మార్చి 14 రాత్రి దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు దొరికిందనే వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫలితంగా, తనపై వొచ్చిన అవినీతి ఆరోపణల పట్ల, తన నైతిక పతనావస్థ పట్లా న్యాయవ్యవస్థ ఎలా స్పందిస్తుందన్న ప్రశ్న ప్రధానాకర్షణ అయింది. జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించిన ఈ ఉదంతం మన న్యాయవ్యవస్థలో అవినీతి అనేది సర్వసాధారణ అంశమన్నట్టు భావించేలా చేస్తోంది. అయినప్పటికీ, ఏ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయ మూర్తి, అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కోవడం గానీ, లేదా శిక్ష అనుభవించడం గానీ ఇంత వరకూ జరగలేదు. న్యాయ వ్యవస్థ తీరు తెన్నులు, దాని నియంత్రణ దేశంలో చాలా కాలంగా ఆందోళనకరంగా రూపుదాల్చిన పరిస్థితిని కూడా ఇది వివరిస్తుంది. 2010లో, ఒక మాజీ కేంద్ర న్యాయ మంత్రి, దేశంలోని ఆఖరి పదహారు ప్రధాన న్యాయమూర్తులలో ఎనిమిది మంది న్యాయమూర్తులు అవినీతిపరులని ఒక అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
అదే సమయంలో సంఘ విద్రోహక శక్తులు, FERA (విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం) ఉల్లంఘించే వారు, వరకట్న హత్యలు చేసేవారు సహా, అభివృద్ధి నిరోధక శక్తుల సమూహం సుప్రీంకోర్టుని తమ స్వర్గధామంగా మార్చుకుని కులుకుతున్నారని తీవ్ర వ్యాఖ్య చేశారు..
న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించిన అనేక నివేదికలు రూపొందాయి. కానీ వాటిలో చాలా అవినీతి కేసులను తొక్కి పెట్టేశారు. 2022లో, స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా న్యాయవ్యవస్థలో అవినీతిని బహిర్గతం చేయడానికి ప్రయత్నించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై కోర్టు ధిక్కార కేసును ఉపసంహరించుకుంది అప్పట్లో సుప్రీం కోర్టు. న్యాయస్థానం ఒత్తిడితో, తనపై ధిక్కార చర్యలను నిలిపివేయడానికి ఆయన గందరగోళ భాషలో క్షమాపణలు చెప్పారు.
అప్పటి నుంచి అవినీతి తో పాటు దుష్ప్రవర్తనకి సంబంధించిన ఆరోపణలు పెరిగాయి. ప్రస్తుత కేసులో ప్రశ్నార్థక న్యాయమూర్తి నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న లెక్కల్లో చూపని నగదు ఉదంతం సహా ఇటీవల ఐదుగురు ప్రధాన న్యాయమూర్తులలో నలుగురు న్యాయమూర్తులు జగదీష్ సింగ్ ఖేహర్, దీపక్ మిశ్రా, రంజన్ గొగోయ్, ఎన్. వి. రమణ అవినీతి లేదా దుష్ప్రవర్తన కు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్నారు. న్యాయవ్యవస్థ ప్రమాణాల క్షీణత గురించి, తమ ఆందోళనల గురించి జనవరి, 2018లో నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్వహించిన ఒక విలేకరుల సమావేశం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది.
తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, జస్టిస్ ఖేహర్ విచారణను ఎదుర్కోలేదు. జస్టిస్ గొగోయ్ పై, జస్టిస్ రమణపై విచారణలు అకస్మాత్తుగా నిలిపివేశారు. జస్టిస్ మిశ్రాను పదవి నుంచి తొలగించే ప్రక్రియలు విఫలమయ్యాయి, ఎక్కువగా రాజకీయ కారణాల వల్ల.
ఈ హై-ప్రొఫైల్ వివాదాలు ఉన్నత న్యాయవ్యవస్థలో గణనీయమైన జవాబుదారీ తనం ఎగవేతను నొక్కి చెబుతున్నాయి. ఈ ఆరోపణలు, వాటి వివాదాలు అన్నీ భారత న్యాయవ్యవస్థ కు, దేశంలో న్యాయ పరిపాలనకు అంటిన మరక గా భావించాలి.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అవినీతికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్లు లేకపోవడం ప్రస్తుత యంత్రాంగాలు న్యాయ స్థానాల్లో అవినీతిని పరిష్కరించలేవని సూచిస్తున్నాయి. న్యాయమూర్తులను విచారణల నుంచి రక్షించే సుప్రీంకోర్టు తీర్పులను రద్దు చేయడం, న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చను నిరోధించే కఠినమైన న్యాయ ధిక్కార ప్రమాణాలను సరళీకరించడం వంటి సంస్కరణలను న్యాయ కోవిదులు సూచిస్తున్నారు. ఈ మొత్తం పరిస్థితి సూచించేది ఏమిటంటే, మన దేశంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనేది బార్, బెంచ్, రాజకీయాలు, ఆ తర్వాత మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ అని పిలుచుకునే దాని మధ్య ఉన్న అనుబంధపు విష పరిణామమే! అయితే, నిరాశాజనకంగా, న్యాయవ్యవస్థ లేదా పార్లమెంటు వ్యవస్థ అవినీతకి, దుష్ప్రవర్తనకు సంబంధించిన పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి బలమైన నియంత్రణ విధానాలను ఏర్పాటు చేయలేకపోయాయి. దీనికి విరుద్ధంగా, న్యాయవ్యవస్థ బాహ్య పరిశీలనను తప్పించుకోవడంలో విజయం సాధించింది. ఒక నియంత్రణ సంస్థను స్థాపించడానికి ఉద్దేశించిన సంస్కరణలను న్యాయవ్యవస్థ స్వాతంత్య్రానికి ముప్పుగా చిత్రీకరిస్తోంది. ఫలితంగా, మన దేశంలో న్యాయమూర్తులు అంతర్గత యంత్రాంగాల ద్వారా నియంత్రితులవుతున్నారు. ఇలా న్యాయవ్యవస్థను నైతిక పతనావస్థలోకి నెట్టివేయడమే ..!