవాడ రూరల్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థాన అభివృద్ధి. విస్తరణ పనుల్లో వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం ప్రధాన ఆలయ గోపుర శిఖరం తొలగింపు ప్రక్రియ చేపట్టడం వివాదానికి కార‌ణ‌మైంది. ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా గోపుర శిఖరాన్ని తొలగించారని, దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ స్థానిక బీజేపీ నాయకులు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. భక్తుల విశ్వాసాలు, మనోభావాలను గౌరవించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆలయ అభివృద్ధి మాటలు చెబుతూ కూల్చివేతలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపడు తూ తలుపులు నెట్టివేస్తూ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వెంటనే వీటీడీఏ అధికారులు, కలెక్టర్ సంఘటనా స్థలానికి వ‌చ్చి పరిస్థితిని వివరించాలని నినాదాలు చేశారు. గోపుర శిఖరం తొలగింపు పనులను తక్షణమే నిలిపివేయాలని, ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరారు. బీజేపీ నాయకుల ఆందోళనతో రాజన్న ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులతో మాట్లాడి వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

 ఆలయం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు : బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి 

ఆలయ అభివృద్ధి పనుల పేరుతో ప్రాచీన కట్టడాలు, ఆగమ సంప్రదాయాలకు నష్టం కలిగించవద్దని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి డిమాండ్ చేశారు. రాజన్న ఆలయం ఎవరి వ్యక్తిగత జాగీరు కాదని, కోట్లాది హిందువుల ఆరాధ్య దైవమని స్పష్టం చేశారు. బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోపి మాట్లాడుతూ గర్భగుడిని ముట్టుకోబోమని గతంలో చెప్పిన అధికారులు ఇప్పుడు గర్భగుడి శిఖరాన్ని తొలగించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. శిఖరం తొలగింపునకు ఎవరు అనుమతి ఇచ్చారు.. శృంగేరి పీఠం నుంచి లిఖిత పూర్వక అనుమతులు తీసుకున్నారా అని ప్ర‌శ్నించారు. తీసుకుంటే వాటిని ప్రజలకు ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు. స్లాబ్ నిర్మాణం వల్ల శిఖరం కనిపించని పరిస్థితి ఏర్పడటానికి కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, ఇప్పటివరకు చేసిన ఖర్చులు, కాంట్రాక్టర్ల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణామూర్తి విగ్రహం, వెయ్యి స్తంభాల మండపం వంటి ప్రాచీ న కట్టడాల పరిరక్షణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ విషయాలపై వాస్తవాలు తెలుసుకునేందుకు బీజేపీ నాయకులు శృంగేరి పీఠాన్ని సందర్శించి పీఠాధిపతులను కలుస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు సిరికొండ శ్రీనివాస్, పొన్నాల తిరుపతిరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రెగుల సంతోష్ బాబు, కౌన్సిలర్లు వంగల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *