- నాలుగు నెలలుగా జీతాలు లేవు
- స్పందించిన ప్రజావాణి అధికారి దివ్యా దేవరాజన్
ఇరాక్ దేశంలోని బస్రా లో గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా కంపెనీ యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నదని ముగ్గురు బాధితుల పక్షాన వారి కుటుంబ సభ్యులు బుధవారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధితుల వెంట టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రేస్ యూకే ఉపాధ్యక్షులు రంగుల సుధాకర్ గౌడ్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్ లు ఉన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కొరండ్లపల్లి కి చెందిన పంగ సత్తయ్య, బుగ్గారం మండలం సిరికొండ కు చెందిన బట్టు హరీష్, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వేద కు చెందిన ఒరికె నడిపి రాజన్న గత రెండేండ్లుగా ఇరాక్ లోని బస్రా పట్టణంలో ఒక నిర్మాణ కంపెనీలో కూలీలుగా పనిచేస్తున్నారు.
ఇరాక్ లో చిక్కుకున్న బాధితులు పంగ సత్తయ్య భార్య రమ, బట్టు హరీష్ తల్లి సుగుణ, ఒరికె నడిపి రాజన్న భార్య గంగలత లు ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్యా దేవరాజన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. నాలుగు నెలల జీతం బకాయిలు, ఉద్యోగ అనంతర ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) ఇప్పించి ముగ్గురిని ఇరాకు నుంచి ఇండియాకు తెప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వ జిఏడి ఎన్నారై అధికారి ఎస్. వెంకట రావు తో దివ్యా దేవరాజన్ వెంటనే ఫోన్ లో మాట్లాడారు. ఇరాక్ లోని ఇండియన్ ఎంబసీ దృష్టికి ఈ సమస్యను తీసికెళ్లాలని కోరారు. తర్వాత బాధితుల కుటుంబ సభ్యులు సచివాలయం లోని ఎన్నారై విభాగం అధికారి ఇ. చిట్టి బాబు ను కలిసి వివరాలు అందజేశారు.