భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అధికార వర్గాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయి వాస్తవాలు మాత్రం భిన్న చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ద్రవ్యోల్బణ గణాంకాలు, రూపాయి పతనం, పెరుగుతున్న ఆహార ధరలు, అంతర్జాతీయ ముడి సరుకుల ధరల ప్రభావం, నిరుద్యోగం, వినియోగ వ్యయం తగ్గుదల— ఇవన్నీ దేశ ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదనడానికి సంకేతాలు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించడం, భవిష్యత్తులో కఠిన పరిస్థితులు రావొచ్చని సంకేతాలు ఇవ్వడం రాజకీయంగా, ఆర్థికంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఏప్రిల్ నెలలో దేశ ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకోవడం యాదృచ్ఛికం కాదు. ఆహార ద్రవ్యోల్బణం 4.2 శాతానికి పెరగడం దేశంలో సాధారణ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కూరగాయలు, ధాన్యాలు, పప్పుధాన్యాలు, వంటనూనెల ధరలు ఇప్పటికే సామాన్యుడి బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఒకవైపు వర్షాభావ సూచనలు ఉండగా, మరోవైపు పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితులు సరఫరా వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా రవాణా ఖర్చులు, దిగుమతి వ్యయాలు పెరిగి ధరల పెరుగుదల మరింత వేగవంతమవుతోంది.
2014లో అధికారంలోకి వొచ్చిన తరువాత నరేంద్ర మోదీ ప్రభుత్వం “మేక్ ఇన్ ఇండియా”, “ఆత్మనిర్భర్ భారత్”, “5 ట్రిలియన్ ఎకానమీ” వంటి భారీ నినాదాలతో దేశ ప్రజల్లో ఆశలు పెంచింది. కానీ పదేళ్ల తరువాత కూడా దేశంలో తయారీ రంగం ఆశించిన స్థాయిలో విస్తరించలేదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నోట్ల రద్దు, జీఎస్టీ అమలు గందరగోళం, కోవిడ్ అనంతర విధాన అస్పష్టతలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోట్లాది చిన్న వ్యాపారాలు మూతపడగా, అసంఘటిత రంగం పూర్తిగా బలహీనపడింది.
దీనికి తోడు దేశీయ పెట్టుబడుల కంటే విదేశీ మార్కెట్లలో భారతీయ కార్పొరేట్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టడం మరో ఆందోళనకర అంశం. అమెరికా మార్కెట్లలో భారతీయ కంపెనీల పెట్టుబడులు పెరగడం వెనుక కేవలం వ్యాపార అవకాశాలే కారణం కాదు. దేశీయ మార్కెట్‌పై విశ్వాసం తగ్గడం, విధాన స్థిరత్వంపై అనుమానాలు, వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం వంటి కారణాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు భారత మార్కెట్‌ను “భవిష్యత్తు ప్రపంచ కేంద్రం”గా కొనియాడిన కార్పొరేట్ వర్గాలే ఇప్పుడు విదేశీ విస్తరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
ఇక రూపాయి పతనం కూడా ఆర్థిక బలహీనతకు సంకేతంగా కనిపిస్తోంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. ముఖ్యంగా చమురు, ఎరువులు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగి చివరకు భారం ప్రజలపై పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇంధన ధరల పెరుగుదలను కొంతవరకు పన్నుల సర్దుబాట్లతో నియంత్రించినా, ఆ పరిస్థితి ఎప్పటికీ కొనసాగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగితే రవాణా వ్యయం ద్వారా అన్ని వస్తువుల ధరలు మళ్లీ పెరుగుతాయి.
అయితే ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి? “ఇంధన వినియోగం తగ్గించండి”, “మితవ్యయం పాటించండి”, “సంక్షోభానికి సిద్ధంగా ఉండండి” అనే సూచనలు. కానీ ప్రజలు ప్రశ్నిస్తున్నది—దేశాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? పదేళ్లుగా దేశాన్ని నడిపిస్తున్న ప్రభుత్వం బాధ్యత వహించకూడదా?
ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు ప్రజల్లో ధైర్యం నింపాలి. కానీ భవిష్యత్తు మరింత కఠినమవుతుందని సంకేతాలు ఇవ్వడం మార్కెట్లలో అనిశ్చితిని పెంచే ప్రమాదం ఉంది. పెట్టుబడిదారులు, మధ్యతరగతి, చిన్న వ్యాపారులు— ఈ వర్గాలన్నీ కేంద్ర ప్రభుత్వం అవలంబించే ఆర్ధిక విధానాల పై ఆధారపడి నడిచేవే ..!. ఆ విశ్వాసాన్ని బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రభుత్వం భయాందోళనలను పెంచే విధంగా మాట్లాడితే దాని ప్రభావం మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.
ఇక ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యతలపై కూడా విమర్శలు వొస్తున్నాయి. భారీ విగ్రహాలు, ఈవెంట్ రాజకీయాలు, ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాలపై వేల కోట్లు ఖర్చు చేస్తూనే, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి రంగాలకు సరిపడ నిధులు కేటాయించడంలో కేంద్రం విఫలమైందన్న అభిప్రాయం బలపడుతోంది. నిరుద్యోగం చరిత్రలోనే అత్యధిక స్థాయిల్లో ఉండగా, యువతలో అసంతృప్తి పెరుగుతోంది. ఉద్యోగాల కంటే ప్రచారమే ఎక్కువగా కనిపిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యవసాయ రంగం కూడా తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఎరువుల ధరలు, డీజిల్ ఖర్చులు, విత్తనాల ధరలు పెరిగిపోవడంతో రైతు ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. కానీ రైతు పంటలకు గిట్టుబాటు ధరలు మాత్రం అందడం లేదు. ఒకవైపు రైతు అప్పుల్లో కూరుకుపోతుంటే, మరోవైపు ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండటం వ్యవస్థలోని విరుద్ధతలను బయటపెడుతోంది.
ఇది నిజంగా “ఆర్థిక దివాలా” పరిస్థితినా? అధికారికంగా కాదు. భారతదేశానికి ఇంకా విస్తారమైన మార్కెట్ ఉంది, విదేశీ మారక నిల్వలు ఉన్నాయి, సేవారంగం బలంగా ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థలోని అసమానతలు, ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం, ధరల పెరుగుదల, విధాన అస్పష్టతలు కొనసాగితే సంక్షోభ లక్షణాలు మరింత స్పష్టమవుతాయి. ముఖ్యంగా సామాన్య ప్రజల జీవితాల్లో ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంటే, జిడిపి గణాంకాలు మాత్రమే ప్రజలకు ఉపశమనం ఇవ్వలేవు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ప్రజలపై మితవ్యయ బోధనలు చేయడం కంటే, ధరల నియంత్రణ, ఉపాధి సృష్టి, వ్యవసాయ బలోపేతం, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం, రూపాయి స్థిరీకరణ, పారదర్శక ఆర్థిక విధానాలపై దృష్టి పెట్టాలి. లేదంటే “విశ్వగురు భారత్” అనే నినాదం కేవలం ప్రచారంగానే మిగిలిపోతుంది.
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం అంటే కేవలం కార్పొరేట్ లాభాలు పెరగడం కాదు; సాధారణ కుటుంబం గౌరవంగా జీవించగలగాలి. ఆ లక్ష్యానికి దూరమవుతున్న సంకేతాలు కనబడుతున్నప్పుడు విమర్శలు సహజం. ప్రజాస్వామ్యంలో ఆర్థిక విధానాలపై ప్రశ్నించడం దేశద్రోహం కాదు—అది బాధ్యతాయుతమైన పౌర చైతన్యం.




