సమాధానాలను దాటవేసిన అధికారులు
కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక క్రమశిక్షణా వైఫల్యంపై చీఫ్ అకౌంటెంట్ అధికారులను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. పిసి ఘోష్ కమిషన్ ముందు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్కస్ అకౌంట్ చీఫ్ ఫణిభూషణ్ శర్మ హాజరయ్యారు. కాగ్ నివేదిక గురించి అకౌంట్స్ అధికారులను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అడిగింది. కాళేశ్వరం బిల్లుల చెల్లింపులో కాగ్ నివేదికతో అంగీకరిస్తారా? అని కమిషన్ ప్రశ్నించింది. ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కాగ్ నివేదిక ఇచ్చిందని అధికారులు వివరించారు.
ప్రాజెక్టులో ఆర్థిక క్రమశిక్షణా వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని, ఆర్థిక క్రమశిక్షణా వైఫల్యంలో తాము స్పందించలేమని, కమిషన్ ప్రశ్నలకు ఛీప్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి సమాధానం దాటవేశారు. పలు ప్రశ్నలకు తనకు సంబంధం లేదని, తెలియదని, చెప్పలేనని పద్మావతి వివరణ ఇచ్చారు. కాళేశ్వరానికి నిధులు సేకరణ, బిల్లులు చెల్లింపుల అంశాలు, కార్పొరేషన్ ఏర్పాటు, ఉద్యోగుల జీతాలు, చెల్లింపులపై వారిని కమిషన్ ప్రశ్నించింది. రుణాలు తీసుకొని బిల్లులు చెల్లించకుండా ఎఫ్ డీలు చేసినట్లు అప్పారావు చెప్పారు.
ఎఫ్‌డిల ద్వారా వచ్చిన మొత్తాన్ని కార్పొరేషన్ నిర్వహణ కోసం వాడినట్లు వెల్లడించారు. కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రతి ఏడాది చెక్ చేస్తారా? అని కమిషన్ ప్రశ్నించింది. రుణాలు ఎవరి ఆదేశాలతో తీసుకున్నారని పిసి ఘోష్ కమిషన్ అడిగింది. సిఎస్ ఆదేశాలతో పాటు కార్పొరేషన్ బోర్డు ఆమోదంతో రుణాలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. కార్పొరేషన్ కు రుణాలు తీసుకున్న తర్వాత ఏమైనా ఆస్తులు వచ్చాయా? అని కమిషన్ నిలదీసింది. ప్రస్తుతానికి కార్పొరేషన్ కు ఎలాంటి ఆదాయం లేదని, ఆస్తులు రావడం లేదని అధికారులు పేర్కొన్నారు. బిల్లు చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని అధికారులు వెల్లడించారు.