దేశ ప్రధాన సమస్యల్లో పేదరికం, అధిక జనాభా, అవిద్య, ప్రజారోగ్యం, ఆర్థిక – సామాజిక అసమానతలు లాంటి పలు సమస్యలతో పాటు ఆహార అభద్రత సంక్షోభం అనాదిగా వెంటాడుతున్నాయి. నేడు ఆహార భద్రత సాధనలో కొంత మెరుగైన ఫలితాలను సాధించిన భారతంలో పోషకాహార భద్రత మాత్రం అందని ద్రాక్షే అవుతున్నది. ముఖ్యంగా పోషకాహార లోప విష వలయంలో చిక్కిన బాల భారతం రాబోయే నవతరానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఆహార లభ్యతతో ఆరోగ్యం సిద్ధించదని, పోషకాహార లభ్యతే సమాజ ఆరోగ్యానికి సంరక్షణ గొడుగుగా ఉపకరిస్తుందని మనకు తెలుసు.
పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మింపబడుతుందని, పోషకాహార ప్రయోజనాలను అన్ని వర్గాల ప్రజలకు వివరించడానికి కేంద్ర మహిళ-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘‘ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్’’ సౌజన్యంతో 1982 నుంచి ప్రతి ఏట సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ‘‘జాతీయ పోషకాహార వారోత్సవాలు (నేషనల్ న్యూట్రిషన్ వీక్)’’ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. సెప్టెంబర్ మాసాన్ని ‘‘జాతీయ పోషకాహార మాసం’’గా కూడా పాటిస్తూ ‘‘భవిష్యత్తుకు ఇంధనం(ఫుయల్ ఫర్ ది ఫ్యూచర్)’’ అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతున్నది.
అందరికీ ఆరోగ్యకర పోషకాహారం సాధ్యమేనా ! జాతీయ పోషకాహార వారోత్సవాలు-2024నినాదంగా ‘‘ప్రారంభం నుంచే సరైన పోషకాహారం అందిద్దాం (ఫీడిరగ్ స్మార్ట్ రైట్ ఫ్రమ్ స్టార్ట్)’’ అనబడే అంశాన్ని తీసుకొని అవగాహన కల్పిస్తున్నారు. ప్రజారోగ్య సాధనకు పునాది పోషకాహారమే. పోషకాహారం తీసుకోవడంతో గుండె జబ్బులు, గుండె పోటు, మధుమేహం, క్యాన్సర్ లాంటి జబ్బులు దూరం అవడమే కాకుండా సంపూర్ణ మానసిక-శారీరక ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. ఇండియాలో ఐదేళ్లలోపు బాలల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు దీర్ఘకాలం పాటు పోషకాహార కోరల్లో చిక్కి శరీరక ఎదుగుదల లోపంతో (స్టంటెడ్ గ్రోత్) బాధపడుతున్నట్లు తెలుస్తున్నది.
పోషకాహార లోపం, పేదరికం, అవిద్య, సురక్షిత నీటి కొరత, పరిసరాల అశుభ్రత లాంటి సమస్యల కారణంగా బాలల శారీరక-మానసిక ఎదుగుదల కుంటుపడుతున్నది. సాధారణ ప్రజలతో పాటు మహిళలు, గర్భిణీలు, కుటుంబ పెద్దలు, నిరక్షరాస్యులు వంటి వర్గాలతో పాటు పోషకాహార లోపం పట్ల విద్యాలయాల్లో తప్పనిసరిగా అవగాహనలు కల్పించాలి. పోషకాహార అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చడం ఎంతో మేలును చేస్తుంది. ప్రజల, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు, ప్రభుత్వ శాఖలు, ప్రజారోగ్య వ్యవస్థల సమన్వయంతో పోషకాహార ప్రయోజనాలను గ్రామీణ స్థాయికి చేర్చడం జరగాలి.
పోషకాహార ప్రయోజనాలు:
సమతుల పోషకాహారంలో ఎదుగుదలకు అవసరమైన పిండి పదార్థాలు, ఒమెగా-3 కొవ్వులు, మాంసకృత్తులు, నీరు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు లాంటివి తప్పనిసరిగా సరైన పాళ్లలో అవసరం అవుతాయి. ఈ పదార్థాలు సమపాళ్ళలో ఉన్న ఆహారాన్ని మాత్రమే ‘‘సమతుల ఆహారం(బ్యాలెన్స్డ్ డయట్)’’గా పిలుస్తారు.బాలల్లో వయసుకు తగిన పొడవు, బరువు, చురుకుదనం, శక్తి కలిగి ఉండడానికి పోషకాహారం దోహదపడుతుంది. వ్యాధినిరోధక శక్తి సమకూరడం, మానసిక స్థితుల్లో సమతుల్యత, జీవిత కాలం పెరగడం, దీర్ఘకాలిక జబ్బులకు దూరంగా ఉండడం, క్రియాశీలత పెరగడం, వృత్తిలో సాఫల్యతలు, ఏకాగ్రత పెరగడం, ఎల్లవేళల ఆరోగ్యం సిద్ధించడం, సంపూర్ణ ఆరోగ్యంతో ఆర్థిక చిక్కులు దూరం కావడం, దేశాభివృద్ధిలో పాలు పంచుకోవడం లాంటి పలు పోషకాహార ప్రయోజనాలు కలుగుతాయని తెలుసుకోవాలి.
పోషకాహార చిట్కాలు:
జాతీయ పోషకాహార వారోత్సవాల వేదికగా పోషకాహార ప్రయోజనాలను సామాన్యులకు అవగాహన పరచడానికి పలు సభలు, సమావేశాలు, సదస్సులు, కార్యశాలలు, పోషకాహార ప్రదర్శనలు, విద్యాలయాల్లో పోషకాహార అంశాల్లో పోటీలు, వైద్యరోగ్య శిబిరాలు, వంటల పోటీలు, రైతులకు అవగాహనలు, సామాజిక వనాల నిర్వహణలు, ఆన్లైన్/సామాజిక మాధ్యమ వేదికగా ప్రచారాలు, వెల్ బేబీ షోల నిర్వహణ లాంటివి నిర్వహిస్తున్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు, పేదరికంతో పోరాడుతున్న ప్రపంచ మానవాళి జీవితాల్లో కరోనా విపత్తు పిడుగులా పడడం, అన్ని వర్గాల ప్రజలకు తీవ్రమైన దీర్ఘకాలిక ఆహార అభద్రత కమ్ముకోవడం జరగడం విచారకరం. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, అతిగా పాలిష్ చేయని బియ్యం/గోధుమలు, డ్రై ఫ్రూట్స్, ఓట్స్, కీర దోసకాయలు/క్యారెట్/బీట్ రూట్ సలాడ్స్, చేపలు, తృణధాన్యాలు, ప్రోటీన్ ఫుడ్స్, గుడ్లు, మాంసం, చిక్కుళ్లు, సంతృప్త ట్రాన్స్ కొవ్వులు, అనారోగ్య కొవ్వు పదార్థాల వాడకాన్ని తగ్గించడం, పరిమిత పిండి పదార్థాలు లాంటి పోషకాహారాలను తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు.
అనారోగ్యకర ఆహార పదార్థాలు:
ఫాస్ట్ ఫుడ్స్, నిల్వ ఉంచిన ప్యాకెట్ ఫుడ్స్, శీతలపానీయాలు, నూనెలో ఫ్రై చేసిన పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం, లవణం/సోడియం/షుగర్/ కొవ్వులు అధికంగా ఉన్న పదార్థాలు, ఫ్రిజ్లో నిలువ ఉన్న ప్యాకెట్ ఫుడ్స్, చాక్లెట్లు, సోడా పానీయాలు, ఎరుపు రంగు మాంసం, అధిక లవణాలున్న స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్స్ లాంటి పలు రకాలైన ఆహారాల నుంచి దూరంగా ఉండాలని అవగాహన కల్పించాలి.
పోషకాహారమే సంపూర్ణ ఆరోగ్య మహాభాగ్యమని నినదిద్దాం. అభాగ్యులైన బక్కచిక్కిన భారతానికి పోషకాహార గొడుగు పట్టి ఆరోగ్యకర సమాజ స్థాపనకు సిద్ధం అవుదాం. బాలలు, గర్భిణులు, శిశువులకు పోషకాహారం అందిస్తే ఆరోగ్యకర భవిత నిర్మితమవుతుందని నమ్ముదాం. పల్లెం నిండా పచ్చడి మెతుకులతో కడుపు నింపుకోవడం సరికాదని, పోషకాహారాన్ని రెండు ముద్దలు తిన్నా మేలు అని ప్రచారం చేద్దాం. పోషకాహార లోపాన్ని తరిమి వేస్తూ, ఆరోగ్య సౌభాగ్య భారతాన్ని నిర్మించడంలో మనందరం భాగస్వాములం అవుతూ, రేపటి ఆరోగ్య బాల భారతాన్ని నిర్మించుకుందాం.