కాకతీయ కలగూర గంప – 21
కాకతీయ యూని వర్సి టీలో 25-1-2017 నా డు అలనాటి ‘కాకతీయ పత్రిక’ సంపా దకుడు శ్రీ పాములపర్తి సదాశివ రావు గారి 8 వ సంస్మరణ సభలో అప్పటి ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు, సీనియర్ జర్నలిస్టు మరియు ప్రఖ్యాత పత్రికా రచయిత డాక్టర్ కె. శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, ‘నేటి పత్రికారంగంలో నూతన పోకడల’ను గురించి ప్రసంగి ంచారు. ఆ సందర్భాన పాములపర్తి సదాశివరావు సంస్మరణ సమితి తరఫున నన్ను (నిరంజన్ రావు) రెండు మాటలు చెప్పమన్నప్పుడు అధ్యక్షులవారి అనుమతితో 1961-70 దశకంలో వరంగల్ పత్రికారంగానికి చెందిన నాకు తెలిసిన విషయాలను కొన్ని చెప్పిన వివరాలు ఇవీ. వరంగల్ పత్రికారంగానికి సంబంధించి 1960వ దశకం కొంత ప్రాముఖ్యం కలిగి వుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1961 నుండి 1969 దాకా చూస్తే వరంగల్ లో ఎన్నో పత్రికలు మొదలయ్యాయి.
1948 లో ప్రారంభమైన ‘కాకతీయ పత్రిక’ 1958 లోనే ఆగిపోయింది. అప్పుడే దేవుల పల్లి దామోదర రావు, రాజా నరేంద్ర గారి సంపాదకత్వం లో పుట్టిన ‘చిత్ర విచిత్ర’ 1960 లో ఆగిపోయింది. కాని 1958 లోనే యం. ఎస్. ఆచారి గారి సంపాదకత్వంలో ప్రారంభించిన ‘జనధర్మ’ ఒక ప్రముఖ వార పత్రికగా వరంగల్ లో నిలదొక్కుకుంది. 1961 ప్రాంతాల్లో కటంగూరి నరసింహారెడ్డి గారు ‘విశ్వ జ్యోతి’ మాస పత్రికను, కనకదండి చంద్రమౌళీశ్వర రావు గారు ‘ధర్మ భూమి’ పక్ష పత్రికను ప్రారంభించారు. ఈ రెండు పత్రికలు మా కాకతీయ ప్రెస్స్ లోనే ముద్రింప బడేవి. నేను 1961 నుండీ 1968 దాకా రోజూ సాయంత్రం స్కూల్ లేదా కాలేజీ అయిపోగానే డైరెక్ట్ గా స్టేషన్ రోడ్డులో ఆకారపు నరసింగం గుడికి ఎదురుగా వున్న మా ప్రెస్సుకు పోయి అక్కడ కంపోజింగ్ లాంటి పనులు చెసేవాన్ని. ఫై రెండు పత్రికల్లో పాములపర్తి సదాశివరావు గారు అనేక రచనలు చేసేవారు. అప్పుడే దివ్వెల హనుమంత రావు గారు ‘ప్రజా మిత్ర’, మామిడి రమాకాంత రావు గారు ‘జన జీవన’ , దేవులపల్లి సుదర్శన రావు గారు ‘కాంగ్రెస్’, ఎస్ పీ రాజేశ్వరరావు గారు ‘ఓరుగల్లు’, వరవర రావు గారు ‘సృజన’ , కక్కెర్ల కాశీనాధం గారు ‘గౌడ పత్రిక’ లను వెలువరించారు. ఇంకా ‘రచ్చ బండ’ అనే పత్రిక వచ్చినట్తు గుర్తు.
వీరందరు ధనార్జన కొరకో లేదా పేరు ప్రఖ్యాతులకో కాకుండా వారి అభిరుచుల మేరకు వీటిని వెలువరించారు. మరో ముఖ్య విషయమేమంటే ఈ దశకంలోనే వరంగల్ నుండి ముగ్గురు ప్రముఖ రచయితలు ఉద్భవించారు. వారిలో మొదటి వారు ఇక్కడే మన మధ్యనే కూర్చున్న, ప్రముఖ సాహితీ వేత్త, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శ్రీ అంపశయ్య నవీన్ గారు. ఆ రోజుల్లో ‘సృజన’లో వారి ‘అంపశయ్య’ ధారావాహికను చదువుతూ ‘అరె, ఇది కొత్త రకంగా వుందే!’ అని అనుకునే వాడిని. ఇక రెండవ వారు ప్రముఖ పత్రికా సంపాదకులు, రాజకీయ విశ్లేషణకర్త, రచయిత శ్రీ టంకశాల అశోక్ గారు. వారి వ్యాసాలో, గేయాలో జనధర్మ పత్రికలో తరచుగా వచ్చేవి. ఇక మూడవ వ్యక్తి నా బాల్య మిత్రుడు, నా క్లాస్ మేట్, ఉద్యోగంలో నా సహచరుడు శ్రీ రామా చంద్రమౌళి గారు. కవిత్వం, కథలు, నవలలు మొదలగు అనేక ప్రక్రియల్లో ఆయన తన రచనలు చేసి నేటి ప్రముఖ సాహితీ వేత్తగా పేరు గాంచారు. ‘నాకు తెలిసిన కొన్ని విషయాలను మీకు తెలియచేయడానికి ఈ అవకాశం ఇచ్చిన కాకతీయ యూనివర్శిటీ వారికి ధన్యవాదాలు చెబుతూ, మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు..’ అని ముగించాను.
-శ్రీమతి పాములపర్తి చంద్ర కీర్తి,
-పాములపర్తి నిరంజన్ రావు
-శ్రీమతి పాములపర్తి చంద్ర కీర్తి,
-పాములపర్తి నిరంజన్ రావు