దేశ ఆర్థిక పురోగతిలో యువత భాగస్వాములు కావాలి

స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ -జై కిసాన్ నినాదానికి అటల్ బిహారీ వాజ్ పేయి జై విజ్ఞాన్ నినాదాన్ని జోడించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై అనుసంధాన్ నినాదాన్ని జోడించారని, ఇవన్నీ కూడా భారత యువశక్తికి ప్రతీకలుగా భావించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) అన్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియాలోని స్కూల్ అఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ లో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచంలో రోజు రోజుకు పెరిగిపోతున్న సాంకేతికను, కొత్త కొత్త నైపుణ్యాలను యువత అందిపుచ్చుకోవాలన్నారు.

స్కిల్- రి స్కిల్ -అప్ స్కిల్ పద్ధతిలో యువత ముందుకెళ్లాలని, ప్రపంచానికే సవాల్ గా మారుతున్న ఆర్టిఫిసియల్ ఇంటిలిజన్స్ , డేటా సైన్సెస్, మిషన్ లర్నిoగ్ లో నైపుణ్యాన్ని పెంచుకున్నపుడు యువత రాణించడానికి అవకాశం ఉంటుందన్నారు. డ్రీమ్ బిగ్ అచీవ్ మెంట్స్ బిగ్ పద్దతిలో నూతన ఆవిష్కరణలను యువత స్వాగతించాలన్నారు. నెల్సన్ మండేలా, స్వామి వివేకానంద, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి లాంటి ఎంతో మంది మేధావులు యువతకు అద్భుతమైన సందేశాలిచ్చారని, యువతలో దాగివున్న అపారమైన శక్తి వినియోగంలోకి వొచ్చినపుడు భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారుతాయన్నారు.మనదేశం అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందన్నారు. యువత తాము కష్టపడి చదువుకున్న చదువులను దేశ ప్రయోజనాలకు వినియోగించాలన్నారు.

ఈ సందర్బంగా వివిధ బ్యాచులకు చెందిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, ప్రశంసా పత్రాలను గవర్నర్ ప్రధానం చేశారు. అంతకుముందు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న విద్యార్థులచే ఈ దేశ ప్రగతికి తమ విద్యను అంకితం చేస్తున్నట్లు గవర్నర్ ప్రమాణం చేయించారు.

కార్యక్రమంలో మరొక అతిథిగా పాల్గొన్న ఇన్‌స్టిట్యూషన్ అఫ్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ వి.బి సింగ్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యలోని ప్రధానమైన 15 విభాగాల్లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ , ఏరో స్పెస్, మెటలర్జి , మైనింగ్, మెరైన్ తదితరవాటిలో ఇంకా ఎంతో సాధించాల్సి ఉందనే ఆశయంతో 1920 లోనే కలకత్తాలో ఒక సంస్థను ఏర్పాటుచేయడమైందని, ప్రస్తుతం దేశంలోని 125 నగరాల్లో ఇన్‌స్టిట్యూషన్ అఫ్ ఇంజనీర్స్ శాఖలున్నాయన్నారు. 2 లక్షల 60 వేల మంది ఇంజనీర్లు ఇందులో సభ్యులుగా వున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఈ సంస్థ భాగస్వామ్యం ఉందన్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు మాట్లాడుతూ ఈ కాలేజీలోని 12 విభాగాల్లో ఒక ఏడాది కాలంలో కనీసం ఏడు వేల మంది ఇంజనీర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు.

1981లో నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ ఆర్. వెంకట్రామన్ ప్రారంభించిన ఈ కాలేజ్ ఆసియా ఖండంలోనే ఇంకా ఎక్కడ లేదన్నారు. స్కూల్ అఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ స్కూల్ 2008లో ప్రారంభించగా, గత 16 ఏళ్ళల్లో వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ప్రయోజకులయ్యారన్నారు. కాగా స్నాతకోత్సవంలో 144 మంది విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేస్తున్నామన్నారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన కింద శిక్షణ పొందిన విద్యార్థులకు, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లో శిక్షణ పొందిన వారికి కూడా గవర్నర్ ప్రశంసా పత్రాలను అవార్డులను అందించి అందరితోను గ్రూప్
ఫోటోలు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page