విదేశీ నుంచి స్వ‌దేశీ చేతుల్లోకి ధ‌ర‌ణి

త్వ‌ర‌లో ధ‌ర‌ణి స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తా..
రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌,  అక్టోబ‌ర్ 22 :- ఇప్ప‌టి వ‌ర‌కు విదేశీ సంస్ధ టెర్రాసిస్ చేతిలో ఉన్న ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ను స్వ‌దేశీ సంస్ధ ఎన్ఐసికి అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 1 వ‌తేదీ నుంచి తెలంగాణలో భూ రికార్డుల నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ను జాతీయ స‌మాచార సంస్ధ (ఎన్ఐసి ) నిర్వ‌హిస్తుంద‌ని ఈ మేర‌కు ఉత్వ‌ర్వులు జారీ చేశామ‌ని మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. త్వ‌ర‌లో ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల‌కు పూర్తి విముక్తి క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. గ‌త  బిఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎలాంటి ముందు చూపు లేకుండా హ‌డావిడిగా తొంద‌ర‌పాటు నిర్ణ‌యాల‌తో తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ వ‌ల్ల తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంద‌ని మంత్రి పొంగులేటి ఆరోపించారు. అప్ప‌ట్లో బిఆర్ఎస్ ప్ర‌భుత్వ పెద్ద‌లు తెలంగాణ‌కు చెందిన 1.56 కోట్ల ఎక‌రాల భూమిని టెర్రాసిస్ అనే విదేశీ కంపెనీకి తాక‌ట్టు పెట్టార‌ని విమ‌ర్శించారు.

ఒడిశా రాష్ట్రంలో ఈ సంస్ధ ప‌నిచేసి విఫ‌ల‌మైంది. ఇటువంటి సంస్ధ‌కు కేవ‌లం త‌మ స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం బిఆర్ఎస్ పెద్ద‌లు క‌ట్ట‌బెట్టిన‌ట్లు మంత్రి పొంగులేటి ఆరోపించారు. లక్షలాది రైతులకు చెందిన కోట్లాది ఎకరాల వ్యవసాయ భూములను, లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి అయిన కేసీఆర్, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఏకపక్షంగా యథేచ్ఛ‌గా విదేశీ కంపెనీలకు అప్పగించగా ఐదేళ్లపాటు ధరణి పోర్టల్ రైతులను నానా ఇబ్బందులు పెట్టింద‌ని తెలిపారు.  కాంగ్రెస్ చెప్పిన ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి అప్ప‌గించామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తద్వారా 71, 00,000 ఖాతాల రైతుల భూములకు పూర్తి రక్షణ లభిస్తుంద‌న్నారు.

ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ను మార్చ‌డం వ‌ల‌న రాష్ట్రంలోని ల‌క్ష‌లాది కుటంబాలు స‌మ‌స్య‌లు ,ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని , అంద‌రి భూ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారాలు త్వ‌ర‌లో ల‌భిస్తాయ‌ని మంత్రి వివ‌రించారు. 2020 అక్టోబ‌ర్ లో తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ దారిత‌ప్పి లోప‌భూయిష్టంగా మారి ప్ర‌జానీకానికి శాపంగా మారింద‌న్నారు. ధ‌ర‌ణి పేరుతో జ‌రిగినా ద‌గా వ‌ల్ల తెలంగాణ స‌మాజం తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల‌లో బిఆర్ఎస్ ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌ను స‌మాధి చేసింద‌ని మంత్రి ఆరోపించారు. ఆ నాటి ప్ర‌భుత్వ పెద్ద‌ల దాష్టీకానికి ప్ర‌జ‌లు అనుభ‌వించిన బాధ‌లు అన్నీ ఇన్నీకావ‌ని, కాంగ్రెస్ ప్ర‌భుత్వం వీటికి చ‌ర‌మ‌గీతం పాడుతుంద‌ని మంత్రి పొంగులేటి స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *