గన్నమరాజుకు అమృతోత్సవ అభినందన

“ఎంత సాహిత్య ప్రియుడో అంత దేశభక్తిని పునికిపుచ్చుకున్నారు గిరిజామనోహరబాబు. దీంతో 1975 ఎమర్జెన్సీకాలంలో సుమారు అయిదు నెలలపాటు ముషీరాబాద్‌ ‌జైలు జీవితాన్ని అనుభవించాల్సివచ్చింది. అప్పుడున్న నిర్భందం కారణంగా విద్య ముందుకు సాగలేదు. దానితో మొదటిసారిగా 1978లో ఖమ్మంజిల్లా సత్తుపల్లిలోని జలగం వెంగళరావు డిగ్రీ కళాశాలలో అధ్యాపక జీవితాన్ని ప్రారంభించారు. కొంత కాలం ఖమ్మం, ఆతర్వాత 1995లో ఓరుగల్లు నగరానికి చేరుకున్నారు. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ, పి.జీ కళాశాలలో అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌గా పనిచేసి 2009 ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు. అప్పటినుండీ ఆయన ఓరుగల్లు సాహితీలోకంతో మమేకమయ్యారు..”

గన్నమరాజు గిరిజామనోహర బాబు

 గన్నమరాజు గిరిజామనోహరబాబు సాహిత్యలోకానికి చిరపరిచితులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, కవిసమ్మేళనాలు, నాటకాలు జరిగినా అక్కడ ఆయనపేరు వినిపిస్తుంది. గ్రంథావిష్కరణలు, ఆధ్యాత్మిక చర్చాగోష్టుల్లో ఆయనదొక ప్రత్యేకస్థానం. సరిగ్గా పదిహేనేళ్ళక్రితం షష్టిపూర్తి జరుపుకున్న గిరిజామనోహరబాబుకు నేడు డెబైఅయిదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఓరుగల్లు సాహితీలోకం ఆయనకు అమితోత్సవం పేరున అభినందించనుంది. షష్టిపూర్తినాడు ఉభయ రాష్ట్రాల్లోని అనేక సాహిత్య, సాంస్కృతిక, రచయితల సంఘాలన్ని సంఘటితమై ఘనంగా వేడుకను నిర్వహించడంతోపాటు, ఇరు రాష్ట్రాలకు చెందిన సుమారు 70మంది పేరున్న కవులు, రచయితల రచనలతో ‘సత్కృతి’ పేర ఏడువందల పేజీల ప్రత్యేక సంచికను వెలువరించారు. ఇందులో ఉద్దండ పండితులనేకులు తమ అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు పదిహేనుఏళ్ళ తర్వాత వజ్రోత్సవ వేడుక సందర్భంగా ‘శరత్కౌముది’ (శీతాకాలపు వెన్నల వెలుగురేడు) పేరున సుమారు 25మంది విద్యవరేణ్యులు, కవిపండితుల వ్యాసాలతో మరో ప్రత్యేక సంచికను ఆవిష్కరించబోతున్నారు.

గిరి అంటే వాక్కునందు ‘జ’ పుట్టినది. అంటే వాక్కునుండి పుట్టే ఉత్తమోత్తమభావం. అదే ఈ లోకంలో కవిత్వం-సాహిత్యం. ఈ రెంటిని హరించినవాడు గిరిజామనోహరుడంటూ ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య చేసిన వ్యాఖ్యలు ఆయనకు సరిగ్గా అమరుతాయి. గిరిజామనోహర బాబుది విలక్షణ వ్యక్తిత్వం. ఎందరో విజ్ఞుల మదిలో ప్రత్యేకస్థానాన్ని పొందినవ్యక్తి. ఆయన చేతిరాత ఎంతచక్కగా ఉంటుందో, అంతటి వినయం ఆయన సొత్తు. సుప్రసిద్ధ రచయిత, మంచి వ్యాఖ్యాత. వివిధ భాషల్లో ప్రావీణ్యంగల వ్యక్తి. మంచి నటనాకౌశల్యం. అన్నిటికీ మించి మంచి చతురుడు. ‘బాబు’తో కూర్చుంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. మృదుమధుర భాషణ. ఆయన కంఠస్వరంనుండి వెలువడే పద్యం శ్రోతల హృదయాల్లోకి చొచ్చుకుపోతుంది. అర్థశతాబ్ధానికి పైగా సాహిత్యంలో జీవిస్తున్న ‘గన్నమరాజు’ తన జీవితాన్ని సఫలంచేసుకున్న ‘సహృదయుడు’. అందుకే ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా 28 సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థలు ఒకే వేదికపైకివచ్చి సన్మానించాయంటే అన్ని సంస్థలతో ఆయనకున్న అనుబంధమేమిటో తెలియజేస్తున్నది. ఈ సందర్భంగానే ఓరుగల్లు సాహితీలోకం ఆయనకు ‘సాహితీ విరంచి’ బిరుదునిచ్చి గౌరవించింది.

గిరిజామనోహరబాబు చిన్నప్పటినుండే సాహిత్యాభిలాషి. అందుకు ఆయన జన్మస్థాన ప్రభావంకూడా ఒక కారణం. ఆనాటి మహబూబ్‌నగర్‌ ‌జిల్లా,  ప్రస్తుత గద్వాలజిల్లాలో నెలకొన్న అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపురం జోగులాంభ అమ్మవారి ఆశీస్సులు ఆయనకు సంపూర్ణంగా లభించాయి. ఆయన్ను కన్నతల్లిదండ్రులు రామేశ్వర్‌రావు, శ్రీమతి శకుంతలగార్లు నిజంగా ధన్యజీవులు. ఆయనకున్న అపార జ్ఞాపకశక్తితో చిన్ననాటనే తండ్రిద్వారా సంస్కృత పద్యాలు, శ్లోకాలు అవుపోసనపట్టారు. దానికి తగినట్లుగా అలంపురం శ్రీబాల బ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో సంస్కృత పాఠశాల ఏర్పడడం ఆయన సాహిత్యాభిలాషకు మరింత దోహదపడింది. అధ్యాపకులు పతంగి వెంకటేశ్వర శాస్త్రి, నరసింహ ఘనాపాటి అవధాని, మామిడాల సీతారామశాస్త్రి నేతృత్వంలో అమరకోశం, శబ్ధమంజరి, అష్టధ్యాయి, కొంతవరకు వేదాధ్యయనం చేశారు. అనంతరం పాలెంలోని శ్రీవెంకటేశ్వర ప్రాచ్యకళాశాలలో ప్రిన్సిపల్‌ ‌తెలకపల్లి విశ్వనాథశర్మ, డాక్టర్‌ ‌పెరంబదూరు శ్రీరంగాచార్య, వింజమూరి శేషఫణిశర్మ, ములుకుంట్ల రామకృష్ణశాస్త్రిలాంటి మహామహుల శిక్షణలో పెరిగారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతున్న రోజుల్లో దివాకర్ల వెంకటావధాని, డాక్టర్‌ ‌పల్లా దుర్గయ్య, ఆచార్యులు పాకాల యశోధారెడ్డి, నాయిని కృష్ణకుమారి, బిరుదరాజు రామరాజు, సి. నారాయణరెడ్డి లాంటి తెలుగు సాహిత్యంలో మణిపూసల్లాంటి అధ్యాపకుల పర్యవేక్షణలో ఆయన తన విజ్ఞానాన్ని మెరుగులు దిద్దుకున్నారు. సహచర్లు, సీనియర్లుకూడా అయిన కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, జి. యాదగిరి, కె. రుక్నొద్దీన్‌లతోకలిసి తమ సాహిత్యార్జనకు మరింత పదును పెట్టారు. ఎంత సాహిత్య ప్రియుడో అంత దేశభక్తిని పునికిపుచ్చుకున్నారు గిరిజామనోహరబాబు. దీంతో 1975 ఎమర్జెన్సీకాలంలో సుమారు అయిదు నెలలపాటు ముషీరాబాద్‌ ‌జైలు జీవితాన్ని అనుభవించాల్సివచ్చింది. అప్పుడున్న నిర్భందం కారణంగా విద్య ముందుకు సాగలేదు. దానితో మొదటిసారిగా 1978లో ఖమ్మంజిల్లా సత్తుపల్లిలోని జలగం వెంగళరావు డిగ్రీ కళాశాలలో అధ్యాపక జీవితాన్ని ప్రారంభించారు. కొంత కాలం ఖమ్మం, ఆతర్వాత 1995లో ఓరుగల్లు నగరానికి చేరుకున్నారు. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ, పి.జీ కళాశాలలో అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌గా పనిచేసి 2009 ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు. అప్పటినుండీ ఆయన ఓరుగల్లు సాహితీలోకంతో మమేకమయ్యారు.

సత్తుపల్లిలో ఆయన శిష్యుడు, రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన దివంగత రాళ్ళబండి కవితాప్రసాద్‌, ‌మరికొందరు ఓరుగల్లు సాహితీ మూర్తులతోకలిసి వరంగల్‌లో ‘సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ’ను ఏర్పాటుచేశారు. ఆ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శిగా, ఉపా ధ్యక్షుడిగా 24ఏళ్ళుగా కొనసాగుతున్నారు. ఈ సంస్థపక్షాన చేపట్టిన కార్యక్రమాలు ‘నభూతో నభవిష్యత్‌’ ‌తరహాలో పలువురి మన్నలను పొందాయి.    ‘మహాభారత దర్శనం’ పేరిట 18 పర్వాలు, ఒక్కో పర్వానికి ఒక్కో పండితుడి చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరున్న పండితులను ఆహ్వానించి వారితో ప్రసంగాలు చేయించారు. అలాగే ‘భాగవత సుధా స్రవంతి’ ద్వాదశ స్కందాలు, కవి సామ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షంపై ‘రామకథా పరిమళం’పేర పదిరోజుల ప్రసంగాలు. ఉపనిషచ్చంద్రిక దశోపనిషత్తులు, భగవద్గీతలోని 18 అధ్యాయాలను పద్దెనిమిది మంది విద్వంసులతో ‘గీతామృతం’పేరున, పదిరోజులపాటు పదిమందితో ‘వేదసూక్త కౌముది’, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్‌రావుతో ‘రామాయణం-మానవధర్మం’ ప్రవచనాలను చెప్పించారు. అంతేకాదు సహృదయ పక్షాన అనేక గ్రంథావిష్కరణలు, సాహిత్య సభలు, కవి సమ్మేళనాలు, చర్చాగోష్టులను నిర్వహించడంతోపాటు వార్షికోత్సవాల సందర్బంగా ఎంపికైన ఉత్తమ నవల, కథ, వచన కవిత, పద్య కవిత, సాహిత్య విమర్శ అంశాలకు సంబందించి ప్రోత్సాహాకాలనుకూడా అందజేస్తున్నారు. వాటితోపాటు ఉత్తమ నాటకాలను ఎంపికచేసి, ప్రదర్శింపజేయడంతోపాటు బహుమతులనందజేస్తున్నారు.
గిరిజామనోహరబాబు సంపాదకత్వంలో రసహృదయ, కథకు శతమానం, శతక సాహిత్యం-సామాజిక నైతిక విలువలు, యువజన విజ్ఞానం(2వ ముద్రణ, సురవరం ప్రతాపరెడ్డి), శతపత్రము (2వ ముద్రణ, గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ- కేంద్ర సాహిత్య పురస్కారం పొందిన రచన), తెలుగు కథ-వెలుగులు, ఓరుగల్లు కళావైభవరం, ‘అశీతి’(ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య 80ఏళ్ళ సందర్భంగా), ‘భారతీయ చింతన’ (డాక్టర్‌ ‌దహగాం సాంబమూర్తిగారి 80 సంవత్సరాల సందర్భంగా), వేణుముద్దుల నరసింహారెడ్డిగారి పరిశోధనా వ్యాసం ‘పాలకుర్తి సోమనాథుల కృతులు- ఒక పరిశీలన’ కరీంనగర్‌ ‌సర్వవైదిక సంస్తాన రజితోత్సవ సంచిక ‘విశ్వారణి’ లాంటి గ్రంథాలద్వారా ప్రాచీన సాహిత్యాన్ని నేటి తరానికి అందించే ప్రయత్నంచేశారు.
  ‌గిరిజామనోహరబాబు స్వయంగా సాహితీసుధ(వ్యాస సంకలనం), చయనిక, ఆకాశవాణిలో 20శతకాల పరిచయ ప్రసంగాలతో ‘శతక సమీరం’, తెలుగు శతక సాహిత్యం(4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువరించిన రచన), వెలుగుదారి, పురస్కృతం(సమీక్షా వ్యాసాలు) ,  రామామృతం,అవలోకనం, దీధతి, భారత దీపిక, పేటిక మొదలైనవున్నాయి. అలాగే ఆయన అనేక పుస్తకాలకు పీఠికలు వ్రాశారు. వాటిని క్రోడీకరించి ‘గన్నమరాజు పీఠికలు’పేర గ్రంథస్తం చేశారు. వివిధ పుస్తకాలకు వ్రాసిన ముందుమాటలను ‘అక్షరధుని’గా అచ్చువేశారు.
వీటితోపాటు వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలుకూడా అనేకమున్నాయి. ఆంధ్రజ్యోతిలో ‘పరంజ్యోతి’ శీర్షికన, నమస్తే తెలంగాణలో భగవద్గీపైన ‘నమస్తే నమ:’, విజయక్రాంతి దినపత్రికలో 50 వారాలపాటు ‘మన మాణిక్యాలు’ శీర్షికన వ్యాసాలు రాశారు. అలాగే దూరదర్శన్‌, ‌భక్తి చానళ్ళలో 14 సంవత్సరాలపాటు తిరుపతి ఉత్సవాలపై వ్యాఖ్యానంచేశారు. సివిఆర్‌ ‌ఛానల్లో ‘పద్య సౌరభం’ పేర పద్యాలను పరిచయం చేశారు. కర్నూలు తుంగభద్ర పుష్కరాల సందర్భంగా, 2015లో ధర్మపురిలో నాటి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రారంభించిన గోదావరి పుష్కరాల సందర్భంలోకూడా వ్యాఖ్యానం చేశారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో 60కిపైగా సాహిత్యరూపకాల ప్రదర్శనల్లో పోతన, అల్లసాని పెద్దన్న, తెనాలి రామకృష్ణుడు, భావకవి, దాశరథి, ఒద్దిరాజు సీతారామ చంద్రరావు తదితర పాత్రలను అలవోకగా పోషించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు ఎనిమిది వందలకు పైగా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక  ప్రసంగాలు చేశారు. వివిధ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో 80కి పైగా వివిధ అంశాలపైన పరిశోధనా పత్రాలను సమర్పించారు.
ఇం‌తటి రసహృదయుడికి సత్కారాలకేమీ తక్కువలేదు. తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తి పురస్కారాన్నిచ్చి’ సత్కరించింది. శాతవాహన విశ్వవిద్యాలయం పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే బాలగంగాధర్‌ ‌తిలక్‌, ‌కాళోజీ, గిడుగు, దేవులపల్లి రామానుజారావు స్మారక పురస్కారాలు లభించాయి. జాతీయ సారస్వత పరిషత్‌, ‌సి.పి.బ్రౌన్‌ ‌సాహిత్య పురస్కారాలు, శాంతిధూత, స్వరరవళి, కళావాహిని, స్వరసుధ సత్కారాలు, తెలుగు భాష దినోత్సవం, తణుకు సంకీర్తనవారి ‘జీవన సాఫల్య’పురస్కారాలనేకం ఆయన్ను వరించాయి. అందరి తలలో నాలికలాఉన్న గిరిజామనోహరబాబును కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్దేశ్వరానంద భారతిస్వామి ‘విద్వత్కవి-ధార్మిక సంప్రదాయ మార్గిగా ప్రశంసించారు. నల్లాన్‌ ‌చక్రవర్తుల రఘునాథాచార్యులు ‘విద్వత్ప్రసంగి’అని, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ‘ప్రాచీన-ఆధునిక సాహిత్య విమర్షకుల్లో అనితరుడు’ అన్నారు. మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు ‘ఓరుగల్లు ప్రసక్తి అంటేనే గిరిజామనోహరుల ప్రశస్తే’అని కొనియాడారు. డాక్టర్‌ అం‌పశయ్య నవీన్‌ ‘అక్షర చైతన్య ప్రసారకుడు’ అన్నారు. ఇలా అనేకమందితో పరిపదివిధాలుగా ప్రస్తుతింపబడుతున్న  గిరిజామనోహరబాబును నేడు ఓరుగల్లు  సాహితీలోకం  మరోసారి ఘనంగా సత్కరించుకుంటున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *