తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన దీక్షా దివస్‌

“ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఉద్యమ కేంద్రాలయ్యాయి. విద్యార్థులతో పాటు మహిళలు, కార్మికులు, రైతులు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు నిరసనల్లోకి వచ్చాయి. కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానకు తరలించారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన దీక్ష కొనసాగించారు. ‘సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదం ప్రజల్లో మార్మోగింది. ఒకవైపు దీక్షపై ఆందోళన, మరోవైపు రోజురోజుకూ విస్తరించిన నిరసనలు కేంద్రంపై ఒత్తిడిని పెంచాయి. డిసెంబర్‌ 9న రాత్రి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు..”

ఒక దీక్షకు బలమిచ్చిన ప్రజా పోరాటం

-దేవీప్రసాద్‌ | బేవరేజ్‌ కార్పొరేషన్‌ పూర్వ చైర్మన్‌

తెలంగాణ చరిత్రలో నవంబర్‌ 29 ప్రజల ఆకాంక్షకు, ఆత్మగౌరవానికి, పోరాట పటిమకు ప్రతీకగా నిలిచిపోయింది. 2009లో ఆ రోజున ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష దశాబ్దాల ఉద్యమాన్ని నిర్ణయాత్మక దశకు చేర్చింది. ఒక నాయకుడి సంకల్పానికి ఉద్యోగుల పెన్‌డౌన్‌, విద్యార్థుల నిరసనలు, ప్రజా సంఘాల కార్యాచరణ తోడయ్యాయి. తెలంగాణ అంతటా ప్రజలు ఉద్యమంలోకి రావడంతో రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షకు కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. ఆ మలుపును అర్థం చేసుకోవాలంటే దీక్షకు ముందున్న పోరాటాలనూ, ఆ తర్వాత ప్రజలు కొనసాగించిన ఉద్యమాన్నీ గుర్తుచేసుకోవాలి.

దశాబ్దాలుగా రగిలిన ఆకాంక్ష
1952 ముల్కీ ఉద్యమం నుంచి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు స్థానికుల హక్కుల కోసం సాగిన పోరాటాలు మన చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. ఆ ఉద్యమం తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితికి లభించిన మద్దతు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటింది. అప్పటి కాంగ్రెస్‌ పాలకులు ఆ ఆకాంక్షను గౌరవించలేదు. ఒప్పందాలు, హామీలు ఆచరణలో స్థానికులకు న్యాయం చేయలేకపోయాయి. విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులపై నిర్బంధం సాగినా కవులు, కళాకారులు, రచయితలు తెలంగాణ గొంతును సజీవంగా ఉంచారు. బెల్లి లలిత హత్య, గద్దర్‌పై కాల్పులు ఆ కాలంలో ప్రజా గొంతులు ఎదుర్కొన్న నిర్బంధాన్ని గుర్తుచేస్తాయి.

ఉద్యోగుల పోరాటం ఫలితంగా 1985లో వెలువడిన 610 జీవో అమలులో తీవ్ర ఆలస్యం జరిగింది. స్థానిక నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలన్న డిమాండ్‌ కొనసాగింది. సొంత గడ్డపైనే తమ హక్కుల కోసం పదేపదే పోరాడాల్సి రావడం తెలంగాణ ప్రజల్లో ఆవేదనను పెంచింది. ఈ నేపథ్యంలో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కొత్త రాజకీయ దిశనిచ్చింది. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అంతకుముందు నుంచీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రత్యేక రాష్ట్ర సాధన కార్యాచరణలో స్థానం లభించింది.

