ఉన్నత విద్యాసంస్థలు జ్ఞానాన్ని పంచే దేవాలయాలు మాత్రమే కాదు, సమానత్వాన్ని, ప్రజాస్వామ్య విలువలను నేర్పే సామాజిక ప్రయోగశాలలు కూడా కావాలి. కానీ, దురదృష్టవశాత్తూ నేటికీ దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు కుల వివక్షకు, వ్యవస్థాగత అణచివేతకు కేంద్రాలుగా మారుతుండటం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపు ఆధారిత వివక్షను శాశ్వతంగా నిర్మూలించేందుకు ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు’ రూపకల్పనకు శ్రీకారం చుట్టడం, దానిపై క్యాబినెట్ సబ్-కమిటీ ఆధ్వర్యంలో విస్తృత సమీక్షలు జరపడం సామాజిక న్యాయ సాధనలో ఒక చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించవొచ్చు.
పదేళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే దళిత విద్యార్థి “నా పుట్టుక నా ప్రాణాంతక ప్రమాదం” అంటూ రాసిన సూసైడ్ నోట్ దేశవ్యాప్త విద్యార్థి లోకాన్ని, మేధావులను కుదిపేసింది. ఒక విద్యార్థి ప్రతిభను గుర్తించాల్సింది పోయి, కేవలం అతని సామాజిక మూలాల ఆధారంగా బహిష్కరణకు గురిచేయడం ఏ రకమైన విద్యా విధానమో సమాజం ఆలోచించాల్సి వొచ్చింది . ఆనాటి ఘటన క్యాంపస్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక క్షోభకు, అణచివేతకు అద్దం పట్టింది.అప్పట్లో రోహిత్ వేములతో పాటు ఇతర దళిత విద్యార్థులపై జరిగిన సామాజిక బహిష్కరణ, హాస్టల్ నుంచి వెలివేయడం, ఫెలోషిప్ నిలిపివేయడం వంటి పరిణామాలు ఉన్నత విద్యాసంస్థల్లో పేరుకుపోయిన పక్షపాత వైఖరిని ఎత్తిచూపాయి.
“రోహిత్ వేముల మరణం జరిగి పదేళ్లు గడుస్తున్నా క్యాంపస్లలో వివక్ష రూపాంతరాలు చెందుతూనే ఉంది. కేవలం క్రిమినల్ చట్టాల ద్వారా విశ్వవిద్యాలయాల లోపల జరిగే సూక్ష్మస్థాయి వేధింపులను అడ్డుకోలేమనే చేదు నిజాన్ని గుర్తించడమే ఈ ‘రోహిత్ వేముల బిల్లు’ ప్రధాన ఆవశ్యకత. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు, తెలంగాణ ప్రభుత్వం మార్చి 2026లో క్యాబినెట్ ఆమోదంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఐదుగురు మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసింది. “రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు, 2026” రూపకల్పనకు ప్రభుత్వం తుది కసరత్తులు చేస్తున్నది .
దేశంలో ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం-1989, పౌర హక్కుల పరిరక్షణ చట్టం-1955 వంటివి నేరపూరిత దాడులు, శారీరక అస్పృశ్యతను అరికట్టడానికి ఉద్దేశించినవి. కానీ, క్యాంపస్లలో ప్రొఫెసర్లు లేదా యాజమాన్యాలు ప్రదర్శించే “వ్యవస్థాగత/సూక్ష్మ వివక్ష”ను (ఉదాహరణకు: వైవాలో ఉద్దేశపూర్వకంగా తక్కువ మార్కులు వేయడం, మార్గదర్శకులు సరిగ్గా సహకరించకపోవడం, అవహేళన చేయడం) నిరూపించడం ఈ చట్టాల పరిధిలో కష్టంగా మారింది. విద్యార్థి ప్రతిభను కాకుండా అతని కులం, మతం, సామాజిక నేపథ్యం లేదా రిజర్వేషన్ కోటాను వేలెత్తి చూపిస్తూ చేసే మానసిక వేధింపులకు చట్టబద్ధమైన ముకుతాడు వేయాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రతిపాదిత బిల్లు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నిర్దిష్టమైన, కఠినమైన నిబంధనలతో కూడి ఉండాలి. ఈ ప్రతిపాదిత బిల్లు ద్వారా తప్పు చేసిన వ్యక్తులకు శిక్షలతో పాటు, వివక్షను అరికట్టడంలో విఫలమైన విద్యాసంస్థలపై భారీ జరిమానాలు విధించడం, ప్రభుత్వ నిధులు/గ్రాంట్లు నిలిపివేయడం వంటి నిబంధనలు ఉన్నాయి. దీనివల్ల విద్యాసంస్థల యాజమాన్యాలు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాయి. ఉన్నత విద్యాసంస్థలలో విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారానికి పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేయడం, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం , విద్యాసంస్థల యాజమాన్యాలకు జవాబుదారీతనం ఖరారు చేయడం అత్యంత కీలకం. ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక కూడా ఇలాంటి చట్టాన్ని ఆమోదించిన తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచేలా అత్యున్నత న్యాయ నిపుణుల సలహాలతో ఎటువంటి లోపాలు లేని చట్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నది. గ్రామీణ, వెనుకబడిన వర్గాల నుంచి ఎన్నో కలలతో ఉన్నత చదువుల కోసం నగరాలకు వొచ్చే విద్యార్థులకు క్యాంపస్ ఒక ‘రక్షిత ప్రాంతం’గా మారాలి. వివక్ష కారణంగా యువ మేధావుల ప్రాణాలు బలికాకుండా నిరోధించడమే ఈ చట్టం అత్యంత ముఖ్యమైన అత్యవసర ఆవశ్యకత.
ఒక చట్టం రావాలంటే కేవలం డిమాండ్లు సరిపోవు, బలమైన రాజకీయ సంకల్పం కావాలి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచన మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు వేసింది.ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షను శాశ్వతంగా నిర్మూలించి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం చేస్తున్న ఈ కసరత్తు అభినందనీయం చట్టాలు కేవలం శిక్షించడానికి మాత్రమే కాకుండా, వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి తోడ్పడాలి. విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బందిలో సామాజిక సున్నితత్వాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా ఈ చట్టంలో భాగం కావాలి. అప్పుడే ప్రతి విద్యార్థి ఏ విధమైన భయం, వివక్ష లేని స్వేచ్ఛా వాతావరణంలో విద్యను అభ్యసించగలడు. విద్యాలయాల్లో వివక్ష అంతమైనప్పుడే నిజమైన సామాజిక సమానత్వం సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఈ భగీరథ ప్రయత్నం సఫలీకృతమై, దేశంలోని అన్ని క్యాంపస్లకు ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.





