– కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా
– 19న సిద్దిపేట సభలో దరఖాస్తు విడుదల
– అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో అమలవుతున్న బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం ఈ నెల 19న సిద్ధిపేటలో జరుగు బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో సీఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం అమలు కావాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బీమా పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందనుంది. ఈ బీమా వల్ల ఉపాధి హామీ కూలీలతోపాటు లక్షలాదిమంది పేదలు లబ్ధి పొందుతారని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమలవుతున్న వివిధ రకాల బీమా పథకాల్లో జీవిత బీమా కింద రూ.2లక్షలు, ప్రమాద బీమా కింద రూ.10 లక్షల వరకు అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ శాఖల్లో అమలవుతున్న అన్ని బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి వారికి లభిస్తున్న ప్రమాద బీమాను యథాతథంగా అందేలా చూడాలన్నారు. కొన్ని శాఖల్లో ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకొచ్చి రూ.5లక్షలకు పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి బీమా భద్రత అందుకుంటున్న వారిలో ఏ ఒక్కరినీ కూడా తప్పించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. మరోవైపు సిద్ధిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందాలని సీఎం ఆదేశించారు. చీరలను తక్షణమే అన్ని జిల్లాలకు తరలించాలని సూచించారు. బీమా, చీరల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. చీరల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇందిరమ్మ బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. బీమా దరఖాస్తులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సీఎంవో కార్యదర్శి మానిక్ రాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