ఫ్రీజోన్‌ వివాదం నుంచి సిద్దిపేట సభ వరకు
2009లో హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు స్థానిక ఉద్యోగ హక్కులపై ఆందోళనను పెంచింది. అక్టోబర్‌ 10న సమావేశమైన టీఎన్‌జీవో రాష్ట్ర కమిటీ అక్టోబర్‌ 12న ‘చలో అసెంబ్లీ’ చేపట్టాలని నిర్ణయించింది. స్వామిగౌడ్‌, దేవీప్రసాద్‌ నేతృత్వంలో ఉద్యోగులను సమీకరించాం. విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌ నాయకత్వంలోని ఉద్యోగ సంఘాలు, ఇతర తెలంగాణవాద సంఘాలు పోరాటంలో భాగస్వాములయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలూ కలిసి రావాలని, అవసరమైతే రాజ్యాంగ సవరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరాం. 1972 ముల్కీ తీర్పు అనంతరం నాటి రాజకీయ నాయకత్వం చూపిన చొరవను గుర్తుచేశాం. మేం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. టీఆర్‌ఎస్‌ మా పోరాటానికి స్పష్టమైన మద్దతు ప్రకటించింది.

కేసీఆర్‌ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించారు. తెలంగాణ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలను ఐక్యపోరాటానికి సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఉద్యోగ సంఘాల తరఫున మేము ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజా సంఘాలను సమీకరించాం. ఈ క్రమంలో నవంబర్‌ 21న సిద్దిపేటలో జరిగిన భారీ ఉద్యోగుల సభలో స్వామి అగ్నివేష్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ పాల్గొన్నారు. ఫ్రీజోన్‌ సమస్యపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశాం. అవసరమైతే పెన్‌డౌన్‌ చేపడతామని కేసీఆర్‌ ప్రకటించారు. ప్రభుత్వంలో చలనం కనిపించకపోవడంతో ఉద్యమ సంఘాలతో సంప్రదించి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.

అరెస్టుతో అట్టుడికిన తెలంగాణ
నవంబర్‌ 29న కరీంనగర్‌ సమీపంలోని తీగలగుట్టపల్లి నుంచి దీక్షా స్థలికి బయలుదేరిన కేసీఆర్‌ను, ఆయన వెంట ఉన్న నాయకులను అలుగునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. కేసీఆర్‌ను ఖమ్మం జైలుకు తరలించారు. అరెస్టుకు నిరసనగా ఖమ్మంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఆందోళనలకు దిగారు. తెలంగాణ ఉద్యోగులు పెన్‌డౌన్‌ చేపట్టడంతో ప్రభుత్వ కార్యాలయాలు స్తంభించాయి. దీక్ష విరమించారన్న ప్రచారం గందరగోళం సృష్టించింది. దీక్ష కొనసాగుతోందని ప్రొఫెసర్‌ జయశంకర్‌, నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్‌ తదితరులు ప్రజలకు తెలియజేశారు.

ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఉద్యమ కేంద్రాలయ్యాయి. విద్యార్థులతో పాటు మహిళలు, కార్మికులు, రైతులు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు నిరసనల్లోకి వచ్చాయి. కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానకు తరలించారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన దీక్ష కొనసాగించారు. ‘సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదం ప్రజల్లో మార్మోగింది. ఒకవైపు దీక్షపై ఆందోళన, మరోవైపు రోజురోజుకూ విస్తరించిన నిరసనలు కేంద్రంపై ఒత్తిడిని పెంచాయి. డిసెంబర్‌ 9న రాత్రి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

డిసెంబర్‌ 9 నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు
డిసెంబర్‌ 9 ప్రకటనతో ప్రత్యేక రాష్ట్ర సాధనకు అధికారికంగా మార్గం తెరుచుకుంది. ఆ తర్వాత సమైక్యవాద శక్తుల ప్రతిఘటన, రాజకీయ ఒత్తిళ్లు, కేంద్రం వెనుకడుగు ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేశాయి. కేసీఆర్‌, జయశంకర్‌ వివిధ రాజకీయ పార్టీలను కలిసి మద్దతు కూడగట్టారు. ఉద్యోగుల సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, సాగరహారం వంటి కార్యక్రమాలతో తెలంగాణ సమాజం తన నిర్ణయాన్ని మళ్లీ చాటింది. విద్యార్థులు పోరాటాన్ని కొనసాగించారు. ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రజా ఉద్యమం సృష్టించిన ఒత్తిడి ఫలితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్లమెంటులో రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టింది. బీజేపీ మద్దతు ఇచ్చింది. 2014 జూన్‌ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.

