రాజకుటీర సింహాసన కిరీటాల వలయం ఈ ప్రపంచం,
ఈ విభజనల ప్రపంచమే మనిషికి శత్రువు.
నిత్యం మూఢాచార మూలుగులతో,
సంపదల పెంపులతో వెంపర్లాడునీ లోకం.
ఇచ్చోటనే శరీరాలు గాయపడ్డాయి,
ఆత్మలు దాహార్తి మయమయ్యాయి.
కళ్లల్లో కల్లోలం రేగి,
గుండెల్లో దిగులు పుట్టుకొచ్చింది.
అస్తిత్వం ఓ ఆటవస్తువయింది.
మృతుల్నే ఆరాధించే ఈ లోకంలో,
జీవితానికి విలువ లేదు.
ఇక్కడ చావొక్కటే చౌక.
యువతంతా దుర్మార్గాల్లో ఉరకలేస్తోంది,
వేశ్యత్వం అలంకారపు బొమ్మయింది.
ఇక్కడ ప్రేమే వ్యాపారానికి మరో పేరు,
మనిషికి విలువ లేని ఈ లోకంలో,
గౌరవాలు, స్నేహాలు ఒట్టి మట్టి పెడ్డలు.
ప్రేమకి విలువనివ్వని ఈ ప్రపంచాన్ని,
కాల్చేయండి లేదా పేల్చేయండి.
కనీసం నా చూపు నుంచైనా దూరం చేయండి.
ఈ లోకపునీతిని నే భరించలేను.
ఈ ప్రపంచం మీదే,
మీ దగ్గరే భద్రంగా దాచుకోండి!
(మూలం: ప్యాసా (1957) హిందీ చిత్రం నుండి ‘‘ఏ దునియా అగర్ మిల్ బి జాయే..’’ అనే పాటకి సాహిర్ లుధియాన్వి అందించిన సాహిత్యం)
అనువాదం: బాలాజీ పోతుల
8179283830