- అసెంబ్లీలో కొట్లాడుతా…అవసరమైతే కోర్తుకెళ్తా…
- సిద్ధిపేట కాంగ్రెసోళ్లకు సోయి లేదా..?
రద్దు చేసిన పనులు ఇవ్వకుంటే వొదిలిపెట్టే ప్రసక్తే లేదు - కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే హరీష్‌రావు వార్నింగ్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 25: సిద్ధిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమేనని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట అభివృద్ధి కోసం, ప్రజల కోసం అసెంబ్లీలో కొట్లాడుతాననీ, అవసరమైతే కోర్టుకెళ్తాననీ, సిద్ధిపేట అభివృద్ధిని అడ్డుకుంటే, రద్దు చేసిన పనులు ఇవ్వకుంటే కాంగ్రెసోళ్లను వొదిలిపెట్టే ప్రసక్తే లేదనీ హెచ్చరించారు. సోమవారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హరీష్‌రావు నియోజకవర్గంలోని 104 మందికి రూ.25 లక్షల సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. సిద్ధిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 9,800 మందికి సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆర్థిక సహాయంగా అందించామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులకు డబుల్ పనులు చేసి ప్రజల ప్రేమ పొందాలి. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చినప్పటి నుంచి గత బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంలో సిద్ధిపేటకు మంజూరు చేసిన నిధులను, అభివృద్ధి పనులను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సిద్ధిపేట ప్రజల ప్రాణాలను కాపాడటానికి, ప్రజల ఆరోగ్యం కోసం మంత్రిగా వెయ్యి పడకల దవాఖానను మంజూరు చేస్తే పనులు అర్ధంతరంగా ఆపారనీ, క్యాన్సర్ కిమొథెరపి, రేడియో థెరపి మంజూరు చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.200 కోట్ల రోడ్డు పనులు రద్దు చేసి మంత్రి సీతక్క ములుగుకు తీసుకుపోతున్నారని, ఇలా చెప్పుకుంటూ పోతే సిద్ధిపేటకు మంజూరు చేసిన నిధులన్నింటినీ రద్దు చేస్తున్నారన్నారు. వెటర్నరీ కళాశాల రద్దు చేశారనీ, కేసీఆర్, నేను సిద్ధిపేట జిల్లాకు గోదావరి జలాలు, రైలు తీసుకొచ్చామని తెలిపారు. గోదావరి జలాలలతో సిద్ధిపేటలో ఇక కరువు అనేది లేకుండా చేశామన్నారు. గత బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో సిద్ధిపేట అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏ మొహం పెట్టుకుని తిరుగుతారనీ, సిద్ధిపేట కాంగ్రెసోళ్లకు సోయి లేదా?అని ప్రశ్నించారు. సిద్ధిపేట అభివృద్ధికి మోకాళ్లు అడ్డు వేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమా?అని నిలదీశారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉండి సిద్ధిపేట అభివృద్ధిని చూసి, కడ్లలో నిప్పులు పోసుకున్నారు.. నేడు నిధులకు మోకాళ్లు అడ్డు పెడుతున్నారన్నారు. ప్రభుత్వ దవాఖానలో ప్రజా ఆరోగ్యం నిర్వీర్యమైందని అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మందులు, కేసీఆర్ కిట్స్ న్యూట్రీషన్ కిట్లు బంద్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ దవాఖాన వైద్యం నిర్వీర్యం చేస్తుందన్నారు. 24 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు చేస్తే దాన్ని కూడా రద్దు చేసి హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారని ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడే వేలేటి రాధాకృష్ణశర్మ, జంగిటి కనకరాజు, గుడాల శ్రీకాంత్, మారెడ్డి రవీందరెడ్డి, కుంభాల యెల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.