- కొత్త ఏడాదిలోకి అడుగిడుగుతున్న తరుణం
- మనమంతా కలసికట్టుగా ముందుకు సాగాలి
- రాజ్యాంగం ఆవిర్భవించి నేటికి 75 ఏళ్లు
- సంవిధాన్ సదన్‌లో నేడు రాజ్యాంగ దినోత్సవం
- పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ
న్యూదిల్లీ, నవంబర్25: ప్రజలతో తిరస్కరణకు గురైన వారు పార్లమెంట్‌ను నియత్రించే పనిలో ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలపై చర్చకు అంతా సిద్దంగా ఉండాలని, ప్రభుత్వం అందుకు సంసిద్ధంగా ఉందన్నారు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. పార్లమెంట్‌లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను మోదీ కోరారు. ప్రస్తుతం మనం 2024ను పూర్తి చేసుకోబోతున్నామని అన్నారు. పార్లమెంట్‌లో ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. విపక్షాలను టార్గెట్ చేస్తూ.. పార్లమెంట్‌లో చర్చకు అనుమతించడం లేదని ఆరోపించారు. ఇది 2024 సంవత్సరానికి చివరి కాలం’ అని ప్రధాని అన్నారు. 2025 కోసం దేశం సిద్ధమవుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాలు ఎన్నో అంశాలపరంగా ముఖ్యమైనవి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబరు 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం. దానికి గుర్తుగా రేపు సంవిధాన్ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందాం అని మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రజల చేత తిరస్కరణకు గురైన కొందరు వ్యక్తులు.. కొందరి చేత గూండాయిజం చేయించి, పార్లమెంట్‌ను నియంత్రించేందుకు యత్నిస్తున్నారు. వారి చర్యలను దేశ ప్రజలంతా చూస్తున్నారు.
సమయం వొచ్చినప్పుడు వారు చూస్తూ ఊరుకోరు. అయితే ఇక్కడ బాధించే విషయం ఏంటంటే.. పార్టీలతో సంబంధం లేకుండా కొత్తగా పార్లమెంట్‌కు ఎన్నికైన వారు కొత్త ఆలోచనలతో వొస్తుంటారు. కొందరి గందరగోళ చర్యల వల్ల కొత్త ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించరు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోరు. వారికి ప్రజలపై ఎలాంటి బాధ్యత ఉండదు. అందుకే వారు ప్రజల అంచనాలను ఎన్నటికీ అందుకోలేరని మోదీ సభా కార్యకలాపాలు సాగనివ్వని వారి తీరును ఆక్షేపించారు. ప్రపంచం ఇప్పుడు మనల్ని ఎంతో ఆశావహ దృక్పథంతో చూస్తోంది. ఆ గౌరవం పెంపొందేలా సభలో మన ప్రవర్తన ఉండాలి. పార్లమెంట్ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉంది. దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. వివిధ అంశాలను సరైన రీతిలో సభలో ఎత్తిచూపడం ద్వారా మనం వారి ఆకాంక్షలను నెరవేర్చగలం. దాని నుంచి రాబోయే తరాలు ప్రేరణ పొందుతాయి. ఈ సెషన్ ఫలవంతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సమావేశాలను ఉత్సాహంగా ముందుకుతీసుకెళ్లాలని ఎంపీలందరినీ కోరుతున్నానని మోదీ అన్నారు. దేశం 2025ని పూర్తి ఉత్సాహంతో స్వాగతించేందుకు సిద్ధమవుతోంది. ఈ పార్లమెంటు సమావేశాలు అనేక విధాలుగా ప్రత్యేకమైనవి. ఇప్పుడు అతిపెద్ద విషయం ఏమిటంటే, మన రాజ్యాంగం 75 సంవత్సరాల ప్రయాణం, 75వ సంవత్సరంలోకి ప్రవేశించడం ప్రజాస్వామ్యానికి మంచి అవకాశమని గుర్తు చేశారు. రాజ్యాంగం 75వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించడానికి రేపు అందరూ రాజ్యాంగ పరిషత్‌లో కలిసి రావాలని ప్రధాని కోరారు.
మహారాష్ట్ర, యూపీలో బంపర్ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. శీతాకాల సమావేశాలు కావడంతో వాతావరణం చల్లగా ఉంటుందని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోదీ, కొద్దిమంది వ్యక్తులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ప్రస్తావించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు తిరస్కరించిన కొందరు వ్యక్తులు తమ గూండాయిజంతో పార్లమెంట్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. సాంప్రదాయం ప్రకారం సమావేశాల మొదటి రోజు, ప్రధాని మోదీ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ప్రసంగించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు, లోక్‌సభ, రాజ్యసభల 19-9 సమావేశాలు జరుగుతాయి.
వక్ఫ్ (సవరణ) బిల్లుతో సహా 16 బిల్లుల జాబితాను ప్రభుత్వం సెషన్‌లో పరిశీలనకు సిద్ధం చేసింది. లోక్‌సభలో ఎనిమిది, రాజ్యసభలో రెండు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించేందుకు ప్రయత్నిస్తుంది. గత సెషన్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన బ్యాంకింగ్ నిబంధనల (సవరణ) బిల్లు, రైల్వే (సవరణ) బిల్లు ఇందులో ఉన్నాయి. కానీ వాటిని పాస్ చేయలేకపోయారు. వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ ఆమోదం పొందిన ఇండియన్ ఎయిర్‌క్రాప్ట్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అనేక ముఖ్యమైన బిల్లులపై కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసే చాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గందరగోళంగా మారే అవకాశం ఉంది.