
ప్రిన్సిపల్ ,
న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ,
వై ఎం సి ఏ , సికింద్రాబాద్.
అరచేతిలో ప్రపంచం.. అడుగడుగునా సాంకేతికత.. నిమిషాల్లో సమాచార మార్పిడి.. క్షణాల్లో పనుల పూర్తి! ఇదీ నేటి డిజిటల్ యుగం తీరు. ఒకప్పుడు విలాస వస్తువులుగా ఉన్న సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు నేడు ప్రతి ఇంటి అవసరాలుగా మారాయి. సాంకేతికత పెరిగింది.. సౌకర్యాలు పెరిగాయి.. జీవితం వేగం పుంజుకుంది. కానీ, ఈ అభివృద్ధి వెనుక మరో ముప్పు నిశ్శబ్దంగా పొంచి ఉంది. అదే ఈ-వ్యర్థాల సమస్య! సాంకేతిక పరికరాలను తరచూ మార్చుకోవాలనే ఆసక్తి, కొత్త మోడళ్లపై మోజు, మరమ్మతులు చేయించుకోవడం కంటే కొత్త పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ-వ్యర్థాలు పెరగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. దీనికి తోడు పాత ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలా సేకరించాలి? ఎక్కడ అప్పగించాలి? అనే విషయాలపై ప్రజల్లో తగిన అవగాహన లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.
ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్ల టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని సక్రమంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయకపోతే పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాల్లో సీసం, పాదరసం, కాడ్మియం వంటి హానికర పదార్థాలు ఉంటాయి. వీటిని సాధారణ చెత్తతో కలిపి పారేయడం, బహిరంగంగా కాల్చడం వల్ల నేల, నీరు, గాలి కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఈ కాలుష్యం మానవ ఆరోగ్యంపై, ముఖ్యంగా నాడీ వ్యవస్థ, మూత్రపిండాలు, శ్వాసకోశంపై ప్రతికూల ప్రభావాలు చూపవచ్చు. అందుకే ఈ-వ్యర్థాల నిర్వహణ కేవలం పర్యావరణ సమస్యే కాదు.. ప్రజారోగ్యానికి సంబంధించిన కీలక అంశం కూడా.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) గణాంకాల ప్రకారం, భారతదేశంలో ఈ-వ్యర్థాల ఉత్పత్తి 2023–24లో సుమారు 12.54 లక్షల టన్నులుగా ఉండగా, 2024–25లో సుమారు 13.98 లక్షల టన్నులకు పెరిగింది. అంటే, ఏడాదిలోనే వ్యర్థాల పరిమాణం గణనీయంగా పెరిగింది.అదే సమయంలో సేకరణ, రీసైక్లింగ్ తదితర నిర్వహణకు సంబంధించిన నివేదిత శాతం 61.94 నుంచి 70.71 శాతానికి పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది కొంత సానుకూల పరిణామమే అయినప్పటికీ, మిగిలిన వ్యర్థాలను కూడా సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ-వ్యర్థాల నిర్వహణలో తెలంగాణ కూడా ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో నమోదైన ఈ-వ్యర్థాల రీసైక్లర్ల సంఖ్య 2023–24లో 14 ఉండగా, 2024–25లో 19కి పెరిగింది. హైదరాబాద్లో ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ సాంకేతికతల అభివృద్ధికి ప్రత్యేక Centre of Excellence ఏర్పాటు చేయడం ఈ రంగానికి పెరుగుతున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. అయితే, రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రతి ఇంటి నుంచి వ్యర్థాలు అధికారిక సేకరణ వ్యవస్థకు చేరేలా చర్యలు తీసుకోవాలి.
ఈ-వ్యర్థాలు పూర్తిగా పనికిరాని చెత్త కాదు. వాటిలో బంగారం, వెండి, రాగి, అల్యూమినియం, పల్లాడియం వంటి 17 రకాల విలువైన లోహాలు ఉంటాయి. ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా వీటిని తిరిగి వెలికితీసి వినియోగించుకోవచ్చు. అలాగే కొన్ని పరికరాల్లోని భాగాలను మరమ్మతు చేసి తిరిగి ఉపయోగించవచ్చు.ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి విలువైన పదార్థాలను తిరిగి పొందడం వల్ల సర్క్యులర్ ఎకానమీకి బలమైన వనరుగా మారడంతో పాటు సహజ వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. కొత్త లోహాల తవ్వకం, శుద్ధి కోసం అవసరమయ్యే శక్తి, ముడిసరుకుల వినియోగాన్ని కూడా కొంత మేర తగ్గించవచ్చు.ఈ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఉదాహరణ టోక్యో ఒలింపిక్స్. 2020 టోక్యో ఒలింపిక్స్లో అథ్లెట్లకు అందించిన పతకాల తయారీకి ప్రజల నుంచి సేకరించిన పాత ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి తిరిగి పొందిన లోహాలను ఉపయోగించారు. వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చవచ్చని జపాన్ ప్రపంచానికి చాటిచెప్పింది.ఇదే స్ఫూర్తితో మనమూ ‘వేస్ట్ టు వెల్త్’ భావనను ఆచరణలోకి తీసుకురావాలి.
భారతదేశంలో ఈ-వ్యర్థాల నిర్వహణకు సంబంధించి తొలిసారిగా 2011లో నిబంధనలు తీసుకొచ్చారు. అనంతరం 2016లో కొత్త నిబంధనలు రూపొందించి, 2018లో సవరణలు చేశారు. ప్రస్తుతం ఈ-వ్యర్థాల నిర్వహణకు సంబంధించి 2022 నిబంధనలు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉన్నాయి.ఈ నిబంధనల్లో *విస్తరించిన ఉత్పత్తిదారుల బాధ్యత (Extended Producer Responsibility – EPR)*కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. అంటే, ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేసే సంస్థలు వాటి వినియోగం ముగిసిన తర్వాత ఏర్పడే వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ బాధ్యతలను నిబంధనలకు అనుగుణంగా నిర్వర్తించాలి. CPCB నిర్వహించే ఈ-వ్యర్థాల EPR పోర్టల్ ద్వారా సంబంధిత సంస్థల నమోదు, రీసైక్లింగ్ బాధ్యతల పర్యవేక్షణకు వ్యవస్థ ఉంది. అయితే, చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో వాటిని సమర్థంగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రజలు, ఉత్పత్తిదారులు, రీసైక్లర్లు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి.
ఈ-వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన పెంచడంలో పాఠశాలలు, కళాశాలలు కీలక పాత్ర పోషించాలి. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల వర్గీకరణ, రీసైక్లింగ్పై అవగాహన కల్పించాలి.విద్యార్థులు తమ ఇళ్లలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ ఈ-వ్యర్థాలపై అవగాహన కల్పిస్తే ఈ కార్యక్రమం మరింత విస్తృతమవుతుంది. ఇలా చిన్న స్థాయిలో ప్రారంభమైన ప్రయత్నాలు పెద్ద సామాజిక మార్పునకు దారితీస్తాయి.సాంకేతిక అభివృద్ధిని ఆపడం సాధ్యం కాదు. కానీ దాని వల్ల ఏర్పడే వ్యర్థాలను బాధ్యతాయుతంగా నిర్వహించడం మన చేతుల్లోనే ఉంది. ఈ-వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారేస్తే అవి పర్యావరణానికి ముప్పుగా మారతాయి. అదే శాస్త్రీయ పద్ధతుల్లో సేకరించి, పునర్వినియోగించి, రీసైక్లింగ్ చేస్తే విలువైన వనరులుగా మారతాయి.





