హౌసింగ్ డీఈఈ సస్పెన్షన్

– ‘డబుల్’ ఇండ్ల‌ ఆకస్మిక తనిఖీల సమాచారం లీక్ వ్య‌వ‌హారంలో

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 17 : డబుల్ బెడ్ రూం ఇండ్లలో అసలైన లబ్ధిదారులే నివాసం ఉంటున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు హౌసింగ్ అధికారులు నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీల సమాచారాన్ని ముందుగానే లబ్ధిదారులకు లీక్ చేసిన హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ) చంద్రపాల్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతమ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించి ఉచితంగా కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు అర్హులైన లబ్ధిదారులకే ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లను ఇతరులకు అద్దెకు ఇవ్వడం, విక్రయించడం లేదా లబ్ధిదారులు నివాసం ఉండకుండా ఇతరుల ఆధీనంలో ఉంచడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి అక్రమ కేటాయింపులను గుర్తించి నిబంధనల ప్రకారం రద్దు చేసేందుకు నోటీసులు జారీ చేయడంతోపాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి కొల్లూరులో డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించినప్పటికీ చాలామంది లబ్ధిదారులు అక్కడ నివాసం ఉండటం లేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌసింగ్ అధికారులు ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించి నివాసం ఉండని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు సమాధానంగా తాము కేటాయించిన ఇళ్లలోనే నివసిస్తున్నామని పలువురు లబ్ధిదారులు పేర్కొనడంతో వాస్తవ పరిస్థితిని నిర్ధారించేందుకు ఆకస్మిక తనిఖీలను మరింత విస్తృతం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో సెలవు రోజైన ఆదివారం పెద్ద ఎత్తున ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న‌ డీఈఈ చంద్రపాల్ ఈ తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు లీక్‌ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా తనిఖీల సమాచారం లీక్‌ అయినట్లు నిర్ధారణ కావడంతో విధుల్లో నిర్లక్ష్యం, అధికారిక సమాచార గోప్యతను పాటించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో డీఈఈ చంద్రపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *