అవును…సెప్టెంబర్‌ 17 ‌ప్రజా పాలన దినం..!

ఉన్న గీతను చిన్నదిగా చూపించాలంటే పక్కన ఒక పెద్ద గీత గీస్తే చాలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ చేసి చూపించింది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సెప్టెంబర్‌ 17 ‌రోజు వివాదానికి తెరదింపిందనే చెప్పొచ్చు. సామాన్య ప్రజలెవరికీ అంతగా ..ముఖ్యంగా ఈ తరానికి అవసరం లేని వివాదం అది. కొన్ని  పార్టీలు తమ  రాజకీయ మనుగడ కోసం సెప్టెంబర్‌ 17 ‌పైన వివాదం సృష్టిస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. 1948లో హైదరాబాద్‌ ‌సంస్థానం నిజామ్‌ ‌పాలన నుంచి విముక్తమైన రోజు సెప్టెంబర్‌ 17..!  ‌రాజ్యాలు..రాజుల నుండి విముక్తి ప్రజల పోరాటాల వల్లే సాధ్యమన్నది మన ముందున్న చరిత్ర. ఏ ఒక్క సమూహం వల్లనో..ఏ ఒక్క వ్యక్తి వల్లనో ప్రజలు నియంతల పాలన నుండి విముక్తి చెందరు. పోరాటాల రూపాలు..సిద్ధాంతాలు వేర్వేరు కావొచ్చు కానీ ప్రజలందరి భాగస్వామ్యం తోనే విముక్తి సాధ్యమన్న చరిత్ర మనముందున్నది.

1947లో దేశం బ్రిటీష్‌ ‌పాలన నుంచి విముక్తి పొందినప్పుడు అనేక సంస్థానాలు విలీనమయ్యాయి. కొన్ని సంస్థానాలు దేశంలో విలీనం కావడానికి సుముఖత చూపలేదు. అందులో ఒకటి నిజామ్‌ ‌పాలనలో ఉన్న హైదరాబాద్‌ ‌స్టేట్‌. 1948‌లో జరిగిన సైనిక చర్య తరువాత నిజామ్‌ ‌లొంగిపోవడం..ప్రజలు స్వేచ్ఛ పొందడం జరిగింది. సైనిక చర్యకు ముందు నిజామ్‌ ‌పాలనలో రజాకార్‌ ‌వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన ప్రజాపోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచింది.

సోవియట్‌ ‌రష్యా కమ్యూనిస్ట్ ‌పార్టీ తెలంగాణా రైతాంగ పోరాటాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించింది. దుక్కి దున్నే రైతు సైతం వొడిసెలు పట్టి నిజామ్‌ ‌ప్రైవేట్‌ ‌సైన్యం రజాకార్లను గ్రామ శివార్లకు తరిమిన్రు. అంతటి మహోజ్వల..చైతన్యవంతమైన ప్రజా పోరాటాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమ ఖాతాలో వేసుకునే దుష్టపన్నాగాన్ని ప్రజలు గమనిస్తున్నారు. చరిత్రకారులు పార్టీల దుష్ట ఆలోచనను నేటి తరానికి బోధించాల్సిన అవసరముంది.

నిజామ్‌ ‌పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17‌ను ఉత్సవంగా జరుపుకోవాల్సిందే..దాంట్లో ఎవరికీ రెండవ అభిప్రాయం ఉండదు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచీ సెప్టెంబర్‌ 17‌ను అధికారికంగా జరుపాలని కొన్ని పార్టీలు..ప్రజా సంఘాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న వలస పాలకులకు సెప్టెంబర్‌ 17 ‌రోజు అప్రాధాన్యత అంశం అయింది. తెలంగాణా అస్థిత్వానికే ప్రమాదంగా ఏర్పడిన వలస పాలకుల పాలన నిజామ్‌ ‌వ్యతిరేక తెలంగాణా ప్రజల వీరోచిత పోరాటంను అధికారికంగా గుర్తించడానికి గానీ..సెప్టెంబర్‌ 17‌ను అధికారికంగా నిర్వహించడానికి గానీ ఆసక్తి చూపలేదు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఒక మీడియా సమావేశంలో అధికారం చేబట్టబోయే ముఖ్యమంత్రిని ఈ విలేఖరి సెప్టెంబర్‌ 17 ‌రోజు ప్రస్తావన తీసుకురాగా..గత పాలకుల సాంప్రదాయాన్నే కొనసాగిస్తామని తెలుపడం గమనార్హం. ఆ తరువాత అధికారంలో ఉన్న ఏడు సంవత్సరాలు సెప్టెంబర్‌ 17‌ను ఏ పేరుతో కూడా అధికారికంగా జరుపడానికి సుముఖత చూపలేదు.

ఆ తరువాత 8 సంవత్సరాలకు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి..2023 ఎన్నికల ముందు సెప్టెంబర్‌ 17‌ను జాతీయ సమైక్యతా దినంగా అధికారికంగా నిర్వహించింది.
నిజామ్‌ ‌పాలన వ్యతిరేక పోరాటంలో ఎటువంటి పాత్ర లేని భారతీయ జనతా పార్టీ 3 దశాబ్దాలుగా సెప్టెంబర్‌ 17‌ను తెలంగాణా విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ ‌చేస్తూ..2014లో కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత అధికారికంగా చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిజామ్‌ ‌పాలనకు చరమగీతం పాడిన సెప్టెంబర్‌ 17‌ను కొందరు వామపక్ష వాదులు విద్రోహ దినంగా అభివర్ణిస్తారు. 1948 సైనిక చర్యలో భారత సైన్యం వేలాది మంది ఉద్యమకారులను ఊచకోత కోసి హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేసుకున్నదని వామ పక్ష వాదుల అభిప్రాయం.

గత ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి సారి జరుగుతున్న సెప్టెంబర్‌ 17‌ను విలీనం, విమోచనం, విద్రోహం వివాదాలకు చోటివ్వకుండా తెలంగాణా ప్రజలు తమ పోరాటాల ద్వారా సాధించుకున్న సెప్టెంబర్‌ 17 ‌స్వేచ్ఛా దినంను ప్రజా పాలన దినంగా అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వ నిర్ణయం సహేతుకం..అభినందనీయం..! ఒక ఫ్యూడల్‌ ‌వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర ప్రజా పోరాటానికి ముగింపుగా సెప్టెంబర్‌ 17 ‌స్వేచ్ఛా దినాన్ని ప్రజాపాలన దినంగా ‘ప్రజాతంత్ర’ ఆహ్వానిస్తున్నది..

– దేవులపల్లి అజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page