1,33,365 మందికి డిగ్రీలు, 408 గోల్డ్ మెడల్స్
రూ.22.50 కోట్లతో మహిళా హాస్టల్
పరిశోధనలకు ఏటా రూ.1 కోటి కార్పస్ ఫండ్
జర్మనీ యూనివర్సిటీతో ఒప్పందం
కేయూ 24వ స్నాతకోత్సవంలో విద్యాభివృద్ధి నివేదిక చదివి వినిపించిన వీసీ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి
కాళోజి జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర నవంబర్ 28 : ప్రభుత్వం నిర్దేశించిన విద్యారంగ లక్ష్యాల సాధనలో కాకతీయ విశ్వవిద్యాలయం ముందంజలో ఉందని కెయు ఉపకులపతి ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి అన్నారు. శనివారం కెయు 24వ స్నాతకోత్సవానికి ప్రొఫెసర్ కె. ప్రతాప రెడ్డి అధ్యక్షత వహించి విశ్వవిద్యాలయం విద్యాభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. 2022–2025 విద్యాసంవత్సరాల ఫలితాలకు సంబంధించి మొత్తం 1,33,365 మందికి డిగ్రీలు ప్రదానం చేశామన్నారు. వీరిలో మహిళలు 86,632 మంది, పురుషులు 46,733 మంది ఉన్నట్లు చెప్పారు. ఎనిమిది ఫ్యాకల్టీల్లో 88 మంది పరిశోధకులు పీహెచ్డీ అందుకున్నారన్నారు. 105 మంది దాతల సాయంతో 408 బంగారు పతకాలు అందజేశామన్నారు. దూరవిద్యలో 689 మంది పట్టభద్రులయ్యారని తెలిపారు. సుమారు 80 శాతం ప్రవేశాలు మహిళలవే కావడంతో రూ. 22.50 కోట్లతో 500 పడకల మహిళా హాస్టల్ నిర్మించనున్నట్లు ఉపకులపతి తెలిపారు. 1976లో ఏర్పడిన విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ సంవత్సరంలో ఉందన్నారు. సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల శతాబ్ది దిశగా సాగుతోందన్నారు.
ఏటా రూ.కోటి కార్పస్ ఫండ్
విశ్వవిద్యాలయానికి న్యాక్ ఎ ప్లస్ గుర్తింపు ఉందన్నారు. 2025–26 నుంచి డిగ్రీ స్థాయిలో కామన్ కోర్ ఏఐ, డేటా సైన్స్ ప్రవేశపెట్టగా, 2026–27 నుంచి పీజీ విద్యార్థులకు పరిశోధనా పద్ధతులు, ఆరు క్రెడిట్ల ప్రాజెక్టు తప్పనిసరి చేశామన్నారు. అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీలు, కొత్త బి.ఏ. పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కోర్సు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. రుసా కింద రూ. 50 కోట్లతో ఐదు పరిశోధనా కేంద్రాలు, 37 ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. 73 మంది రీసెర్చ్ ప్రాజెక్ట్ ఫెలోలను నియమించారన్నారు. 2000–2025 మధ్య అధ్యాపకులు 25 పేటెంట్లు సాధించారని గుర్తు చేశారు. పరిశోధనల కోసం ఏటా రూ. 1 కోటి కార్పస్ ఫండ్ కేటాయిస్తామని ప్రకటించారు. సుమారు 40 అవగాహన ఒప్పందాల్లో 16 క్రియాశీలంగా ఉన్నాయని వెల్లడించారు. జర్మనీలోని రాయిట్లింగెన్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు మాస్టర్స్ చదువుకునే అవకాశం కలిగిందన్నారు. ఈ ఏడాది 20 మందిని విశ్వవిద్యాలయం స్పాన్సర్ చేస్తోందన్నొరు. కెహబ్ శిక్షణకు 17 వందల దరఖాస్తుల్లో 400 మంది ఎంపికయ్యారని తెలిపారు. మే 2026 నాటికి సుమారు 13 వందల మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని వివరించారు. మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 350 మందిలో 254 మందికి, రూ. 2.5–5.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు.