దీక్ష ఉద్యమానికి రాజకీయంగా కీలక మలుపు ఇచ్చింది. ఆ దీక్షకు ప్రజల భాగస్వామ్యం బలమిచ్చింది. ఉద్యోగులు కార్యాలయాలను వదిలి, విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటకు వచ్చి పోరాటంలో నిలబడ్డారు. ఉపాధ్యాయులు, మహిళలు, కార్మికులు, రైతులు ఉద్యమాన్ని విస్తరించారు. కవులు, కళాకారులు పాటలతో తెలంగాణ ఆకాంక్షను ఊరూరా చేర్చారు. చలో అసెంబ్లీ నుంచి సిద్దిపేట సభ వరకు, పెన్‌డౌన్‌ నుంచి సకల జనుల సమ్మె వరకు ఉద్యోగ సంఘాలు పోషించిన పాత్రను ఈ చరిత్రలో నమోదు చేయాలి. అమరుల కుటుంబాలు భరించిన నష్టాన్ని స్మరించుకోవాలి.

రాష్ట్ర సాధనతో బాధ్యత ముగియలేదు
నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం పాలనలో ప్రాధాన్యం పొందాలని ఆశించారు. కేసీఆర్‌ నాయకత్వంలో పదేళ్ల పాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యమ ఆకాంక్షల సాధనలో ఇంకా చేయాల్సిన పని ఉంది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో చూపుతున్న జాప్యం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులపై అనిశ్చితి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి.

కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, వినియోగంలో తెలంగాణ హక్కులను ప్రభుత్వం కాపాడాలి. పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ వంటి ప్రతిపాదనల నేపథ్యంలో రాష్ట్రానికి ఉన్న కేటాయింపులు, భవిష్యత్తు అవసరాలు, హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలి. రాజకీయ సంబంధాలు తెలంగాణ జల ప్రయోజనాలకు అడ్డురాకూడదు. కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిన ప్రజా పోరాటాలనూ, అమరవీరుల త్యాగాలనూ గౌరవించాలి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసే వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను బాధిస్తాయి. పాలకులను ప్రశ్నించడం, హక్కుల కోసం నిలబడటం ఉద్యమం మనకు నేర్పిన ప్రజాస్వామిక బాధ్యత.

ఉద్యమ చరిత్ర నేటి తరానికి చేరాలి
మలిదశ ఉద్యమంలో విద్యార్థులుగా పాల్గొన్నవారు నేడు సమాజంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి అనుభవాలు, ఉద్యోగ సంఘాల కార్యాచరణ, ప్రజా సంఘాల పోరాటాలు నేటి యువతకు తెలియాలి. ఎవరు అండగా నిలిచారు, ఎవరు అడ్డుపడ్డారు, రాజకీయ పార్టీలు ఏ దశలో ఎలాంటి వైఖరి తీసుకున్నాయి అన్నది ఆధారాలతో నమోదు చేయాలి. ప్రతి వర్గం పాత్రకు చోటిచ్చినప్పుడే తెలంగాణ ఉద్యమ చరిత్ర సమగ్రంగా నిలుస్తుంది. నవంబర్‌ 29న ఆ చరిత్రను స్మరించుకుంటూ ఉద్యమ ఆకాంక్షలను నేటి పాలనకు కొలమానంగా పెట్టాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, ప్రజల హక్కులను పరిరక్షించడం, అమరుల ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడం దీక్షా దివస్‌ స్ఫూర్తి.

జై తెలంగాణ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *