
మనిషి పొడుగు, పొట్టి అన్న అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సహజంగా మనష్యుల ఎత్తు అన్నది వారి వయస్సు, జన్యుపరంగా, పోషకాహారం వల్ల ఉంటుందని చెబుతారు. అలాగే వారి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబంలోని పెద్దల క్రమంగాకూడా మనిషి ఎదుగుదల ఉంటుంది. ఇలానే ఉండాలని ఎవరూ ఎత్తును నిర్దారించలేరు. అయితే శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న క్రమంలో ఎత్తు పెరిగే విషయంలో కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. అవన్నీ విజయవంతం అవుతాయని చెప్పడం కష్టం. ఆక్రమంలో ప్రాణాలమీదకు తెచ్చుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా అత్యంత పొడుగ్గా ఉండడంగాని, అత్యంత పొట్టి(చిన్న)గా ఉండడం కూడా ప్రపంచస్థాయి రికార్డుగా గుర్తించబడటాన్ని చూస్తున్నాం. అలాంటివారు కనిపించినప్పుడు ఆశ్చర్యంగా వారినే చూస్తుంటాం.
ఉన్న సమాచారం మేరకు ఏడాది కింది వరకు ప్రపంచంలో అత్యంత పొడుగైన వ్యక్తిగా ‘ఘనా’ కు చెందిన సులేమాన్ అబ్దుల్ సమీద్ గుర్తించబడ్డాడు. చిన్న వయస్సునుండే ఏ ఏడాదికాఏడాది పెరిగిపోతూ 9 అడుగుల ఆరు అంగుళాలకు చేరుకున్నాడు. మరో ప్రపంచ పొడవరి టర్కీకి చెందిన సుల్తాన్ కోసేన్. అతని ఎత్తు 8అడుగుల 2.83 అంగుళాలు. అమెరికాకు చెందిన రాబర్టు వాడ్లో 8 అడుగుల 11.1 అంగుళాలు. ఇండియా విషయానికొస్తే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ పొడవు 8 అడుగుల ఒక అంగుళం. ఇక తెలంగాణలోని జగిత్యాలకు చెందిన పొలిపాక గట్టయ్య ఎత్తు 7 అడుగుల 5 అంగుళాలు. ఆయన గురించి పత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి. ఆయన 2015లో మరణించాడు. ఇకపోతే పొట్టిగా ఉన్న వారి విషయానికొస్తే ఇండియన్ షార్టెస్ట్ మెన్‌గా మిని మణికంఠ 24 ఏళ్ళ వయస్సులోకూడా ఎత్తు 24 అంగుళాలు (2 అడుగులే). హైదరాబాద్‌కు చెందిన గట్టిపల్లి శివలాల్ ఎత్తు 3 అడుగులే. ఇలా చెప్పుకుంటూపోతే పొడుగు, పొట్టికి సంబందించి ప్రపంచ స్థాయిలో, జాతీయస్థాయిలో ఎత్తుతో రికార్డులు నెలకొల్పినవారెందరో ఉన్నారు.
“తన పొడవాటి శరీరంపైన కామెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శరీరాకృతినిబట్టి తాను కూడా విమర్శించవచ్చని సభ్యత, సంస్కారాలు అడ్డువస్తున్నాయంటూ, పొడవును బట్టి మెదడు మోకాళ్ళలోనో, అరికాళ్ళలోనో ఉండదు. తలలో కొవ్వులేనివాడికి ఉన్నవాడిని చూస్తే జలసీగానే ఉంటుందంటూ హరీష్ రావు విరుచుకుపడ్డాడు..”
మండువ రవీందర్‌రావు
ఇంతకూ చెప్పొచ్చే విషయమేమంటే జన్యుపరంగా సంభవించే ఎత్తు పొడవులు ఇప్పుడు రాజకీయాంశాలుగా మారాయి. రాష్ట్రంలో అధికార పార్టీ, విపక్ష పార్టీల మధ్య పొడవు పొట్టి అంశంపైన చాలాకాలంగా మాటల యుద్ధం కొనసాగుతున్నది. దీనికి నాంది ప్రస్తానం చేసింది మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. అధికారంలోకి వచ్చిన ముప్పై నెలల కాలంలో రాష్ట్రంలో ఎక్కడ బహిరంగ సభలు, సమావేశాలు జరిగినా ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌పైన మూడవకాలుపై లేవటమన్నది సహజమైపోయింది. బిఆర్‌ఎస్ పార్టీని, ఆ పార్టీ అధినేత కెసిఆర్, ముఖ్యనేతలు కెటిఆర్, హరీష్‌రావును తిట్టకుండా, ఎద్దేవ చేయకుండా ఆయన ఉపన్యాసం ముగియదు. ఆ క్రమంలోనే హరీష్‌రావు ఎత్తు గురించి ఆయన చేసిన విమర్శ ఇరు పార్టీల మధ్య పెద్ద వివాదానికే దారితీసింది.
టిపిసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో పదవీబాధ్యతలు స్వీకరించే సందర్భంలో నైతేనేమీ, తాజాగా ఇబ్రాహింపట్న పాఠశాల ప్రారంభోత్సవ సమయంలోనైతేనేమీ, అంతకు ముందు ఇందిరమ్మ ఇండ్లు, సింగూరు ప్రాజెక్టు, కాళేశ్వరం తదితర విషయాలపై ప్రసంగించిన సందర్భాల్లో రేవంత్‌రెడ్డి హరీష్‌రావు ఎత్తుగురించి చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ తీవ్రంగా తప్పు పట్టింది. ‘‘తాటిచెత్తంత పెరిగావు.. దూలంలా పెరిగావు..దూడకున్నంత మెదడులేదు’’ లాంటి పదజాలంతో తనను ముఖ్యమంత్రి నిత్యం విమర్షిస్తుండడంపైన హరీష్‌రావు దీనిపై తీవ్రంగా స్పందించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలివికావని ఆయన ఘాటుగానే ప్రతిస్పందించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అ అంశంపైనే చర్చ జరుగుతున్నది.
తన పొడవాటి శరీరంపైన కామెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శరీరాకృతినిబట్టి తాను కూడా విమర్శించవచ్చని సభ్యత, సంస్కారాలు అడ్డువస్తున్నాయంటూ, పొడవును బట్టి మెదడు మోకాళ్ళలోనో, అరికాళ్ళలోనో ఉండదు. తలలో కొవ్వులేనివాడికి ఉన్నవాడిని చూస్తే జలసీగానే ఉంటుందంటూ హరీష్ రావు విరుచుకుపడ్డాడు. తనను తాడిచెట్టు అని విమర్శిస్తున్న రేవంత్‌రెడ్డిని వెంపలిచెట్టు అంతకూడా లేవని అనవచ్చుకాని సంస్కారం అడ్డువస్తున్నదంటారాయన. నీలాగానే నీ మనస్సు పొట్టి, ఆలోచనలుకూడా పొట్టేనంటూ, తనను ఎంత తిట్టినా, విమర్శించినా ఏనాటికి తన ఎత్తు ఎదగలేడంటూ హరీష్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దైవతహగా సంక్రమించిన పొడగరితనానికి నేను ఏం చెయ్యాలి. పొడుగ్గా ఉండటమన్నది తన తప్పుగా రేవంత్‌రెడ్డి మాట్లాడమేంటి, నా అంత పొడగరిగా తాను లేకపోయానే అన్న ఈర్ష్య ఆయనకున్నట్లు ఉంది. రాజకీయాల్లో పొడుగు పొట్టి అన్నది సమస్యకాదు. చేసే పనులు, చేపట్టిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వ కాలంలో చేపట్టిన పనులే పొడుగు, కెసిఆర్ నాయకత్వంలో ప్రజలకు సేవలందించిన విధానమే తమ పొడగరి తనం. అంతేగాని మనుష్యుల ఎత్తులపట్ల జలసీ ఉండకూడదన్న ఆయన ఘాటైనవ్యాఖ్యలకు కాంగ్రెస్ వర్గాలుకూడా అంతే తీవ్రంగానే ప్రతిస్పందిస్తున్నాయి.





