తెల్లవారుఝామున చదువరుల ఇంటిముందు పత్రికను ప్రతిరోజూ అందించేందుకు, కొన్ని గంటల దాకా సైకిల్ తొక్కుకోవలసిందే.ఎడిటర్ అయ్యే దాకా చిన్నప్ప• •నుంచే సైకిల్ తొక్కడమే జీవితం. నాన్నకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. కడుపు పట్టుకుని పక్క అరుగుమీద పడి నొప్పి ఆగేదాక నిలబడేది. నొప్పి తగ్గిన తరువాత కాస్సేపు సైకిల్ నడిపేది. నాన్నను తలుచుకోగానే నాకు కళ్లు పొంగేవి.
ఆ పోరాటశీలి యం. యస్. ఆచార్య 1924 లో జన్మించారు. 3 అక్టోబర్ 2024 శతజయంతి సంవత్సరం.సాధారణంగా జయంతి, తరువాత వర్థంతి సంవత్సరం సంఖ్యతో సాగిస్తారు. పుట్టిన తరువాతే కదా జీవనం మొదలయ్యేది! మధ్యలో చెప్పవలసింది ఇంకేమీ లేదా? ఇదీ ప్రశ్న. దంపతులిద్దరికీ వివాహ దినోత్సవం కూడా ముఖ్యమే. కాని వారికి కేవలం సొంతమైన వ్యవహారం. చదువు, ఉద్యోగాలు, కష్టాలు ప్రతి వ్యక్తికీ మామూలే. కొందరి వ్యక్తులను గుర్తు చేసుకుంటాం. ఆచార్య దివంగతులైన తరువాత మరిచిపోవడం కూడా సాధారణమే.
జనన మరణాల మధ్య ఆచార్య జీవన పోరాటంలో మైలురాళ్లు ఉన్నాయి.
• నవంబర్ 1958లో జనధర్మ వార పత్రిక ప్రారంభించారు.
• 1971లో స్వంత ముద్రణాలయం బాలాజీ ప్రెస్‌ను నెలకొల్పారు.
• 1980 జనవరి లో వరంగల్ వాణి దినపత్రిక వ్యవస్థాపన చేసారు.
1994 జులై 12 దాకా చివరి ఊపిరి ఆగిపోయే వరకు నుంచి 70-71 ఏళ్ల వయసులో పత్రికల ద్వారా చైతన్యం ఆలోచనలను కల్పించారు. అప్పడినుంచి స్ఫూర్తిగా కొనసాగుతున్నారు.దాదాపు 30 ఏళ్ల కిందట జనదర్మ వారపత్రిక ఆగిపోయినా, చేతులు మారిన వరంగల్ వాణి పత్రిక వరంగల్లు కొనసాగుతున్నది. యం. యస్. ఆచార్య…
తెలంగాణ స్వాభిమాన స్వాతంత్య్ర దీప్తికై అక్షరాయుధాలనిచ్చిన వాడు
ప్రజానాయకుల వాకిలి కుక్క కాదు పత్రిక ప్రజల పాశుపతమ్మన్న వాడు…
నీలాలకు కాసులకు నియమాలు వదిలి భజన సేయు కొన్ని కలాలకన్న
అక్షరాక్షరాన కాకతీయ పౌరుషమ్మునింపి, చురుకైన వాక్యాల చురకలిచ్చి జనధర్మపు మాటయై బాటయై వరంగల్లు వాణియైబాణియైన పెన్ను..
ఆచార్య జనదర్మ అనేవారు. తరువాత వరంగల్ వాణి అయ్యగారు అన్నారు. ప్రెస్ అయ్య అన్నారు. ఆ ప్రెస్ లో నేర్చకోవడం, పనినేయడం ఒక అద్భుత అనుభవాలు. కనుక నన్ను ప్రెస్ చిన్నయ్యగారు అనేవారు. జనదర్మే వరంగల్ వాణి అనే శీర్షికతో రాయాలని మనసులోనే ఉంది. కాని నేను చెప్పకముందే ఎడిటర్ ఆజయ్ దేవులపల్లి అడగడం నాకు సంతోషం కలిగించింది. వారం వారం సీరియల్ ద్వారా రియల్ జీవితం రాసుకుందాం. (ఆయన విగ్రహం చెక్కుతున్నారు. వరంగల్లులో నిలిపి నివాళులిద్దామని ఆలోచన.
– మాడభూషి శ్రీధర్