బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం
ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలపై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. దీనిపై శాసనసభలో చర్చించాలని ప్రతిపాదించింది. ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శికి వాయిదా తీర్మానం అందించింది. ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పోరాటాలకు ఊపిరిలూదిన విద్యార్థిలోకంపై కక్షగట్టింది. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో ఆందోళనలపై ఈ నెల 15న నిషేధం విధించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులపై ఆనాటి పాలకులు ఊరూరా ఉక్కుపాదం మోపుతున్న తరుణంలోనూ ఓయూ విద్యార్థి ఉద్యమంపై ఎలాంటి నిషేధాజ్ఞలు విధించలేదు.
కానీ, నేడు ‘ప్రతికూల ప్రభావం’ అంటూ సాకుగా చూపి రేవంత్ సర్కారు అణచివేత చర్యలకు దిగింది. వర్సిటీలో అన్నిరకాల ధర్నాలు, నిరసన ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ శనివారం ఓయూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత ఉస్మానియాపై ఇలాంటి నిషేధాజ్ఞలు విధించడం విపరిణామమే. వర్సిటీ అధికారుల ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాల నేతలు, విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, దాని విభాగాలు, కళాశాలలు, కేంద్రాలు, పరిపాలనా భవనాల్లో ఆందోళనలు, ధర్నాలు, ప్రదర్శనలు నిషేధిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి ఈ సర్క్యులర్ జారీ చేశారు.
నిరసనలు యూనివర్సిటీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు పరిపాలన, విద్యా పురోగతిని జాప్యంచేసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో భద్రతా సమస్యలు సైతం తలెత్తాయని తెలిపారు. వర్సిటీ భవనాల్లోకి అనధికారికంగా ప్రవేశించడం, ధర్నాలు, ఆందోళనలు, ప్రదర్శనలు నిర్వహించకుండా నిరోధించడం, వర్సిటీ ఉద్యోగులు, అధికారులపై అభ్యంతరకరమైన భాషను వినియోగిస్తూ దూషించడాన్ని సంపూర్ణంగా నిషేధించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన విద్యార్థులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఏదైనా ఫిర్యాదులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించడం ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు