తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైందనే సంకేతాన్ని టీవీకే అధినేత, కొత్త ముఖ్యమంత్రి విజయ్ తన తొలి నిర్ణయంతోనే ఇచ్చారు. పార్టీ స్థాపించి కేవలం రెండున్నర సంవత్సరాల వ్యవధి లోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వొచ్చిన విజయ్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 టాస్మాక్ వైన్ షాపులను మూసివేయాలని ఆయన ఆదేశించడం కేవలం పరిపాలనా చర్య మాత్రమే కాదు; అది ఒక రాజకీయ సందేశం కూడా.ఈ నిర్ణయం వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిమాణాలను పరిశీలిస్తే, తమిళనాడులో కొత్త రాజకీయ సంస్కృతి ఆవిర్భవించే అవకాశం కనిపిస్తుంది..
తమిళనాడులో మద్యం విక్రయ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. టాస్మాక్ ద్వారా ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఆదాయం పొందుతోంది. సంవత్సరానికి లక్షల కోట్ల టర్నోవర్ జరిగే ఈ వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడం, ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల సమీపంలో ఉన్న షాపులను మూసివేయడం ఆర్థికపరంగా ప్రభుత్వానికి చిన్న విషయం కాదు. అయినప్పటికీ, విజయ్ తీసుకున్న నిర్ణయం “రాజకీయ లాభనష్టాల కంటే ప్రజా ఆరోగ్యం,సంక్షేమం ముఖ్యం” అనే భావనను ప్రతిబింబిస్తోంది.
విద్యాసంస్థల సమీపంలో మద్యం దుకాణాలు ఉండటం అనేది చాలా కాలంగా సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు, తల్లిదండ్రుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్న అంశం. విద్యార్థులపై ప్రతికూల ప్రభావం, యువతలో మద్యపాన అలవాట్ల పెరుగుదల, మహిళల భద్రత వంటి సమస్యలు తరచుగా ప్రస్తావనకు వొచ్చాయి. దేవాలయాలు, ప్రార్థనా స్థలాల పక్కనే మద్యం విక్రయాలు జరగడం సాంస్కృతికంగా కూడా అనేక మందిని బాధించింది. బస్ స్టాండ్ల పరిసరాల్లో ఉండే మద్యం దుకాణాలు ప్రజా శాంతిభద్రతల సమస్యలకు కారణమవుతున్నాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తీసుకున్న నిర్ణయం ప్రజల్లో ఒక సానుకూల భావనను కలిగించే అవకాశముంది.
అయితే, ఈ నిర్ణయాన్ని కేవలం నైతిక కోణంలో మాత్రమే చూడలేం. దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటి వరకు డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలే ప్రధాన శక్తులుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల పాలనలో కూడా మద్యం విక్రయాలపై విమర్శలు వొచ్చినప్పటికీ, ఆదాయం కోణంలో పెద్ద మార్పులు చేయడానికి ఎవరూ సాహసించలేదు. విజయ్ మాత్రం అధికారంలోకి వొచ్చిన వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా “నేను భిన్నమైన నాయకుడిని” అనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలనుకున్నట్లు కనిపిస్తోంది.
ప్రత్యేకించి యువత, మహిళలు, మధ్యతరగతి వర్గాల్లో ఈ నిర్ణయం మంచి స్పందన తెచ్చే అవకాశం ఉంది. సినిమాల ద్వారా ప్రజల్లో విశేష ఆదరణ సంపాదించిన విజయ్, రాజకీయాల్లో కూడా భావోద్వేగపూరితమైన మరియు ప్రజల జీవన విధానానికి దగ్గరగా ఉండే అంశాలను ఎంచుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఇది భవిష్యత్తులో తమిళనాడు రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది.
అయితే మరోవైపు కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. 717 దుకాణాలను మూసివేయడం మాత్రమే సమస్యకు శాశ్వత పరిష్కారమా? మద్యం వినియోగం తగ్గించడానికి ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తుందా? లేదా ఇది కేవలం ప్రతీకాత్మక చర్యగానే మిగిలిపోతుందా? అనే సందేహాలు సహజమే. ఎందుకంటే, ఒక ప్రాంతంలోని షాపులను మూసివేస్తే వినియోగదారులు మరో ప్రాంతానికి వెళ్లే అవకాశముంది. అక్రమ మద్యం విక్రయాలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఈ చర్యకు అనుబంధంగా పునరావాసం, అవగాహన కార్యక్రమాలు, డీ-అడిక్షన్ కేంద్రాల బలోపేతం వంటి చర్యలు కూడా అవసరం.
మరో ముఖ్యమైన అంశం రాష్ట్ర ఆదాయం. తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు భారీ నిధులు అవసరం. మద్యం ఆదాయం తగ్గితే ఆ లోటును ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుంది? ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం అవసరం. లేకపోతే, కొన్ని నెలల తర్వాత మళ్లీ కొత్త రూపంలో అదే దుకాణాలు తెరుచుకునే పరిస్థితి ఏర్పడవొచ్చు.
ఇక రాజకీయంగా చూస్తే, విజయ్ ఈ నిర్ణయంతో తన పాలనకు ఒక నైతిక దిశను నిర్దేశించడానికి ప్రయత్నించారు. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి నాయకులు ప్రజా సంక్షేమాన్ని తమ రాజకీయాల్లో ప్రధాన భాగంగా మలిచారు. ఇప్పుడు విజయ్ కూడా “సంక్షేమం , నైతిక పరిపాలన” అనే కొత్త కలయికను ప్రజల ముందుకు తీసుకురావాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది విజయవంతమైతే దక్షిణ భారత రాజకీయాల్లో కొత్త మోడల్‌గా మారే అవకాశముంది.
దేశవ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం చర్చకు దారితీస్తోంది. అనేక రాష్ట్రాలు మద్యం ఆదాయంపై ఆధారపడుతున్న పరిస్థితిలో, ప్రజా ఆరోగ్యం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సాధ్యమనే చర్చ ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా విద్యాసంస్థలు, దేవాలయాల సమీపంలో మద్యం దుకాణాలపై తరచుగా విమర్శలు వొస్తుంటాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు నిర్ణయం ఇతర రాష్ట్రాలపై కూడా నైతిక ఒత్తిడిని పెంచవొచ్చు.
అయితే ప్రజా సంక్షేమం పేరుతో తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకురావాలి. కేవలం ఆదేశాలు ఇవ్వడం సరిపోదు; వాటి అమలు, పర్యవేక్షణ, దీర్ఘకాలిక ప్రణాళిక కూడా అంతే ముఖ్యం. విజయ్ తీసుకున్న తొలి నిర్ణయం ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఇప్పుడు ఆ ఆశలను నిలబెట్టుకోవడం ఆయన ప్రభుత్వానికి పెద్ద సవాల్.
మొత్తంగా చూస్తే, విజయ్ తీసుకున్న నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో గుణాత్మక మార్పుకు సంకేతం.. అది ప్రజా ఆరోగ్యాన్ని, సామాజిక బాధ్యతను రాజకీయాల కేంద్రంగా తీసుకురావాలనే ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రయత్నం విజయవంతం కావాలంటే రాజకీయ సంకల్పంతో పాటు ఆర్థిక ప్రణాళిక, సామాజిక అవగాహన, కట్టుదిట్టమైన అమలు కూడా అవసరం. తొలి అడుగు ధైర్యంగా పడింది. ఇప్పుడు ఆ దారిలో విజయ్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగాలని ఆశిద్దాం..