రూ.67.27 కోట్ల అంచనాతో 22 అభివృద్ధి పనులు
కెయు క్యాంపస్‌లో రూ. 67.27 కోట్ల అంచనాతో 22 అభివృద్ధి పనుల్లో 8 పనులు పూర్తయ్యాయన్నారు. 8 కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి రూ. 400 కోట్ల మౌలిక సదుపాయాల ప్రతిపాదన సమర్పించామని వెల్లడించారు. ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం, ఈ-ఆఫీస్, ముఖ గుర్తింపు హాజరు అమలులో ఉన్నాయన్నారు. పారా టైక్వాండోలో పతకాలు సాధించిన పరిశోధక విద్యార్థిని మాచర్ల కృష్ణవేణి సహా విద్యార్థుల విజయాలను ఉపకులపతి అభినందించారు. 2024–25లో 27 వేల మొక్కలు నాటారని చెప్పారు. పట్టభద్రులు నిరంతరం నేర్చుకుంటూ, నిజాయితీతో పనిచేస్తూ, సమాజానికి తోడ్పడాలని ఉపకులపతి పిలుపునిచ్చారు. అంతకు ముందు ఉదయం విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని హెలిప్యాడ్ వద్ద వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి గవర్నర్ శుక్లాకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. విశ్వవిద్యాలయ ఆడిటోరియం వద్ద ఎన్సిసి క్యాడెట్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం విశ్వవిద్యాలయ రెడ్‌క్రాస్ యూనిట్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించారు. తదుపరి నిర్వహించిన అకడమిక్ సెనేట్ సమావేశంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీన్లు, పాలక మండలి సభ్యులు, అకడమిక్ సెనేట్ సభ్యులు, మాజీ ఉపకులపతులతో కలిసి ఫొటో సెషన్లో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ బ్యాండ్ వాయిద్యాల మధ్య అకడమిక్ ప్రొసెషన్తో గవర్నర్ స్నాతకోత్సవ సభా వేదికపైకి ప్రవేశించడంతో ఆడిటోరియంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. సభలో సంబంధిత డీన్లు డాక్టరేట్ పట్టాలు పొందిన పరిశోధక విద్యార్థుల పేర్లను చదవగా, గవర్నర్ వారికి పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థుల పేర్లను ప్రకటించగా, స్వర్ణ పతకాలను, సర్టిఫికేట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపకులపతులు ఆచార్య విద్యావతి, ఆచార్య వెంకటరత్నం, ఆచార్య ఆర్. సాయన్న, పాలక మండలి సభ్యులు ఆచార్య బి. సురేష్ లాల్, డాక్టర్ బి. రమ, డాక్టర్ ఎన్. సుదర్శన్, డాక్టర్ చిర్రా రాజు, డాక్టర్ సుకుమారి, ఆచార్య మల్లం నవీన్, పుల్లూరి సుధాకర్, కె. అనితా రెడ్డి, బాలు చౌహాన్, డీన్లు ఆచార్య బి. సురేష్ లాల్, ఆచార్య బి. వెంకట్రామిరెడ్డి, ఆచార్య ఎన్. ప్రసాద్, ఆచార్య ఎం. శ్రీనివాస్, ఆచార్య ఎన్. రామనాథ కిషన్, ఆచార్య రాజేందర్ కట్ల, ఆచార్య కె. కిషోర్ కుమార్, అకాడమిక్ సెనెట్ సభ్యులు గొల్లపూడి జగదీశ్, కే.మాణిక్యం తో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు, ఆహ్వానితులు, అతిథులు, స్వర్ణ పతకాల దాతలు పాల్గొన్నారు. ఏలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఆడిటోరియం వద్ద పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.