కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణాల్లో ఉన్న కీలక లోపాలు ఉన్నట్టు విజిలెన్స్ అండ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్ డిఎస్ఏ ) ప్రాథమిక నివేదికలు స్పష్టంగా తెలియజేశాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దీనిపై న్యాయ విచారణ కొనసాగుతుండగా, ఎన్డీఎస్ఏ ఫైనల్ నివేదిక కూడా వారం నుంచి 10 రోజుల్లో అందుతుందని తెలిపారు. నివేదికల ప్రకారం మూడు బ్యారేజీలకు ఉపయోగించిన ఫౌండేషన్ టెక్నాలజీలో లోపాలున్నాయని, డీపీఆర్ లో పేర్కొన్న టెక్నాలజీకి, అసలు అమలు చేసిన టెక్నాలజీకి తేడా ఉందని ఆయన చెప్పారు. “డీపీఆర్ లో షీట్ పైల్ టెక్నాలజీ చూపించగా, అసలు ప్రాజెక్టులో సీకెంట్ పైల్ టెక్నాలజీ వాడారు.
ఎన్ డిఎస్ఏ నిపుణులు బ్యారేజీలు కూలిపోవచ్చని, భద్రాచలం వంటి నగరాలు కూడా ముంచెత్తవచ్చని హెచ్చరించారు” అని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను బిఆర్ఎస్ ప్రభుత్వం డిజైన్ చేసి, నిర్మించి, చెడిపోయే స్థితికి తెచ్చిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క లక్ష ఎకరానికైనా నీరు అందలేదన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం నిపుణుల అనుమతి లేకుండా జరిగిందని, దాని వల్ల ప్రాజెక్టు ఖర్చు రూ.1.5 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. “సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ మార్పును ఎప్పుడూ సిఫార్సు చేయలేదు. ఐదుగురు చీఫ్ ఇంజినీర్ల కమిటీ వ్యతిరేకించిందని, అయినా వారి అభిప్రాయాలను పట్టించుకోలేదు,” అన్నారు.