- 20 మంది మావోయిస్టులు మృతి
- మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
- మృతుల్లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి, ఒడిశా ఇన్‌చార్జి మనోజ్
- ఘటన స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలోని కుల్హాద్రిఘాట్‌లోని బల్దీగీ, తర్జార్ అడవి ప్రాంతంలో మావోయిస్టులకు భద్రత బలగాలకు భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకోగా, ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆదివారం రాత్రి ఇద్దరు మావోయిస్టులు చనిపోగా సోమవారం అర్ధరాత్రి మరో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని నూపాడుజిల్లాకు సమీపాన ఎదురుకాల్పులు జరిగాయి.
ఒడిశా పోలీసులు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, సిఆర్‌పిఎఫ్ , కోబ్రా బెటాలియన్, ఛత్తీస్‌గఢ్ పోలీస్ సిబ్బంది ఆదివారం మావోయిస్టులు కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టేందుకు వెళ్లారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉండటాన్ని గమనించిన పోలీసులు మావోయిస్టులపై గురిపెట్టారు. వెంటనే ప్రతిఘటించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. మంగళవారం ఉదయం మృతదేహాలను కనుగొన్నారు. 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్‌కౌంటర్ సమయంలో కోబ్రా బెటాలియన్‌కు చెందిన భద్రత సైనికుడు తీవ్రగాయాల పాలయ్యాడు. అతడిని హాస్పిటల్‌కి తరలించారు.
మృతుల్లో ఒడిశా రాష్ట్రం మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి, ఒడిశా ఇన్‌చార్జి మనోజ్ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు గుడ్డు మృతి చెందినట్లు పోలీస్‌వర్గాలు చెబుతున్నాయి. మృతి చెందిన చలపతి ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. చలపతి 27 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ఇప్పటికే ఆయనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోటి రూపాయల రివార్డు ప్రకటించారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి భారీగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గత జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 270 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
కేంద్ర, రాష్ట్ర బలగాలు భారీగా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం అనేక విధాలుగా యత్నాలు కొనసాగిస్తున్నారు. అలాగే పోలీసులు, మావోయిస్టుల పై విజయం సాధిస్తున్నారు. 2025 జనవరిలోనే సుమారుగా 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మావోయిస్టుల పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మావోయిస్టులను ఏరివేసేందుకు భారీగా భద్రత బలగాలను అటవీ ప్రాంతంలో మోహరించారు. అగ్రనాయకులను సైతం మావోయిస్టులు కోల్పోవడంతో మావోయిస్టు పార్టీలోని బలహీనపడుతుందని ప్రభుత్వాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అంచలంచలుగా ఎదిగిన పార్టీ ఛీఫ్ చలపతి
27 ఏళ్ల ప్రాయంలోనే మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై మావోయిస్టుల పార్టీలో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగారు. మావోయిస్టుల వ్యూహరచనలపై , దాడులపై కేశవరావుకి చలపతి నేరుగా రిపోర్డ్ చేసేవాడు. దీని బట్టి ఆయనకు అగ్రనాయత్వంలో ఉన్న బలమైన సంబంధాలు ఉన్నాయి. చలపతికి ఆంధ్రప్రదేశ్ , ఒడిశా సరిహద్దు అడవులపై అవగాహన ఉంది. చలపతి భార్య అరుణ కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నారు. అప్పటి నుంచి చలపతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది.