“ప్రజల 60 ఏండ్ల ఆకాంక్షను సాకారం చేసేందుకు తన ప్రాణం పెట్టి ఆమరణ దీక్షకు దిగిన ఆయన పోరాట పటిమ, ఉద్యమ గతిని మలుపు తిప్పిన దీక్ష దివస్ తెలంగాణ అజరామర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ మానవాళిపై అణచివేత అధికమై అన్యాయమే అధికారం యొక్క పరమావధి అయినప్పుడు ఆ దాస్య శృంఖలాల నుండి విముక్తి కలిగించడానికి ఆ పోరాటానికి దీక్ష దివస్ దిక్సూచిగా నిలుస్తుంది. భవిష్యత్ తరాలకు ఆ తిరుగుబాటు స్ఫూర్తి, వారసత్వ సంపద వంటిది. అట్లాంటి ఈ రోజును మననం చేసుకోవడం అవసరం. .”
‘తెలంగాణ’ ఉమ్మడి రాష్ట్రంలో హద్దు నుండి సరిహద్దు వరకు నిలువు దోపిడీ, అనునిత్యం అవమానం, అణచివేతకు గురికాబడిన ప్రాంతం, తన తనువంతా పౌరుషం కలిగి ఉన్న ప్రాంతం. అది నుండి అంతం వరకు 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో త్యాగాలు, పోరాటాలు, ఒడిదుడుకులను తట్టుకుని ఆంధ్రా పెత్తందారి పాలకులను ఎదిరించి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను తెగ నరికి అఖండ భారత దేశంలో తన ఉనికిని చాటుకున్నది మన తెలంగాణ తల్లి. తన తల్లికి విముక్తిని కల్పించే గొప్ప పోరులో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన బిడ్డలెందరో. తమ సర్వస్వాన్ని ఉద్యమానికి అంకితం చేసిన మహానుభావులెందరో. తెలంగాణ కోసం తమ శాసన సభ సభ్యత్వాలకు అనేక మార్లు రాజీనామా చేసిన తెలంగాణ వాదులు ఒకవైపు ఉండగా, మరోవైపు పదవులపై ఆశతో రాజీనామాల పర్వం నుండి పారిపోయి ఆంధ్ర పాలకుల చెంతన చేరిన తెలంగాణ ద్రోహులను కూడా చూసింది ఈ విముక్తి ఉద్యమం. చివరికి తెలంగాణ ఉద్యమాన్ని తమ రాజకీయ పార్టీల మనుగడకు, వ్యక్తిగత స్వార్థానికి వాడుకున్న వ్యక్తులను సైతం మోసింది మన ఉద్యమం. అట్లాంటి ఉద్యమాన్ని తన ఆమరణ దీక్షతో మలుపు తిప్పిన నాయకుడు కేసీఆర్… కనీసం తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఆఖరికి చప్రాసీ నౌకరీ కూడా మిగిలే పరిస్థితి లేదని నిర్ధారణకు వచ్చి రాష్ట్ర సాధన తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదని “సిద్ధిపేటను కార్యక్షేత్రంగా”ఎంచుకుని 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు.
ఇవాళ తెలంగాణ పాటపాడుతున్న అనేకమంది కాంగ్రెస్ నాయకులు నాటి ఆంధ్ర పెత్తందారులకు వత్తాసు పలుకుతూ దీక్షపై ఎత్తిపొడుపులు విసిరారు. అవహేళన చేశారు, నిందలు వేశారు. “నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ దీక్ష విషయంలో తల్లిగా చెబుతున్నా వద్దని వారించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఓపిక పట్టాలని సూచించిన అవేవీ పట్టించుకోకుండా దీక్ష ప్రారంభ గడువు వరకూ వేచి చూసి కార్యక్షేత్రంలోకి దిగారు కేసీఆర్… ఆ రోజు యావత్ తెలంగాణ మొత్తం, ఆఖరికి అధికార కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సైతం ఏం జరుగుతుందో అని ఊపిరి బిగబట్టి చూసెట్టు చేసిన రోజు నవంబర్ 29… ఆ రోజు తెలంగాణ ఉద్యమ గతిని లక్ష్యం వైపు నడిపించిన రోజు. ఆరిపోయిందన్న ఉద్యమ దీపాన్ని జ్వాలలా మార్చిన ఘట్టం దీక్ష దివస్. హే వీళ్లు గింతే అని మన ఉద్యమానికి తెడ్డు సూపుతున్న కేంద్రాన్ని తప్పక దిగివచ్చేలా చేసిన శక్తి కేసీఆర్.. దేశ రాజకీయాలను, ప్రజలను ఉత్కంఠగా తెలంగాణ వైపు తిప్పిన రోజు, కేసీఆర్ ప్రతి కదలికను అనునిత్యం దేగకళ్లతో గమనిస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆంధ్ర పాలకులు ఒకవైపైతే… అప్పటికే ముందు రోజు రాత్రే కరీంనగర్లోని తెలంగాణ భవన్ కు చేరుకున్న రక్షక బలగాల మోహరింపు మరోవైపు… కేసీఆర్ కు రక్షణ కవచంలా నలు దిశలా నుండి కదిలి వచ్చిన ప్రజలోవైపైతే… పిడికిలెత్తి కేసీఆర్ దీక్షకు మద్దతుగా నిలుస్తున్న యువత, విద్యార్థులు ఇంకోవైపు… ఉత్కంఠ పరిస్థితుల నడుమ బయటికి వచ్చిన కేసీఆర్ కు జనాలు జై తెలంగాణ నినాదాల హోరు నడుమ స్వాగతం పలకగా వారి ఉద్యమ స్ఫూర్తికి శిరస్సు వంచి ఉద్యమ వందనాలు తెలుపుతూ భావోద్వేగానికి లోనై “తెలంగాణ వచ్చుడో- కేసిఆర్ సచ్చుడో” అనే సింహనాదం ఇచ్చి విజయకేతాన్ని చూపిస్తూ దీక్షకై కదిలిన చారిత్రక క్షణాలు యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతాయి.
ఆ తరువాత హైడ్రామా నడుమ దీక్షకు అనుమతిస్తున్నట్లు నటించిన పోలీసులు ఉద్యమ శ్రేణితో సిద్దిపేట వైపు కదులుతున్న కేసీఆర్ ను అల్గునూర్ చౌరస్తా వద్ద అరెస్టు చేసి దీక్షను భగ్నం చేసేందుకు చేసిన ప్రయత్నాలు, ఆయన అరెస్టును అడ్డుకునేందుకు రహదారులను దిగ్బంధం చేసిన ప్రజలను తప్పించుకుని కేసీఆర్ ను ఖమ్మం జైలుకు తరలించడం. తరువాత జైలులోనే ఆయన దీక్షకు కూర్చోవడం, పాలక పక్షం ఆయన ఆరోగ్యం విషయంలో భయపడి నిమ్స్ హాస్పిటల్ కు తరలించి దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించగా కేసిఆర్ ప్రతిఘటించి తన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించడం యావత్ తెలంగాణ సకల జనులు స్వరాష్ట్ర ఏర్పాటు కాంక్షను ముక్త కంఠంతో దేశానికి నినదిస్తూ కేసీఆర్ ఆమరణ దీక్షకు అండగా నిలిచిన తీరు అద్వితీయం. “నా దీక్ష వల్ల తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర” కేంద్రానికి మొండిగా తెగేసి చెప్పిన కేసీఆర్ పోరాట పటిమకు తలొగ్గిన కేంద్రం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పి తెలంగాణ ప్రజలు సంబరపడే లోపే అడ్డుపడిన ఆంధ్ర పాలకుల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం మల్లోసారి తెలంగాణ ప్రజలను నయవంచన చేసింది. అదే విచారకరమైన వార్త అయినప్పటికీ ఆ రోజు కేసీఆర్ చేసిన నిరాహార దీక్షే మలిదశ ఉద్యమం ఉగ్ర రూపం దాల్చడానికి ప్రధాన కారణం. ఆ దీక్ష కల్పించిన ఆశల ప్రతిరూపమే నేటి మన తెలంగాణ రాష్ట్రం.
సూర్యకాంతిని ఆపలేరు కదా…! అట్లా చేయాలని ఎవడైనా తహతహలాడిన వాళ్ళది గొంతెమ్మ కోరికే అవుతుంది. ప్రజల 60 ఏండ్ల ఆకాంక్షను సాకారం చేసేందుకు తన ప్రాణం పెట్టి ఆమరణ దీక్షకు దిగిన ఆయన పోరాట పటిమ, ఉద్యమ గతిని మలుపు తిప్పిన దీక్ష దివస్ తెలంగాణ అజరామర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ మానవాళిపై అణచివేత అధికమై అన్యాయమే అధికారం యొక్క పరమావధి అయినప్పుడు ఆ దాస్య శృంఖలాల నుండి విముక్తి కలిగించడానికి ఆ పోరాటానికి దీక్ష దివస్ దిక్సూచిగా నిలుస్తుంది. భవిష్యత్ తరాలకు ఆ తిరుగుబాటు స్ఫూర్తి, వారసత్వ సంపద వంటిది. అట్లాంటి ఈ రోజును మననం చేసుకోవడం అవసరం. ఉద్యమ గతిని మలుపు తిప్పిన దీక్ష దివస్ ను – కేసీఆర్ ఆమరణ దీక్ష మహా ఘట్టాన్ని చరిత్ర పుటలకే పరిమితం చేయకుండా భవిష్యత్ తరాలకు ఈ నేల విముక్తి కోసం జరిగిన పోరాటాలు- త్యాగాలను తెలుసుకునేలా పాఠశాల దశలో పాఠ్యాంశంగా గ్రంథస్తం చేయాల్సిన అవసరం ఈ నేలపై ఆత్మగౌరవంతో పాలన చేసే ప్రభుత్వాలపై ఉంది.
(నవంబర్ 29న కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా…)
-పిన్నింటి విజయ్ కుమార్,
విద్యార్థి నాయకుడు- కాకతీయ విశ్వవిద్యాలయం,
9052039109.





