ఎన్‌లినో రైతులపాలిట శాపమైంది..!

“సాగు అయిన ప్రాంతాల్లోకూడా అశించినమేర దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. వరి సాగురైతులు పంట చేతికొచ్చేసమయంలో చివరి తడిపెట్టేందుకు నానాకష్టాలు పడాల్సివచ్చింది. కొందరు ఆశలు వదిలేసుకుంటే, మరికొందరు నీళ్ళ ట్యాంకులతో పొలాన్ని తడుపుకునే పరిస్తితి ఏర్పడింది. పంట ధర సంగతి ఎలాఉన్నా ట్రాక్టర్లతో నీళ్ళు తెచ్చుకునేందుకు ఖర్చు తడిపి మోపడవుతున్నదని వారు ఆవేదన చెందుతున్నారు..”    
వచ్చిన కరువో.. తెచ్చిన కరువో ఏదైనా 
(మండువ రవీందర్‌రావు)

రాష్ట్రంలో ప్రస్తుత కరువు  పరిస్థితులకు ప్రకృతిపరమైన కారణాలు కనిపిస్తున్నప్పటికీ, ఇది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తెచ్చిన కరువుగా విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు ఎల్‌నినో ప్రభావాన్ని ప్రధాన కారణంగా చెబుతున్నా, అంతకు మించిన రాజకీయ ప్రభావం ఇక్కడ కనిపిస్తున్నది. ఎల్‌నినోవల్ల రుతుపవనాలు బలహీనపడి, ఉభయ తెలుగురాష్ట్రాల్లో వర్షపాతం గణనీయంగా పడిపోయింది. తెలంగాణరాష్ట్రంలో దాదాపు 17శాతం వర్షపాతలోటు ఏర్పడింది. ఫలితంగా తెలంగాణప్రభుత్వం సుమారు 320 మండలాలను కరువు  పీడిత ప్రాంతాలుగా గుర్తించింది. చాలా మండలాల్లో భూగర్భ జలమట్టం 7.62 మీటర్ల వరకు పడిపోయింది. గత ఏడాదితోపోలిస్తే ఈసారి 3.11 మీటర్లు మరింతగా తగ్గింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ బోరుబావుల్లో నీటి లభ్యత కరువైంది. ఆవిధంగా సుమారు 30 లక్షల వ్యవసాయ బోరుబావుల్లో నీరు తగ్గిందన్నది ఒక అంచన. ఫలితంగా ప్రసుత్తం ఖరీఫ్‌లో సాగువిస్తీర్ణం దాదాపు 25 నుంచి 30 శాతం వరకు తగ్గిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

సాగు అయిన ప్రాంతాల్లోకూడా అశించినమేర దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. వరి సాగురైతులు పంట చేతికొచ్చేసమయంలో చివరి తడిపెట్టేందుకు నానాకష్టాలు పడాల్సివచ్చింది. కొందరు ఆశలు వదిలేసుకుంటే, మరికొందరు నీళ్ళ ట్యాంకులతో పొలాన్ని తడుపుకునే పరిస్తితి ఏర్పడింది. పంట ధర సంగతి ఎలాఉన్నా ట్రాక్టర్లతో నీళ్ళు తెచ్చుకునేందుకు ఖర్చు తడిపి మోపడవుతున్నదని వారు ఆవేదన చెందుతున్నారు. కాగా, ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం ఈ ఒక్క సీజన్‌లోనే రాష్ట్రంలో ఇరవై కోట్ల మేర పంటనష్టం సంభవించిందని  తెలుస్తున్నది. దీని ప్రభావం ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తిపై పడటమేగాక, ధరలు ఆకాశాన్నంటే పరిస్థితులు ఎదురైనాయి. ఇదిలాఉంటే గోరుచుట్టుపై రోకలిపోటులాగా ఎట్టి పరిస్థితిలోనూ వరిపంటను రానున్న యాసంగి(రబీ)లో వేయవద్దని రాష్ట్రప్రభుత్వం ప్రకటించడంతో రైతులు కుదేలవుతున్నారు. ఎల్‌నినో ప్రభావ కారణంగా రానున్న రోజుల్లో తీవ్రమైన నీటిఎద్దడి ఏర్పడే అవకాశాలున్నందున వరిపంటను వేసుకోవద్దని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల పలుసందర్భాల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
దేవుడు దిగివచ్చినా వరిపంటకు నీటిని అందించలేడని ఘంటాపథంగా వారు చెబుతున్నారు. అందుకు ప్రత్యమ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలంటున్నారు. వారు సూచిస్తున్నారు. శెనగ, పెసర, మినుములు, పొద్దు తిరుగుడుపువ్వు, కుసుమలు వంటి తక్కువ నీటితో పండించే పంటలపైనే రైతులు అయితే దశాబ్ధాలుగా వరిపంటేతప్ప మరోపంట తెలియని రైతులు ఇప్పుడు ఆయోమయంలో పడ్డారు. వరి వేసుకునే పొలాలను ఆరుతడి పంటలకు సిద్దం చేసుకునేందుకు కొంత సమయం పడుతుందంటున్నారు. దానివల్ల ఒక సీజన్‌ ‌దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు. అంతేగాక ఆరుతడిపంటలకు సంబంధించిన  విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధర, మార్కటింగ్‌ ‌తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్నారు. ముందుగా కరెంటు పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
El Niño: A Growing Curse for Farmers!
బయటిమార్కెట్‌లో 15 రూపాయలు పెట్టినా కరెంటు దొరకటంలేదని రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల స్పష్టంచేయడంతో ఆరుతడి పంటలకైనా విద్యుత్‌ అం‌దుతుందన్న నమ్మకం కలుగటం లేదంటున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు కరెంటు సరఫరాలేదని ఇప్పటికే పలు గ్రామాల రైతులు రొడ్డుఎక్కి ఆందోళనలు చేస్తున్నారు. వీటన్నిటికీ ప్రభుత్వం ముందుచూపు లేకపోవడమేనంటున్నాయి ప్రతిపక్షాలు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తెచ్చిన కరువంటూ తీవ్రంగా విమర్షిస్తున్నాయి బిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు. దీన్ని మానవ నిర్మిత కరువుగా ఆ పార్టీలు అభివర్ణిస్తున్నాయి. ఎన్‌లినో ప్రమాదఘంటికలు  ఎంతోకాలంగా వినిపిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం వహించడాన్ని ఆ పార్టీలు తీవ్రంగా దుయ్యబడుతున్నాయి.
ప్రాజెక్టుల్లో నీరున్నా సకాలంలో సరైన ప్రణాళికలను రూపొందించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆ పక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగునీటితోపాటు తాగునీటికి కూడా కరువు  పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నాయి. చేతులు కాలినతర్వాత ఆకులు పట్టుకున్నట్లు స్పందించాల్సిన సమయమంతా వృధాచేసి ఇప్పుడు ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తున్నదని, ఇప్పుడు రైతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌జాజు సచివాలయంనుండి వీడియో కాన్ఫరెన్స్‌లు ఎన్నిపెట్టినా పోయిన సమయం తిరిగి రాదంటూ విపక్షాలు ప్రభుత్వ పనితీరుపై విరుచుకు పడుతున్నాయి. పక్కనే ఉన్న కృష్ణ,గోదావరి నదుల్లో నీరున్నా 24 గంటలు మోటర్లను నడిపించాల్సి ఉండగా కేవలం ఎనిమిది గంటలు మాత్రమే నడిపించడం ద్వారా ప్రభుత్వం కావాల్సిన నీటిని తరలించుకోలేకపోయిందన్నది బిఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌రావు ఆరోపిస్తున్నారు.
కాని 700 కిలోమీటర్ల దూరంలోఉన్న కుప్పంకు చంద్రబాబు నీళ్ళు తరలించుకుపోతున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని, అలాగే ముందు చూపుగా బొగ్గు నిల్వలు పెట్టుకోకపోవడంతో ఇప్పుడు విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందంటూ ఘాటైన విమర్శ చేస్తున్నారు. ఇదిలాఉంటే మొదటినుండీ ప్రత్యమ్నాయ పంటల విషయంలో ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికతో లేకపోవడం, నీటి కరువు ఏర్పడడంతో పంటమార్పిడి ఒత్తిడి చేయడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఈ పరిస్థితిలో నిస్సహాయంగా నిటూర్చడంకన్నా ఏమీ చేయలేని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *